విజయపురిసౌత్‌లో సమైక్య సభ విజయవంతం
Published Sat, Oct 19 2013 2:42 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
మాచర్లటౌన్/విజయపురిసౌత్, న్యూస్‌లైన్: జై సమైక్యాంధ్ర నినాదాలతో సాగర తీరం మార్మోగింది. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ నాగార్జునసాగర్ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం విజయపురిసౌత్ పీటీజీ పాఠశాల ముందు భాగంలో నిర్వహించిన ‘చలో నాగార్జునసాగర్’ సభవిజయవంతమైంది. సభలో ప్రజలు వేలాదిగా పాల్గొని సమైక్యాంధ్ర నినాదాలతో తమ సంఘీభావాన్ని తెలిపారు. సమ్మెను విరమించిన అనంతరం ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సభా ప్రాంగణానికి విచ్చేసిన అశోక్‌బాబుపై సమైక్యవాదులు పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి అశోక్‌బాబు మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు కావాలా హైదరాబాద్ కావాలా అని తనను అడిగితే సాగర్‌నే కోరుకుంటానని అశోక్‌బాబు ఈ సందర్భంగా చెప్పారు. సాగర్ లక్షలాది మంది రైతులకు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర విభజన వల్ల సాగర్‌కు నీరు విడుదల కాని పరిస్థితి ఉంటుందన్నారు. సాగర్ పక్కనే ఉన్న రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆలోచించి 66 రోజుల పాటు సమ్మె చేశామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు ఇస్తున్న 18 టీఎంసీల నీటిని ఇటు వైపు రైతులకు ఉపయోగిస్తే మరికొన్ని లక్ష ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. సాగర్‌ను వదులుకుంటే హైదరాబాద్ వారు మంచినీరు లేక మళ్లీ కలసి ఉండాలని కోరుకునే పరిస్థితి వస్తుందన్నారు. విభజన జరిగితే ఇరు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండే ప్రాంతంలో నీటి సమస్య గురించి తెలియపరిచేందుకే ఈ సమైక్య సభను నాగార్జునసాగర్‌లో నిర్వహించటం జరిగిందన్నారు. సాగర్ పక్కనే ఉన్న మాచర్ల ప్రాంతానికి ఇప్పటికీ సాగు నీరు అందకపోవటం దురదృష్టకరమన్నారు. విభజన జరిగితే మరింత దుర్భర పరిస్థితులు ఏర్పడతాయన్నారు.
రాష్ట్ర విద్యుత్ జేఏసీ నాయకుడు సత్యానందం మాట్లాడుతూ సాగర్ జలా ల వినియోగం, విద్యుత్ ఉత్పత్తి గురించి తెలియపర్చి రాష్ట్ర దిశను ని ర్దేశించే సాగర్ ప్రాంతంలో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఈ సభను నిర్వహించామన్నారు. రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 66 రోజుల పాటు ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రజలంతా ఒక్క మాట అనకుండా సహకరించారన్నారు. హైదరాబాద్ నగర ఎన్‌జీవో సంఘ అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు సాగర్‌లో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ఎన్‌జీవో సంఘ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మా ట్లాడుతూ కేంద్ర మంత్రులు, ఎంపీలు మాటలు మార్చి మాట్లాడుతున్నారన్నారు. విజయవాడ సిటీ ఎన్‌జీవో సంఘ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీ నాయకులు ఉద్యమానికి మద్దతుగా నిలబడకపోతే రాబోయే ఎన్నికల్లో వారి భరతం పడతామని, గ్రామగ్రామాన తిరిగి వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ప్రసంగించారు.
Advertisement