కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పల్లె ప్రాంతాలకు తీసుకెళ్లి గ్రామీణులను మమేకం చేసినప్పుడే కేంద్రం దిగి వస్తుందని అభిప్రాయపడిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులందరూ, ముఖ్యంగా ఉపాధ్యాయులు గ్రామ సభలు నిర్వహించి విభజన వల్ల మనకు జరిగే నష్టాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం స్థానిక జిల్లాపరిషత్ సమావేశ భవనంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఈఓఆర్‌డీ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 46 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా పాలకుల్లో స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడంలో భాగంగా జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఈ నెల 16వ తేదీన సర్పంచు అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. చేసిన తీర్మానాలను 8 ప్రతులుగా చేసి దేశ ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌కు వేర్వేరుగా పోస్ట్ చేయాలన్నారు. మిగతా ఒక తీర్మాన ప్రతిని పంచాయతీ రికార్డుల్లో భద్రపరచాలని సూచించారు. మండల స్థాయిల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు.
రాయలసీమతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు అత్యంత వెన కబాటుతో ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసిన తర్వాతే విభజన గురించి ఆలోచించాలని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో సూచించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన జరిగితే నదీ జలాల సమస్య తీవ్ర రూపం దాల్చుతుందన్నారు. విద్య, ఉపాధి, వైద్య రంగాల్లో కూడా రాయలసీమ ప్రజలు తీవ్ర నష్టాలకు గురవుతారన్నారు.
ఉద్యమాన్ని మరింత బలోపేతం చేద్దాం
కలిసివచ్చే రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని డీఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమైక్యాంధ్ర పరిరక్షణ సమావేశానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈశ్వర్, జెడ్పీ డిప్యూటి సీఈఓ జయరామిరెడ్డి, ఏఓ భాస్కర్‌నాయుడు, పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి, పీఆర్ మినిస్ట్రీయల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దస్తగిరిబాబు, ఈఓఆర్‌డీల సంఘం నాయకులు ఏలీషా, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు తిమ్మన్న, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, అన్ని శాఖల ఉద్యోగులు హాజరయ్యారు.
పల్లెవాణి ఢిల్లీలో ప్రతిధ్వనించాలి
Published Sun, Sep 15 2013 3:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement