‘సమైక్య’ హోరు
- రెండో రోజూ రెవెన్యూ ఉద్యోగుల సమ్మె
- జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు
- పలమనేరులో ఎన్‌జీవోల రాస్తారోకో
- మదనపల్లెలో ఉద్యోగుల మానవహారం
సాక్షి, చిత్తూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు రెండో రోజు శుక్రవారమూ కొనసాగాయి. జిల్లాలోని 66 రెవెన్యూ కార్యాలయాలు మూతపడ్డాయి. రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ పూర్తిస్థాయిలో సమైక్యాం ధ్ర సమ్మెను కొనసాగిస్తోంది. మదనపల్లె, చిత్తూరు లాంటిచోట్ల జేఏసీ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బయటకు పంపారు. చిత్తూరులో ఎన్‌జీవోలు ర్యాలీ నిర్వహించారు. నీటిపారుదలశాఖ ఉద్యోగులు, జెడ్పీ ఉద్యోగులు ర్యాలీ లో పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
కలెక్టరేట్‌లో రెవెన్యూ సర్వీసెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రవాణాశాఖ కార్యాలయంలో కార్యకలాపాలు స్తంభించాయి. జిల్లా అధికారులు కార్యాలయాలకు వచ్చి కూర్చున్నారు. తిరుపతిలో తహశీల్దారు, సివిల్ సప్లయిస్, ఆర్‌డీవో కార్యాల యాలు మూతపడ్డాయి. భూసర్వే, స్టాటిస్టికల్ విభాగాల ఉద్యోగులు విధులు బహిష్కరించారు. జ్యోతి రావు పూలే విగ్రహం నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు రాజకీయపార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 9వ తేదీ సమైక్య రన్‌కు సన్నాహకంగా ఈ ర్యాలీ చేపట్టారు.
మదనపల్లెలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసేవారిని బయటకు పంపేశారు. పోస్టాఫీసు ఎదుట మౌన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. తహశీల్దారు కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. హౌసింగ్, ఆర్‌డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని జేఎసీ నాయకులు బయటకు పంపేశారు.
శ్రీకాళహస్తిలో రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేశారు. రెవెన్యూ ఉద్యోగులు మాత్రం విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు.
పలమనేరులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలనూ మూసేశారు. పలమనేరులోని చెన్నై-బెంగళూరు రహదారి వద్ద ఎన్‌జీవో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
పుత్తూరులో బ్యాంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. తహశీల్దారు కార్యాలయం పని చేయలేదు. రాజకీయపార్టీల నాయకులు మ ద్దతు ప్రకటించారు.
కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లె మండలాల్లోనూ రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.