సాక్షి, నెల్లూరు: లెవీ విధానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులు అటు ప్రభుత్వానికి ఇటు రైతులకు మంచి చేయకపోగా అక్రమాలను మరింత ప్రోత్సహించేదిగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధానం వల్ల బియ్యం అక్రమ రవాణా ఎక్కువవుతుందనే వాదన వినిపిస్తోంది. ఫలితంగా రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించకపోగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడనుంది.
ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం మిల్లర్లు సేకరించిన 75 శాతం ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. మిగిలిన 25 శాతం బియ్యాన్ని ప్రభుత్వం ఇచ్చే పర్మిట్లతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకుంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా అమలులోకి తెచ్చిన నిబంధనల ప్రకారం కేవలం 25 శాతం బియ్యాన్ని మాత్రం ప్రభుత్వానికి అప్పగించి మిగిలిన 75 శాతం బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవచ్చు. కొత్త లెవీ నిబంధన అక్టోబర్ నుంచే అమలులోకి రానుంది. ఈ విధానంతో అవసరమైన బియ్యం సేకరణ సాధ్యం కాదని, ఈ ఏడాదికి పాత విధానమే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం మొరపెట్టుకున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ క్రమంలో 50:50 లెవీ విధానాన్ని అయినా అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతోంది.
జిల్లాకు సంబంధించి ప్రభుత్వం ఏటా మిల్లర్ల నుంచి 75 శాతం లెవీ కింద 2.5 లక్షల మెట్రిక్ టన్నుల సాధారణ బియ్యం, మరో 50 వేల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరిస్తోంది. ఇందు కోసం మిల్లర్లు 5 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తారు. మిగిలిన 25 శాతం ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మిల్లర్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవచ్చు. లెవీ నిబంధనల మేరకు ప్రభుత్వం మిల్లర్లకు పర్మిట్లు జారీచేయాలి. మరోవైపు అధికారులు సైతం మిల్లర్లకు సక్రమంగా పర్మిట్లు ఇవ్వడంలేదు. వాటి కోసం లక్షల్లోనే డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అయితే మిల్లర్లు సైతం జిల్లా వ్యాప్తంగా పండే వరిధాన్యాన్ని రైతుల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేసి లెవీ అనుమతుల మాటున తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు జాక్‌పాట్ ట్రాన్స్‌పోర్ట్ మాఫియా ద్వారా అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ సెంథిల్ కుమార్ వరుస దాడులతో జాక్‌పాట్ మాఫియా ట్రాన్స్‌పోర్‌ట కార్యకలాపాలతో పాటు బియ్యం అక్రమ ఎగుమతులు బట్టబయలయ్యాయి.
కొత్తలెవీతో మరిన్ని అక్రమాలు
కొత్త లెవీ విధానంతో అక్రమాలకు పెద్ద ఎత్తున గేట్లు ఎత్తినట్లేననే విమర్శలున్నాయి. జిల్లాలో పండే రెండు పంటలకు కలిపి 25 నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది. కొత్త నింబంధనల మేరకు 25 శాతం లెవీ కింద పట్టుమని రెండు నుంచి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా ప్రభుత్వానికి అవసరముండదు. మిగిలిన మొత్తం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేయాల్సివుంటుంది. ఇందుకోసం రైతుల నుంచి తక్కువధర కే ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు వత్తిడి పెంచవచ్చు. అడిగిన రేటుకు ఇస్తేనే ధాన్యం కొనుగోలు చేస్తామని డిమాండ్ కూడా చేయవచ్చు. ఈ లెక్కన రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశముండదు. తప్పనిసరి పరిస్థితిలో తక్కువ ధరకే రైతులు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుంది. అలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యం చేసి మిల్లర్లు అక్రమంగా ఎగుమతలు చేసే అవకాశం ఎక్కువ. కేవలం 25 శాతం బియ్యాన్ని అమ్ముకొనేందుకే అధికారులు మిల్లర్లకు పర్మిట్లు సక్రమంగా ఇవ్వడంలేదు. అలాంటిది ఇక 75 శాతం బియ్యం అమ్మకాలకోసమైతే అధికారులు పర్మిట్లు ఇచ్చేది గగనమే. దీంతో బియ్యం అక్రమ రవాణా మినహా మిల్లర్లకు గత్యంతరముండదు. ఎటూ జాక్‌పాట్ ట్రాన్స్‌పోర్ట్ మాఫియా ఉండనేవుంది. దీంతో అక్రమాలు మరింత పెరిగే అవకాశముంది. మరోవైపు ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడనుంది.
కొత్త లెవీతో అవినీతికి గేట్లు బార్లా
Published Mon, Sep 22 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM
Advertisement
Advertisement