కలకలం రేపిన ఆకాశరామన్న ఉత్తరం | Unknown person write letter Teacher | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన ఆకాశరామన్న ఉత్తరం

Published Tue, Feb 4 2014 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM

Unknown person write letter Teacher

తుమ్మలపెన్‌పహాడ్ (ఆత్మకూర్(ఎస్), న్యూస్‌లైన్: ఉపాధ్యాయురాలికి అందిన ఆకాశరామన్న ఉత్తరం.. చివరికి ఆమె సస్పెన్షన్ కారణమైంది. అయితే సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేయవద్దంటూ సోమవారం విద్యార్థులు పాఠశాల గేటుకు తాళం వేసి ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన తుమ్మలపెన్‌పహాడ్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. స్థానికులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం... పాఠశాల ఉపాధ్యాయురాలు గన్నా జ్యోతికి గత నెల 8వ తేదీన అసభ్యకర పదజాలంతో కూడిన ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరం  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్ రాశాడంటూ ఆయనతో ఘర్షణకు దిగింది. అతను మాత్రం తనకు ఆ ఉత్తరంతో ఎలాంటి సంబంధమూ లేదని, కావాలంటే న్యాయ విచారణ కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించాడు.
 
 ఆ తర్వాత సంక్రాంతి సెలవులు కావడంతో సమస్య సద్దుమణిగింది. తిరిగి పాఠశాల పునఃప్రారంభం అయిన 21వ తేదీన పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిని ఉపాధ్యాయురాలు అసభ్యకరంగా దూషించింది. దీంతో అతను ఎంఈఓ శంకర్‌నాయక్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎంఈఓ విచారణ జరిపి డీఈఓకు నివేదిక పంపారు. ఆ తర్వాత పాఠశాలలో జరుగుతున్న ఘర్షణపై గ్రామస్తులకు, సర్పంచ్‌కు ఇరు వురు తెలపగా సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. ఇదిలా ఉండగా నివేదికను పరిశీలించిన డీఈఓ సద రు ఉపాధ్యాయురాలి వ్యవహారశైలిని తప్పుపడుతూ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయురాలు గ్రామస్తులు, విద్యార్థులతో కలిసి సోమవారం పాఠశాల గేటుకు తాళం వేసి ధర్నా నిర్వహించారు. సస్పెన్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎంఈఓ, పోలీసులు పాఠశాలకు వచ్చి ధర్నా విరమింపజేశారు.
 
 సస్పెన్షన్ ఆర్డర్ పంపాం
 తుమ్మలపెన్‌పహాడ్ పీఎస్ ప్రధానోపాధ్యాయుడిని దూషించిన ఉపాధ్యాయురాలి విషయంలో ఎంఈఓ పంపిన నివేదికను పరిశీలించి ఆమెపై సస్పెన్షన్ వేటు వేసినట్టు డీఈఓ జగదీష్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. సస్పెన్షన్ ఆర్డర్‌ను ఎంఈఓ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపినట్టు పేర్కొన్నారు. పాఠశాల గేటుకు తాళం వేసి ధర్నా నిర్వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఈఓ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement