fair price
-
గిట్టుబాటు ధర కల్పించాలంటూ ధర్నా
కర్నూలు(న్యూసిటీ): రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.ఉరుకుందరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిరప, శనగ, పప్పు ధాన్యాలకు గత ఏడాది క్వింటాల్ ధర రూ.14 వేలు ఉండగా ఈ ఏడాది రూ.6 వేల నుండి రూ.7 వేలు ధర పలుకుతోందన్నారు. గత ఏడాది పప్పుశనగ క్వింటాలు రూ.7500 నుండి రూ.12 వేలు పలికిందని, ఈ ఏడాది వ్యాపారులు కుమ్మక్కై రూ.5 వేలకు కొంటున్నారని ఆరోపించారు. ధర్నాలో నాయకులు శివశంకర్, అంపమ్మ, శాంతమ్మ, ఆర్.కృష్ణారెడ్డి, సుంకన్న తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు రైతుల ఆందోళన
మరిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు ఎదుట పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌తో నెల్లూరు-ముంబాయి రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
రోడ్డెక్కిన పొగాకు రైతులు
గిట్టుబాటు ధర రావడంలేదని వర్జినియా పొగాకురైతులు వేలం నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడంలో మంగళవారం ఉదయం జరిగింది. ప్రకృతితో యుద్ధం చేస్తూ ఆరుగాలం కష్టపడి పంట సాగు చేస్తే ప్రభుత్వం గిట్టు బాటు ధర కల్పించక పోవడం అన్యాయమని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. పంట కోసం అప్పులు చేశామని.. పరిస్థితి చూస్తే.. కనీసం వడ్డీలకు కూడా ఆదాయం సరిపోని పరిస్థితి ఉందని అన్నారు. గిట్టుబాటు ధర కల్పించే వరకూ వేలం జరగ నిచ్చేదిలేదని స్పష్టం చేశారు. -
పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి
కేంద్ర వ్యవసాయ, ఆర్థిక మంత్రులకు వైఎస్సార్సీపీ ఎంపీల విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: పొగాకు రైతులకు న్యాయం చేయడానికి గిట్టుబాటు ధర కల్పించడంలో జోక్యం చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌లకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల సమక్షంలో ఏపీ, తెలంగాణలోని పొగాకు రైతుల సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం తొలుత కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివేదించారు. గిట్టుబాటు ధర కల్పించాలని, వాణిజ్య మంత్రి నిర్మలాసీతారామన్ సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరారు. మధ్య, తక్కువ గ్రేడు పొగాకు కొనుగోలు చేయడానికి పొగాకు బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకు కొనుగోళ్లు చేయాలని కోరారు. పొగాకు రైతులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరప్రసాదరావు, ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, పొగాకు రైతులు అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. పొగాకు రైతుల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన నిధులతో నిల్వల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని జైట్లీని కోరామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల ప్రతినిధులు దుగ్గినేని గోపినాథ్, మారెడ్డి సుబ్బారెడ్డి, బంగారుబాబు, వైవీ కృష్ణారావు, బి.ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు. కాగా, శుక్రవారం వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో వైఎస్సార్సీపీ ఎంపీలు, పొగాకు రైతు ప్రతినిధులు భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళన.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో 10న జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానించినట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఏపీ అభివృద్ధిని కోరుకునే అన్ని పార్టీలు ధర్నాకు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. -
'పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి'
-
ఆగని దిగుమతులు
శనగ దిగుమతులు మరో మూడు నెలలు పొడిగించిన కేంద్రం ధర దిగజారి ఆందోళనలో రైతులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కేంద్ర నిర్ణయం శనగ రైతుల పాలిట శాపంగా మారనుంది. ఒకపక్క ఇప్పటికే దిగుమతులు ఎక్కువ కావడంతో ఇక్కడ పండించిన శనగ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. దీంతో మూడేళ్లుగా లక్షలాది క్వింటాళ్ల శనగలు కోల్డ్‌స్టోరేజిల్లో మగ్గుతున్నాయి. కోల్డ్‌స్టోరేజిలో ఉన్న శనగలపై తీసుకున్న రుణం కాలపరిమితి ముగియడంతో వీటిని వేలం వేసేందుకు బ్యాంకర్లు సన్నద్ధమైన సంగతి తెలిసిందే. ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శనగల దిగుమతులను అడ్డుకుని, ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తామని చెబుతున్న హామీలు నీటిపై రాతలుగా మారుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కూడా పెద్ద ఎత్తున దిగుమతులు మన దేశానికి వచ్చాయి. ఇప్పటికే గుంటూరు, ప్రకాశంతో పాటు రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో కలిపి సుమారు 25 లక్షల క్వింటాళ్ల శనగలు రైతుల వద్దే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో శనగలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూనే మిగిలిన పప్పు ధాన్యాలకు ఆరు నెలలు, శనగలకు మూడు నెలల పాటు దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం పట్ల శనగరైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా శనగలు పేరుకుపోవడంతో ఈ ఏడాది పొగాకు పంట వేయాలని ప్రకాశం జిల్లా రైతులు భావించారు. అయితే ఇప్పటి వరకూ వర్షాలు సరిగా పడకపోవడం, సాగునీరు సకాలంలో రాకపోవడంతో పొగాకు వేసే సమయం మించిపోయింది. దీంతో రైతు తప్పనిసరై మళ్లీ శనగ పంట వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్యూచర్ ట్రేడింగ్‌లో ఈ ఏడాది మార్చిలో శనగ ధర క్వింటాలుకు రూ.3416లు ఉండగా అది జూలైకి రూ. 2650కి పడిపోయింది. భారీ ఎత్తున మన దేశానికి వచ్చిన శనగ దిగుమతులే దీనికి కారణం. ఆస్ట్రేలియా, టాంజానియా, మయన్మార్, ఇథియోపియా, మలేసియా, కెనడా, అరబ్ ఎమిరేట్స్, జపాన్ తదితర దేశాల నుంచి శనగలు దిగుమతి అవుతున్నాయి. 2014 సంవత్సరంలోనే పదివేల క్వింటాళ్ల వరకూ దిగుమతి అయ్యాయి. ఈ దిగుమతులు ఇంకా కొనసాగితే శనగల ధర భారీగా పతనమయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2012-13లో మన దేశంలో 8.83 మిలియన్ టన్నుల శనగ ఉత్పత్తి కాగా, 2013-14లలో 9.88 మిలియన్ టన్నులు అంటే 11.9 శాతం ఉత్పత్తి పెరిగింది. ఈ ఏడాది కూడా 9.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న శనగ సాగులో ఏడు శాతం మన దేశంలోనే ఉంది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న కాక్-2 రకం ఎగుమతి చేస్తుంటారు. 2007లో దేశంలో పప్పు ధాన్యాల కొరత ఏర్పడిన సమయంలో పన్ను లేకుండా దిగుమతులకు అప్పటి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో అన్ని పప్పు ధాన్యాల ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. కాక్-2 రకం శనగల ఎగుమతిపై కూడా నిషేధం విధించింది. అప్పటి శనగరైతుల బృందం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి వివరించగా ఆయన వెంటనే స్పందించారు. ఒక బృందాన్ని అప్పటి ఎంపీ పురంధరేశ్వరితోపాటు ఢిల్లీ పంపించారు. దీంతో కేంద్రం కాక్-2 రకంపై నిషేధం ఎత్తివేసింది. ప్రస్తుతం కాక్-2 రకంపై నిషేధాం లేకపోయినా వాటిని ఎగుమతి చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శనగల దిగుమతులపై సుంకం విధించడంతో పాటు కాక్-2 రకం శనగల ఎగుమతికి కృషి చేస్తేనే శనగరైతు కోలుకునే అవకాశం ఉంది. -
ఏటా నిరాశే!
జడ్చర్ల: రైతన్నకష్టం దళారుల భోజ్యమవుతోంది. శ్రమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడమే గగనమైపోయింది. మద్దతుధర కల్పించి ఆదుకోవాల్సిన ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), నాఫెడ్ కొనుగోలు కేంద్రాల ఊసే లేకుండాపోయింది. మంచిధర వస్తుందని ఆశించి భంగపడిన రైతులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. గిట్టుబాటు ధర దక్కకపోతుం దా.. అప్పులబాధ నుంచి గట్టెక్కకపోతామా? అని యోచించిన రైతులకు ఏటా నిరాశే ఎదురవుతోంది. జిల్లాలో ఈ ఏడాది 2.15లక్షల హెక్టార్లలో పత్తిని సాగుచేశారు. ఎకరా సాగుకోసం రూ.30 నుంచి రూ.40వేల వరకు ఖర్చుచేశారు. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు, ఆ తరువాత తెగుళ్ల బెడద కారణంగా ఎకరా పొలంలో ఏడు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో పత్తి క్వింటాలుకు రూ.5వేలు ఇస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు ఆశిస్తున్నారు. ఈ ధరలు చెల్లించేందుకు జిల్లాలో షాద్‌నగర్ మినహా ఎక్కడా సీసీఐ కొనుగోలుకేంద్రం లేదు. 2004లో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో సీసీఐ కొనుగోలు కేంద్రం ఉన్నా అప్పట్లో పత్తికి సరైనధరలు రావడం లేదనే సాకుతో ఈ కేంద్రాన్ని ఎత్తివేశారు. ఇదిలాఉండగా, రెండేళ్ల క్రితం మాత్రం సీజన్ చివరి సమయంలో జడ్చర్లలో నాఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి ప్రభుత్వ మద్దతుధరలకు కొనుగోళ్లు జరిపారు. ఆ తరువాత నాఫెడ్ కూడా జాడేలేకుండాపోయింది. జడ్చర్ల శివారులో గంగాపురం గ్రామ సమీపంలో పత్తి క్రయవిక్రయాలకు సంబందించి ప్రత్యేకంగా పత్తి మార్కెట్‌ను నిర్మించారు. ఇక్కడ ప్రతి ఏడాది రెండు లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి విక్రయాలు జరుగుతాయి. రూ.కోట్లలో వ్యాపారం జరుగుతున్నా.. సీసీఐ, మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవచూపడం లేదు. జిల్లాలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా పరిగి, తాండూరు తదితర సుదూర ప్రాంతాల నుండి కూడా రైతులు ఇక్కడికే వచ్చి పత్తిని విక్రయిస్తారు. అయితే అన్నిహంగులతో ప్రత్యేకంగా యార్డు ఉన్నా సీసీఐ కేంద్రం లేకపోవడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. సీసీఐ కొనుగోలుచేస్తే.. పత్తిని సీసీఐ కొనుగోలుచేస్తే రైతులకు లాభం చేకూరుతుంది. సీసీఐ ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలకు తక్కువకాకుండా కొనుగోలుచేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొనుగోళ్ల కారణంగా వ్యాపారుల్లో పోటీతత్వం పెరిగి.. సీసీఐ కంటే ఎక్కువధరలు చెల్లించే అవకాశం ఉంది. ఒకవేళ సీసీఐ కొనుగోలు చేయకపోతే వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా తక్కువధరలు కేటాయించే అవకాశం ఉంది. మార్కెట్ యార్డుకు పత్తి భారీమొత్తంలో విక్రయానికి వచ్చిన సమయంలో వ్యాపారులు కుమ్మకై అతితక్కువ ధరలు చెల్లించే అవకాశం లేకపోలేదు. పత్తి దిగుబడులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. రైతులు పత్తితీత పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. తీసిన పత్తిని విక్రయించేందుకు.. మంచి ధరల కోసం ఎదురుచూస్తున్నారు. దళారుల మోసం.. ఏటా నష్టం పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర కూడా నామమాత్రంగానే ఉంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పత్తి క్వింటాలుకు ప్రభుత్వం పెంచిన ధర కేవలం రూ.50మాత్రమే. దీంతో గరిష్ట మద్దతు ధర రూ.4050, కనిష్టంగా రూ.3750 ఉంది. ఇదిలాఉండగా, పత్తి కొనుగోళ్లకు సంబంధించి దళారులు గ్రామాలపై కన్నేశారు. ధరలు లేవని రైతులను నమ్మించి తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా విత్తనాలు, పురుగు మందుల వ్యాపారులు దళారుల అవతారమెత్తి నిలువునా దోచుకుంటున్నారు. మార్కెట్ కంటే తామె ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నామని నమ్మబలుకుతున్నారు. కలెక్టర్ స్పందించి దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు చర్యలు తీసుకుని సీసీఐ, మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని పత్తి రైతులు కోరుతున్నారు. -
కొత్త లెవీతో అవినీతికి గేట్లు బార్లా
సాక్షి, నెల్లూరు: లెవీ విధానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులు అటు ప్రభుత్వానికి ఇటు రైతులకు మంచి చేయకపోగా అక్రమాలను మరింత ప్రోత్సహించేదిగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధానం వల్ల బియ్యం అక్రమ రవాణా ఎక్కువవుతుందనే వాదన వినిపిస్తోంది. ఫలితంగా రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించకపోగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడనుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం మిల్లర్లు సేకరించిన 75 శాతం ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. మిగిలిన 25 శాతం బియ్యాన్ని ప్రభుత్వం ఇచ్చే పర్మిట్లతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకుంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా అమలులోకి తెచ్చిన నిబంధనల ప్రకారం కేవలం 25 శాతం బియ్యాన్ని మాత్రం ప్రభుత్వానికి అప్పగించి మిగిలిన 75 శాతం బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవచ్చు. కొత్త లెవీ నిబంధన అక్టోబర్ నుంచే అమలులోకి రానుంది. ఈ విధానంతో అవసరమైన బియ్యం సేకరణ సాధ్యం కాదని, ఈ ఏడాదికి పాత విధానమే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం మొరపెట్టుకున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ క్రమంలో 50:50 లెవీ విధానాన్ని అయినా అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతోంది. జిల్లాకు సంబంధించి ప్రభుత్వం ఏటా మిల్లర్ల నుంచి 75 శాతం లెవీ కింద 2.5 లక్షల మెట్రిక్ టన్నుల సాధారణ బియ్యం, మరో 50 వేల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరిస్తోంది. ఇందు కోసం మిల్లర్లు 5 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తారు. మిగిలిన 25 శాతం ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మిల్లర్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవచ్చు. లెవీ నిబంధనల మేరకు ప్రభుత్వం మిల్లర్లకు పర్మిట్లు జారీచేయాలి. మరోవైపు అధికారులు సైతం మిల్లర్లకు సక్రమంగా పర్మిట్లు ఇవ్వడంలేదు. వాటి కోసం లక్షల్లోనే డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అయితే మిల్లర్లు సైతం జిల్లా వ్యాప్తంగా పండే వరిధాన్యాన్ని రైతుల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేసి లెవీ అనుమతుల మాటున తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు జాక్‌పాట్ ట్రాన్స్పోర్ట్ మాఫియా ద్వారా అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ సెంథిల్ కుమార్ వరుస దాడులతో జాక్‌పాట్ మాఫియా ట్రాన్స్పోర్ట కార్యకలాపాలతో పాటు బియ్యం అక్రమ ఎగుమతులు బట్టబయలయ్యాయి. కొత్తలెవీతో మరిన్ని అక్రమాలు కొత్త లెవీ విధానంతో అక్రమాలకు పెద్ద ఎత్తున గేట్లు ఎత్తినట్లేననే విమర్శలున్నాయి. జిల్లాలో పండే రెండు పంటలకు కలిపి 25 నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది. కొత్త నింబంధనల మేరకు 25 శాతం లెవీ కింద పట్టుమని రెండు నుంచి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా ప్రభుత్వానికి అవసరముండదు. మిగిలిన మొత్తం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేయాల్సివుంటుంది. ఇందుకోసం రైతుల నుంచి తక్కువధర కే ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు వత్తిడి పెంచవచ్చు. అడిగిన రేటుకు ఇస్తేనే ధాన్యం కొనుగోలు చేస్తామని డిమాండ్ కూడా చేయవచ్చు. ఈ లెక్కన రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశముండదు. తప్పనిసరి పరిస్థితిలో తక్కువ ధరకే రైతులు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుంది. అలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యం చేసి మిల్లర్లు అక్రమంగా ఎగుమతలు చేసే అవకాశం ఎక్కువ. కేవలం 25 శాతం బియ్యాన్ని అమ్ముకొనేందుకే అధికారులు మిల్లర్లకు పర్మిట్లు సక్రమంగా ఇవ్వడంలేదు. అలాంటిది ఇక 75 శాతం బియ్యం అమ్మకాలకోసమైతే అధికారులు పర్మిట్లు ఇచ్చేది గగనమే. దీంతో బియ్యం అక్రమ రవాణా మినహా మిల్లర్లకు గత్యంతరముండదు. ఎటూ జాక్‌పాట్ ట్రాన్స్పోర్ట్ మాఫియా ఉండనేవుంది. దీంతో అక్రమాలు మరింత పెరిగే అవకాశముంది. మరోవైపు ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడనుంది. -
సీతాఫలానికి ‘సిండికేట్’ దెబ్బ
వంట్లమామిడి సంతలో వ్యాపారుల గిమ్మిక్కులు ధర గిట్టుబాటుగాక గిరిజన రైతుల ఆవేదన పాడేరు: ఏజెన్సీలోని పాడేరు మండలం వంట్లమామిడి అంటే నోరూరించే సీతాఫలాలు గుర్తొస్తాయి. ఎలాంటి క్రిమిసంహారక మందు లు వాడకుండా పండించే వీటికి మన రాష్ట్రం లోనే కాదు కోల్కత్తా వంటి బయటి ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్. అయితే వాటిని పండించి మారుమూల గ్రామాల నుంచి వంట్లమామిడి సంతకు మోసుకొచ్చే తమకు గిట్టుబాటు ధర ఉండట్లేదని గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. చివరకు మోత కూలి కూడా దక్కలేదని చెబుతున్నారు. నెల రోజుల క్రితం సీజన్ ప్రారంభమైనపుడు బుట్ట సీతాఫలాల ధర రూ. 300 నుంచి రూ. 600 వరకూ ఉంటే ఆదివారం మాత్రం రూ. 150 మించి పలకలేదు. దళారులు, వ్యాపారులు ఏకమై ధరను తగ్గించేశారు. ఆరుగాలం కష్టపడి సీతాఫలాలను సాగుచేసి, మారుమూల గ్రామాల నుంచి కాలినడకనే మోసుకుంటూ సంతకు తెస్తే తీరా తగిన ధర లేకపోవడంతో గిరిజను లు ఉసూరుమంటున్నారు. ఈ సీతాఫలాల సీజన్లో వంట్లమామిడిలో ప్రతి రోజు సంత జరుగుతుంది. సలుగు, దేవాపురం, మోదాపల్లి, వంట్లమామిడి పంచాయతీల పరిధిలోని మారుమూల గ్రామాల్లో గిరిజన రైతులు సీతాఫలాల తోటలను పెంచుతున్నారు. ఎలాంటి క్రిమిసంహారక మందు లు, రసాయన ఎరువులు వాడకుండా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలోనే సాగుచేస్తున్నారు. ఎంతో రుచికరంగా ఉండే ఈ పండ్లను కోల్కత్తా వంటి నగరాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారు. మరో రెండు నెలల వరకు సీతాఫలాల సీజన్ ఉంటుంది. -
ఇక ‘అమ్మ అముదం’
- రాష్ట్రంలో 300 అమ్మ రేషన్ షాపులు - వంద ధాన్యం కొనుగోలు కేంద్రాలు - వర్సిటీ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు - అసెంబ్లీలో జయలలిత వెల్లడి చెన్నై, సాక్షి ప్రతినిధి: చౌకధరకు నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 300 ‘అమ్మ అముదం’ దుకాణాలను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ, సహకార సంఘాల పరిధిలో ఇప్పటికే 137 దుకాణాలు సేవలు అందిస్తున్నాయని అన్నారు. ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిసేవలను విస్తరించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా రూ.30.17 కోట్ల వ్యయంతో అమ్మ అముదం షాపులను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. సుమారు 23 రకాల ఆహార ధాన్యాలను వీటి ద్వారా విక్రయించనున్నట్లు ఆమె చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అముదం, చింతామణి పేర్లతో చౌకధర దుకాణాలు సేవలందిస్తున్నాయి. ఇకపై వాటి స్థానంలో అమ్మ అముదం పేరుతో నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే రూ.16 కోట్లతో తవుడు నూనె కర్మాగారాన్ని సైతం నెలకొల్పనున్నట్లు ఆమె చెప్పారు. వ్యవసాయదారులకు న్యాయమైన వడ్డీతో రుణాలను అందించేందుకు రూ.12.54 కోట్లను సహకార సంఘాలకు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. అంతేగాక రాష్ట్రంలో 4,530 సహకార సంఘాల భవనాలను రూ.6.90 కోట్లతో ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలను వర్సిటీ స్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా రూ.9 కోట్లతో షోలింగనల్లూరులో ప్రత్యేక శిక్షణా కేంద్రాలను నెలకొల్పనున్నట్లు జయ చెప్పారు. అంతేగాక రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లోని 1112 అధ్యాపకుల ఖాళీలను ఈ ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 84,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన 39 గిడ్డంగులను రూ.112.57 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. పట్టణాలకు, నగరాలకు తమ దిగుబడులను తరలించే రైతుల కష్టాన్ని నివారించేందుకు రూ.35 కోట్లతో వంద కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ఆమె అన్నారు. వీటిలో 75 కేంద్రాలు కేవలం వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తాయని ఆమె చెప్పారు. వాకౌట్: సమ్మెలో భాగంగా పడవలకు తెల్లజెండాలను ఎగురవేసి ఈనెల 2వ తేదీన కచ్చదీవుల వరకు తమిళ జాలర్లు నిరసన ప్రదర్శన చేస్తున్న అంశంపై మాట్లాడేందుకు మనిదనేయ మక్కల్ కట్చి(ఎంఎంకే) సభ్యులు జవహరిల్లా కోరగా స్పీకర్ ధనపాల్ నిరాకరించారు. ఇందుకు నిరసనగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.