ఇక ‘అమ్మ అముదం’
- రాష్ట్రంలో 300 అమ్మ రేషన్ షాపులు
- వంద ధాన్యం కొనుగోలు కేంద్రాలు
- వర్సిటీ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు
- అసెంబ్లీలో జయలలిత వెల్లడి
చెన్నై, సాక్షి ప్రతినిధి: చౌకధరకు నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 300 ‘అమ్మ అముదం’ దుకాణాలను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ, సహకార సంఘాల పరిధిలో ఇప్పటికే 137 దుకాణాలు సేవలు అందిస్తున్నాయని అన్నారు. ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిసేవలను విస్తరించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా రూ.30.17 కోట్ల వ్యయంతో అమ్మ అముదం షాపులను ఏర్పాటు చేయనున్నామని అన్నారు.
సుమారు 23 రకాల ఆహార ధాన్యాలను వీటి ద్వారా విక్రయించనున్నట్లు ఆమె చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అముదం, చింతామణి పేర్లతో చౌకధర దుకాణాలు సేవలందిస్తున్నాయి. ఇకపై వాటి స్థానంలో అమ్మ అముదం పేరుతో నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే రూ.16 కోట్లతో తవుడు నూనె కర్మాగారాన్ని సైతం నెలకొల్పనున్నట్లు ఆమె చెప్పారు. వ్యవసాయదారులకు న్యాయమైన వడ్డీతో రుణాలను అందించేందుకు రూ.12.54 కోట్లను సహకార సంఘాలకు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు.
అంతేగాక రాష్ట్రంలో 4,530 సహకార సంఘాల భవనాలను రూ.6.90 కోట్లతో ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలను వర్సిటీ స్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా రూ.9 కోట్లతో షోలింగనల్లూరులో ప్రత్యేక శిక్షణా కేంద్రాలను నెలకొల్పనున్నట్లు జయ చెప్పారు. అంతేగాక రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లోని 1112 అధ్యాపకుల ఖాళీలను ఈ ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
84,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన 39 గిడ్డంగులను రూ.112.57 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. పట్టణాలకు, నగరాలకు తమ దిగుబడులను తరలించే రైతుల కష్టాన్ని నివారించేందుకు రూ.35 కోట్లతో వంద కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ఆమె అన్నారు. వీటిలో 75 కేంద్రాలు కేవలం వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తాయని ఆమె చెప్పారు.
వాకౌట్: సమ్మెలో భాగంగా పడవలకు తెల్లజెండాలను ఎగురవేసి ఈనెల 2వ తేదీన కచ్చదీవుల వరకు తమిళ జాలర్లు నిరసన ప్రదర్శన చేస్తున్న అంశంపై మాట్లాడేందుకు మనిదనేయ మక్కల్ కట్చి(ఎంఎంకే) సభ్యులు జవహరిల్లా కోరగా స్పీకర్ ధనపాల్ నిరాకరించారు. ఇందుకు నిరసనగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.