సీతాఫలానికి ‘సిండికేట్’ దెబ్బ
- వంట్లమామిడి సంతలో వ్యాపారుల గిమ్మిక్కులు
- ధర గిట్టుబాటుగాక గిరిజన రైతుల ఆవేదన
పాడేరు: ఏజెన్సీలోని పాడేరు మండలం వంట్లమామిడి అంటే నోరూరించే సీతాఫలాలు గుర్తొస్తాయి. ఎలాంటి క్రిమిసంహారక మందు లు వాడకుండా పండించే వీటికి మన రాష్ట్రం లోనే కాదు కోల్‌కత్తా వంటి బయటి ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్. అయితే వాటిని పండించి మారుమూల గ్రామాల నుంచి వంట్లమామిడి సంతకు మోసుకొచ్చే తమకు గిట్టుబాటు ధర ఉండట్లేదని గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. చివరకు మోత కూలి కూడా దక్కలేదని చెబుతున్నారు.
నెల రోజుల క్రితం సీజన్ ప్రారంభమైనపుడు బుట్ట సీతాఫలాల ధర రూ. 300 నుంచి రూ. 600 వరకూ ఉంటే ఆదివారం మాత్రం రూ. 150 మించి పలకలేదు. దళారులు, వ్యాపారులు ఏకమై ధరను తగ్గించేశారు. ఆరుగాలం కష్టపడి సీతాఫలాలను సాగుచేసి, మారుమూల గ్రామాల నుంచి కాలినడకనే మోసుకుంటూ సంతకు తెస్తే తీరా తగిన ధర లేకపోవడంతో గిరిజను లు ఉసూరుమంటున్నారు.
ఈ సీతాఫలాల సీజన్‌లో వంట్లమామిడిలో ప్రతి రోజు సంత జరుగుతుంది. సలుగు, దేవాపురం, మోదాపల్లి, వంట్లమామిడి పంచాయతీల పరిధిలోని మారుమూల గ్రామాల్లో గిరిజన రైతులు సీతాఫలాల తోటలను పెంచుతున్నారు. ఎలాంటి క్రిమిసంహారక మందు లు, రసాయన ఎరువులు వాడకుండా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలోనే సాగుచేస్తున్నారు. ఎంతో రుచికరంగా ఉండే ఈ పండ్లను కోల్‌కత్తా వంటి నగరాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారు. మరో రెండు నెలల వరకు సీతాఫలాల సీజన్ ఉంటుంది.