సాక్షి, అనంతపురం : జిల్లాలో ‘సమైక్య’ జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. ఏడో రోజైన మంగళవారం కూడా బంద్ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసి వేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జేఎన్‌టీయూ(ఏ)లో పీజీ సెట్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం పీజీ సెట్‌ను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అనంతపురం నగరంలో ర్యాలీ నిర్వహించారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. అనంతరం రైల్వేస్టేషన్ చేరుకుని రైల్‌రోకో చేపట్టారు.
కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకున్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మచ్చారామలింగారెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయులు ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కేబుల్ ఆపరేటర్లు అన్ని ఎంటర్‌టైన్‌మెంట్ చానెళ్ల ప్రసారాలను నిలిపేసి... నగరంలో ర్యాలీ చేపట్టారు. జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలేనిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరాయి. సమైక్యాంధ్ర జేఏసీ రాయలసీమ కన్వీనర్ బీసీ నాగరాజు ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ సర్కిల్‌లో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ట్రాన్స్‌కో, ఆర్టీసీ, రెవెన్యూ ఉద్యోగులు ప్రదర్శనలు నిర్వహించి... స్థానిక సప్తగిరి సర్కిల్‌లో సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్టీఏ కన్సల్టెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోనియా, రాహుల్, మన్మోహన్ , దిగ్విజయ్, కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ముఖచిత్రాలతో రూపొందించిన ‘రాజకీయ రాక్షసి’ ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఇది అందర్నీ ఆకట్టుకుంది. స్థానిక ఆర్టీఏ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన వారు.. సప్తగిరి సర్కిల్‌లో ‘రాజకీయ రాక్షసి’ ఫ్లెక్సీని దహనం చేశారు.
ట్రావెల్స్ అసోసియేషన్, మేదర సంఘం, ఇతర కులసంఘాల ఆధ్వర్యంలో సుభాష్‌రోడ్డులో వంటావార్పు చేపట్టారు. కొత్తూరు కూరగాయల మార్కెట్ వ్యాపారులు పెద్దసంఖ్యలో తరలివచ్చి.. టవర్‌క్లాక్ సర్కిల్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేశారు. ట్రాక్టర్లు, ఐషర్ వాహనాలతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజీ లెక్చరర్లు రోడ్డు ఊడ్చి నిరసన తెలిపారు. కలెక్టరేట్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ నెల 12 నుంచి చేపట్టే నిరవధిక సమ్మెకు సంబంధించిన నోటీసును కలెక్టర్‌కు అందజేశారు. ఎస్కేయూలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. మూడుపూటలా రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. తాడిపత్రిలో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షా శిబిరంలోనే పెద్దపప్పూరు మండలం అమళ్లదిన్నెకు చెందిన వ్యవసాయ కూలీ కుళ్లాయప్ప పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతన్ని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
తాడిపత్రిలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ముదిగుబ్బలో రైల్‌రోకో చేశారు. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో ఆందోళనలు, రాస్తారోకోలు హోరెత్తాయి. గుంతకల్లులో జాక్టో దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలో ఉద్యమకారులు ఎక్కడికక్కడ రోడ్లపై వంటావార్పు చేపట్టారు. గుత్తిలో సమైక్యవాదులు అరగుండు చేయించుకుని నిరసన తెలిపారు. వంటా-వార్పు చేపట్టి.. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందూపురంలో డాక్టర్లు, జేఏసీ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు, ఏపీ ట్రాన్స్‌కో, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు, నాయీబ్రాహ్మణులు భారీ ప్రదర్శనలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా హిందూపురం మెప్మా ప్రాజెక్ట్ అధికారిగా విజయభాస్కర్ అలియాస్ భాస్కర్ రాయల్ చేసిన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ పట్టణ మహిళా సమైక్య సంఘాల సభ్యులు వేలాదిమంది మున్సిపల్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. కదిరిలో వంటా వార్పు, చెక్కభజనలు, కోలాటాలు, దీక్షలు, నిరసస ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు. ట్రాన్స్‌కో, మున్సిపల్ ఉద్యోగులు భారీ ర్యాలీలు నిర్వహించారు. పట్టణ మహిళా సంఘాల సభ్యులు స్థానిక ఇందిరాగాంధీ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. కళ్యాణదుర్గంలో జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు.
యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టీసర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్ర విభజనతో మనస్తాపానికి గురైన మహేశ్ అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మడకశిర, అగళి, అమరాపురం, రొళ్ల మండలాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లోని ప్రతి మండలంలోనూ నిరసనలు మిన్నంటాయి. రాయదుర్గంలో మెడికల్‌షాపులు కూడా బంద్ చేశారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు, కేబుల్ ఆపరేటర్లు ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రైల్‌రోకో చేశారు. ఇద్దరు మునిసిపల్ ఉద్యోగులు శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన, బజారు నిద్ర చేపట్టారు. కణేకల్లు, కనగానపల్లిలో వంటావార్పు నిర్వహించారు. ఆత్మకూరులో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. రామగిరి, రాప్తాడు, శింగనమల మండలాల్లో నిరసన ర్యాలీలు హోరెత్తాయి. శింగనమలలో రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. గార్లదిన్నెలో వైద్య సిబ్బంది విధులు బహిష్కరించారు. సోనియాగాంధీకి మంచిబుద్ధి ప్రసాదించాలని ఉరవకొండలోని చౌడేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
‘సమైక్య’ జ్వాలలు
Published Wed, Aug 7 2013 1:57 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement
Advertisement