పరీక్షలకు సమాయత్తమవుతున్న విద్యార్థినులు
తూర్పుగోదావరి , రాయవరం (మండపేట): వచ్చే విద్యా సంవత్సరంలో నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్వహించేలా విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ నుంచి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. గతేడాది వరకూ ఈ పరీక్షలను ప్రైవేటు స్కూల్స్‌లోనూ నిర్వహించేవారు. దీంతో ఇందుకు సాధ్యాసాధ్యాలను జిల్లా విద్యాశాఖ పరిశీలిస్తోంది.
గతేడాది పరిస్థితి ఇదీ..
గతేడాది జిల్లాలోని 301 పరీక్షా కేంద్రాల్లో 65,768 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వీటిలో 57 కేంద్రాలను ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ కేంద్రాలకు ప్రభుత్వ పాఠశాలలను గుర్తించాల్సి ఉంటుంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఎంతమంది రాస్తారన్న విషయం ఖరారైన తరువాత పరీక్షా కేంద్రాల జాబితాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంది.
ప్రైవేటు కేంద్రాల కుదింపునకు చర్యలు
జిల్లాలో ఉన్న 57 ప్రైవేటు పాఠశాలల్లో కేంద్రాల విషయంలో జిల్లా విద్యా శాఖకు కొంత ఇబ్బంది ఏర్పడుతున్నట్టు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది లేకున్నా, రాజమహేంద్రవరం, కాకినాడ వంటి పట్టణాల్లో ప్రైవేటు పరీక్షా కేంద్రాలకు బదులు ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయడం కత్తి మీద సాము చందంగా ఉంటుందని అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించిన కేంద్రాలు 80 శాతం పట్టణాల్లోనే ఉన్నాయి. అందుతోన్న సమాచారం మేరకు 30 ప్రైవేటు కేంద్రాలు తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రైవేటు కేంద్రాల రద్దు ఎందుకంటే..
సర్కారు బడుల్లో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన మౌలిక వసతులు లేవని ప్రైవేటు పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ కేంద్రాలున్న చోట ప్రైవేటు పాఠశాలల వర్గాలు పెత్తనం చెలాయిస్తున్నాయని, కొన్నిచోట్ల ప్రశ్నా పత్రాలను ముందుగానే తెరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం ఏర్పడుతుందని విద్యా శాఖ అనుమానం. ఈ చర్యలకు అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పోలీస్టేషన్‌కు 4 కిలోమీటర్ల పరిధిలో..
గతేడాది వరకు పోలీస్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలనే పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసేవారు. దీని వల్ల ఎక్కువగా ప్రైవేటు పాఠశాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ఈ ఏడాది పోలీస్టేషన్ నుంచి పరీక్షా కేంద్రాల పరిధి 4 కిలోమీటర్లకు పెంచారు.
కళాశాలలూ పరిశీలించే అవకాశం
దీంతో ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో టెన్త్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించి దీనిపై నిర్ణయం ఉండే అవకాశం ఉంది.
కసరత్తు చేస్తున్నాం
ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే విషయంపై కసరత్తు చేస్తున్నాం. డివిజన్ కేంద్రాల నుంచి సమాచారం రప్పిస్తున్నాం. నెలాఖరు నాటికి స్పష్టత వసుతంది.
– జి.నాగేశ్వరరావు, ఏడీ, ప్రభుత్వ పరీక్షల విభాగం, కాకినాడ
కట్టుదిట్టంగా నిర్వహించేందుకే..
మాస్ కాపీయింగ్ నిరోధానికి ఏటా విద్యా శాఖ కొత్త విధానాలను అవలంబిస్తోంది. టెన్త్ పరీక్షలను పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం.
– ఎస్.అబ్రహం, జిల్లా విద్యాశాకాధికారి, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment