ఐపీ మిల్లు నిర్మించిన మరుగుదొడ్లు, తరగతి గదిలో పగలగొట్టిన మద్యం సీసాలు
సాక్షి, కడియం(తూర్పుగోదావరి) : కడియపులంక ఉన్నత పాఠశాలలో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. స్కూల్ సమయం పూర్తయ్యాక మైదానంలోకి వస్తున్న ఆకతాయిలు స్కూల్లోని పలు వస్తువులను ధ్వంసం చేస్తున్నారు. గదులకు వేసిన తాళాలు పగులగొట్టి అందులో కూర్చుని మద్యం తాగుతున్నారు. సీసాలను అక్కడే పగులగొట్టి పడేస్తున్నారు. మద్యం మత్తులో బెంచీలను కూడా విరగ్గొట్టేస్తున్నారు. విద్యార్థినులు వినియోగించే మరుగుదొడ్లను ధ్వంసం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ పేపరుమిల్లు సహకారంతో స్కూల్లో నిర్మించిన మరుగుదొడ్లు ఆకతాయిల కారణంగా ప్రస్తుతం వినియోగించుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడకుండా మారిపోయాయంటే వీరి ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
జనవరి నెలలోనే వీటిని ప్రారంభించారు. ఆరు నెలలు గడిచాయోలేవో వీటి రూపురేఖలే మారిపోయే విధంగా ధ్వంసం చేశారు. రాళ్లతో బాత్‌రూమ్ తలుపులను కొడుతుండడంతో అవి మొత్తం విరిగిపోయాయి. కొన్నింటికి పెద్దపెద్ద రంధ్రాలు పడిపోయాయి. దీంతో వాటిని వినియోగించుకునేందుకు అడ్డుగా ప్లాస్టిక్ సంచులను కట్టుకోవాల్సి వస్తోందని విద్యార్థినులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. స్కూల్ సమయం ముగిశాక ఆడుకునేందుకు పలువురు యువకులు వస్తున్నారని, వారి వల్ల ఇబ్బంది లేదని స్థానికులు చెబుతున్నారు. కానీ చీకటి పడిన తరువాత గ్రౌండ్‌లోకి ప్రవేశించేవారి వల్లే స్కూల్లోని వస్తువులకు నష్టం కలుగుతోందన్నారు. మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment