జిల్లాలో వినాయక ప్రతిమల వద్ద సమైక్య పూజలు సాగాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని సమైక్యవాదులు గణనాథుడిని వేడుకున్నారు.
సాక్షి, కడప : జిల్లాలో వినాయక ప్రతిమల వద్ద సమైక్య పూజలు సాగాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని సమైక్యవాదులు గణనాథుడిని వేడుకున్నారు. కేంద్రానికి, తెలంగాణ వాదులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. వినాయక చవితి పండుగరోజు జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు, నిరసనలు సాగాయి. మంగళవారం రోజు ఉద్యమం జోరందుకుంది. ఉద్యోగులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా మానవహారాలు, ఆందోళనలతో ఉద్యమం పతాకస్థాయికి చేరింది.
కడపలో వినాయక చవితి రోజు సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక, మున్సిపల్, న్యాయవాదులు, డీఆర్‌డీఏ, విద్యుత్ కార్మికుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. మంగళవారం కడప నగరంలో ఉపాధ్యాయ జేఏసీ, మేధావుల సంఘం ఆద్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు.
సమైక్య నినాదాలతో కలెక్టరేట్ పరిసరాలను హోరెత్తించారు. వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. పవన్ స్కూలు విద్యార్థులు ర్యాలీతో కదం తొక్కారు. ఉద్యమ కార్యాచరణపై జేఏసీ ఆధ్వర్యంలో ఏజేసీ సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు. 12న పోస్టుకార్డుల ఉద్యమం, 13న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత, 14న రింగ్‌రోడ్డులో మానవహారాలు చేపట్టాలని నిర్ణయించారు. 16వ తేదీ నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని సూచించారు.
16వ తేదీ వరకు ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని యాజమాన్యాలను కోరారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, ఇరిగేషన్, గృహ నిర్మాణ సంస్థ, ప్రైవేటు వృత్తి విద్య కళాశాలలు, వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు, మున్సిపల్, విద్యుత్, డీఆర్‌డీఏ రిలే దీక్షలు సాగాయి. కడప నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు కమలమ్మ, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిలను ఉద్యోగులు చుట్టుముట్టి రాజీనామాలు ఆమోదింపజేసుకుని రావాలని కోరారు.
జమ్మలమడుగులో సోమవారం రిలే దీక్షలు సాగాయి. మంగళవారం మోరగుడి, దొమ్మర నంద్యాల, వేపరాల, మైలవరం, జమ్మలమడుగు గ్రామాలకు చెందిన వేలాది మంది చేనేత కార్మికులు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. ఆర్టీపీపీ, ఎర్రగుంట్లలలో రిలే దీక్షలు సాగుతున్నాయి. వినాయక చవితిరోజు ఎర్రగుంట్లలో ఆరు జిల్లాల హాకీ క్రీడాకారులు క్రీడా మైదానం నుంచి నాలుగు రోడ్ల కూడలిలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు.
పులివెందులలో పండుగ రోజు జేఏసీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద స్కూలు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. పోలీసులకు రాఖీలు కట్టి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. మంగళవారం జీపులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తరగతులు బహిష్కరించారు.
ప్రొద్దుటూరు పట్టణంలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు, న్యాయవాదులు, వైద్యుల రిలే దీక్షలు సాగాయి. రాజుపాళెం మండలానికి చెందిన వైద్య ఆరోగ్య సిబ్బంది పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో 24వ వార్డుకు చెందిన ముస్లిం మైనార్టీలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
మైదుకూరులో ఉపాధ్యాయులు, జెడ్పీ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు.
రైల్వేకోడూరులో మైనంపాటి కళాపీఠం ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహం వద్ద రోడ్డుపైనే ప్రజలు బైఠాయించారు. వీరికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వారు సంఘీభావం తెలిపారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మద్దతు ప్రకటించారు. హైదరాబాదు నుంచి తిరుగు ప్రయాణంలో వస్తున్న ఉద్యోగుల బస్సుపై రాళ్లు వేయడాన్ని నిరసిస్తూ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు.
బద్వేలులో వినాయక చవితి పండుగరోజు వైఎస్సార్‌సీపీ, ఐకాస దీక్షలు కొనసాగాయి. మంగళవారం బద్వేలు పట్టణంలో టైలర్లు భారీ ర్యాలీ నిర్వహించి నాలుగురోడ్ల కూడలిలో మిషన్లు కుట్టి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. పోరుమామిళ్లలో వైఎస్సార్‌సీపీ నేతలు చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి నేతృత్వంలో పుల్లీడు గ్రామ పంచాయతీకి చెందిన కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రాజంపేట పట్టణంలో వైఎస్సార్ సీసీ ఆధ్వర్యంలో 14, 15 వార్డులకు చెందిన కార్యకర్తలు పట్టణ కన్వీనర్ పోలా శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో రిలే దీక్షలు చేపట్టారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సంఘీభావం తెలిపారు. వైద్యులు పట్టణంలో కార్ల ర్యాలీ చేపట్టారు. కాకతీయ విద్యా సంస్థల అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీగా వచ్చి రిలే దీక్షలు చేపట్టారు. వీరికి ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి మద్దతు తెలిపారు.
కమలాపురం పట్టణంలో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో చౌక సెంటర్‌నుంచి క్రాస్‌రోడ్డు వరకు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. క్రాస్‌రోడ్డు వద్ద బైఠాయించి మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేపట్టారు.
రాయచోటి పట్టణంలో మోడల్ స్కూలు విద్యార్థులు సుండుపల్లె-రాయచోటి రోడ్డులో చెస్‌తోపాటు పలు ఆటలాడి నిరసన తెలియజేశారు. ఆర్టీసీ కార్మికులు పట్టణంలో ర్యాలీని చేపట్టారు. ఆర్డీఓ వీరబ్రహ్మం నేతృత్వంలో ఉద్యమ కార్యాచరణపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 16న రాయచోటిలో రణ గర్జన సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.