పాఠశాల తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్న డీఈవో అబ్రహం. చిత్రంలో తనిఖీ బృందం
సాక్షి, రాజమహేంద్రవరం : మూడు ఆర్లు ఎంత? ఏడో ఎక్కం చెప్పు.. తెలుగు చదువు.. ఇంగ్లిష్ చదువు.. 36లో నుంచి 19 తీసివేస్తే ఎంత వస్తుంది..?
– ఇవీ ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ వినిపిస్తున్న మాటలు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు చదువులో ఎలా రాణిస్తున్నారు? ఆయా తరగతుల స్థాయిని బట్టి ఆమేరకు ఆయా విద్యార్థుల్లో విద్యపై పట్టు ఉందా? కనీసం తెలుగు, ఇంగ్లిష్ చూసి చదవగలుగుతున్నారా? తదితర వివరాలను తెలుసుకుని, ఆయా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు. ఇందులో భాగంగా మండల విద్యాశాఖాధికారి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, డీఐఈవో, సీనియర్ ప్రధానోపాధ్యాయులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ప్రతి మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసి, ఆయా బృందాలు తాము పని చేస్తున్న మండలంలో కాకుండా మరో మండలంలోని ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను తనిఖీ చేస్తున్నాయి. ఈవిధంగా జిల్లాలో 64 బృందాలు పని చేస్తున్నాయి.
క్షేత్రస్థాయి పరిశీలనతో నివేదికలు
విద్యార్థుల్లో కనీస ప్రమాణాలు ఉండేలా చేసేందుకు ఈ బృందాలు ఆయా పాఠశాలలకు వెళ్లి వారి సామర్థ్యాన్ని అంచనా వేస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో మూడు నుంచి ఐదో తరగతి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మూడు నుంచి ఏడో తరగతి, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను ఈ బృందాలు ప్రశ్నలు అడుగుతూ వారిని అంచనా వేస్తున్నాయి. ప్రతి క్లాసుకూ వెళ్లి ఆయా తరగతుల పాఠ్య పుస్తకాల్లోని తెలుగు, ఇంగ్లిష్ పాఠాలను చదివిస్తున్నాయి. ఇంగ్లిష్, తెలుగు చదవలేకపోతున్న విద్యార్థుల పేర్లు నమోదు చేసుకుంటున్నాయి.
చతుర్విధ ప్రక్రియలు
ప్రభుత్వ పాఠశాలల్లోని చాలామంది విద్యార్థులకు గణితంపై కనీస పరిజ్ఞానం లేదని గుర్తించిన అధికారులు వారిలో కనీస అవగాహన పెంచే అంశంపై దృష్టి పెడుతున్నారు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను తనిఖీ బృందాలు అప్రమత్తం చేయిస్తున్నాయి. ‘చతుర్విధ ప్రక్రియలు’ పేరుతో కూడికలు, తీసివేతలు, భాగహారం, గుణకారాలు ఎంతమేరకు వస్తున్నాయనేది తెలుసుకునేందుకు విద్యార్థులకు వాటిపై లెక్కలు ఇచ్చి చేయిస్తున్నాయి. ఎవరికి ఏం రావో నమోదు చేసుకుని, విద్యార్థుల పేరుతో సహా నివేదికలు తయారు చేస్తున్నాయి. చదవడం, చతుర్విధ ప్రక్రియలపై నివేదికలను ఈ బృందాలు ఆ మండల విద్యాశాఖాధికారికి అందిస్తున్నాయి. అక్కడి నుంచి డీఈవోకు తిరిగి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆ నివేదికలు వస్తున్నాయి. తర్వాతి నెలలో తనిఖీకి వచ్చేలోపు నివేదికలో ఉన్న విద్యార్థుల్లోని లోపాలను అధిగమించేలా చేయాలని డీఈవో ఆదేశాలు జారీ చేస్తున్నారు.
పరీక్ష పేపర్ల తనిఖీ
పరీక్ష విధానం మారిన తర్వాత పాఠశాలల్లో అవకతవకలు, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఉందన్న అంచనాతో ఈ బృందాలు పరీక్ష పేపర్లను తనిఖీ చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యార్థుల మార్కులను రికార్డుల్లో నమోదు చేయకపోవడం, పరీక్ష పేపర్లు దిద్దకుండా మార్కులు వేయడం చేస్తున్నారు. విద్యార్థులకు పాయింట్ ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఇంటర్నల్ మార్కులకు 20కి 20 వేసిన సందర్భాలు గత ఏడాది ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనిఖీ బృందాలు ఆయా పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో జరిగిన ఎఫ్–1, ఎఫ్–2 పరీక్ష పేపర్లను ర్యాండమ్‌గా తీసి పరిశీలిస్తున్నాయి. అనుమానం కలిగిన పేపర్లను తీసి ఆయా విద్యార్థులను పేపర్‌లో ఉన్న ప్రశ్నలకు జవాబులను అప్పజెప్పించుకుంటున్నాయి.
ప్రమాణాలు పెంచేలా ప్రణాళిక
విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచేందుకు ఈ విధానాన్ని జిల్లాలో ఈ ఏడాది ఏర్పాటు చేశాం. జిల్లాలో 64 బృందాలున్నాయి. జంబ్లింగ్ విధానంలో ఈ బృందాలు మండలాల్లో పని చేస్తాయి. పరీక్ష పేపర్లను తనిఖీ చేయించి, కాపీయింగ్ జరిగితే గుర్తిస్తున్నాం. భవిష్యత్తులో ఇన్విజిలేటర్ లేకుండా విద్యార్థి పరీక్ష రాసి ఇచ్చేలా వారిలో నైతిక విలువలు పెంచాలన్నదే మా లక్ష్యం. చదవడంతోపాటు చతుర్విధ ప్రక్రియల పేరుతో గణితంపై పట్టు సాధించేందుకు విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం.– ఎస్.అబ్రహం, జిల్లా విద్యాశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment