ఏటా నిరాశే!
జడ్చర్ల:
రైతన్నకష్టం దళారుల భోజ్యమవుతోంది. శ్రమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడమే గగనమైపోయింది. మద్దతుధర కల్పించి ఆదుకోవాల్సిన ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), నాఫెడ్ కొనుగోలు కేంద్రాల ఊసే లేకుండాపోయింది. మంచిధర వస్తుందని ఆశించి భంగపడిన రైతులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. గిట్టుబాటు ధర దక్కకపోతుం దా.. అప్పులబాధ నుంచి గట్టెక్కకపోతామా? అని యోచించిన రైతులకు ఏటా నిరాశే ఎదురవుతోంది. జిల్లాలో ఈ ఏడాది 2.15లక్షల హెక్టార్లలో పత్తిని సాగుచేశారు. ఎకరా సాగుకోసం రూ.30 నుంచి రూ.40వేల వరకు ఖర్చుచేశారు. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు, ఆ తరువాత తెగుళ్ల బెడద కారణంగా ఎకరా పొలంలో ఏడు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో పత్తి క్వింటాలుకు రూ.5వేలు ఇస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు ఆశిస్తున్నారు. ఈ ధరలు చెల్లించేందుకు జిల్లాలో షాద్‌నగర్ మినహా ఎక్కడా సీసీఐ కొనుగోలుకేంద్రం లేదు.
2004లో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో సీసీఐ కొనుగోలు కేంద్రం ఉన్నా అప్పట్లో పత్తికి సరైనధరలు రావడం లేదనే సాకుతో ఈ కేంద్రాన్ని ఎత్తివేశారు. ఇదిలాఉండగా, రెండేళ్ల క్రితం మాత్రం సీజన్ చివరి సమయంలో జడ్చర్లలో నాఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి ప్రభుత్వ మద్దతుధరలకు కొనుగోళ్లు జరిపారు. ఆ తరువాత నాఫెడ్ కూడా జాడేలేకుండాపోయింది. జడ్చర్ల శివారులో గంగాపురం గ్రామ సమీపంలో పత్తి క్రయవిక్రయాలకు సంబందించి ప్రత్యేకంగా పత్తి మార్కెట్‌ను నిర్మించారు. ఇక్కడ ప్రతి ఏడాది రెండు లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి విక్రయాలు జరుగుతాయి. రూ.కోట్లలో వ్యాపారం జరుగుతున్నా.. సీసీఐ, మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవచూపడం లేదు. జిల్లాలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా పరిగి, తాండూరు తదితర సుదూర ప్రాంతాల నుండి కూడా రైతులు ఇక్కడికే వచ్చి పత్తిని విక్రయిస్తారు. అయితే అన్నిహంగులతో ప్రత్యేకంగా యార్డు ఉన్నా సీసీఐ కేంద్రం లేకపోవడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది.
సీసీఐ కొనుగోలుచేస్తే..
పత్తిని సీసీఐ కొనుగోలుచేస్తే రైతులకు లాభం చేకూరుతుంది. సీసీఐ ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలకు తక్కువకాకుండా కొనుగోలుచేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొనుగోళ్ల కారణంగా వ్యాపారుల్లో పోటీతత్వం పెరిగి.. సీసీఐ కంటే ఎక్కువధరలు చెల్లించే అవకాశం ఉంది. ఒకవేళ సీసీఐ కొనుగోలు చేయకపోతే వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా తక్కువధరలు కేటాయించే అవకాశం ఉంది. మార్కెట్ యార్డుకు పత్తి భారీమొత్తంలో విక్రయానికి వచ్చిన సమయంలో వ్యాపారులు కుమ్మకై అతితక్కువ ధరలు చెల్లించే అవకాశం లేకపోలేదు. పత్తి దిగుబడులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. రైతులు పత్తితీత పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. తీసిన పత్తిని విక్రయించేందుకు.. మంచి ధరల కోసం ఎదురుచూస్తున్నారు.
దళారుల మోసం.. ఏటా నష్టం
పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర కూడా నామమాత్రంగానే ఉంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పత్తి క్వింటాలుకు ప్రభుత్వం పెంచిన ధర కేవలం రూ.50మాత్రమే. దీంతో గరిష్ట మద్దతు ధర రూ.4050, కనిష్టంగా రూ.3750 ఉంది. ఇదిలాఉండగా, పత్తి కొనుగోళ్లకు సంబంధించి దళారులు గ్రామాలపై కన్నేశారు. ధరలు లేవని రైతులను నమ్మించి తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా విత్తనాలు, పురుగు మందుల వ్యాపారులు దళారుల అవతారమెత్తి నిలువునా దోచుకుంటున్నారు. మార్కెట్ కంటే తామె ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నామని నమ్మబలుకుతున్నారు. కలెక్టర్ స్పందించి దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు చర్యలు తీసుకుని సీసీఐ, మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని పత్తి రైతులు కోరుతున్నారు.