‘తాత్కాలిక’ పనుల్లో ప్రమాదం
♦ యంత్రంలో తల ఇరుక్కొని యూపీ కార్మికుడి దుర్మరణం
♦ గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపుపై కార్మికుల ఆగ్రహం
♦ చెదరగొట్టిన పోలీసులపై రాళ్ల వర్షం.. అంబులెన్స్ దహనం
♦ ఎల్‌అండ్‌టీ కార్యాలయంలో విధ్వంసం
♦ నిర్మాణ పనుల్లో నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు కార్మికుల బలి
సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో నెల రోజుల వ్యవధిలోనే మరో కార్మికుడు బలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహదేశ్య దేవేందర్(22) ప్రమాదంలో మృతిచెందాడు. మృతదేహాన్ని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించడంతో 400 మందికి పైగా కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎల్‌అండ్‌టీకి చెందిన ఒక అంబులెన్స్, కార్యాలయంలోని కంప్యూటర్, ఫోన్, కుర్చీలు, సామగ్రిని ధ్వంసం చేశారు. దీంతో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేవేందర్ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పిస్తామని జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
కార్మిక చట్టాలను అమలు చేయాలి
తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనిలో మహదేశ్య దేవేందర్ ఆరు రోజుల క్రితం చేరాడు. నెలకు రూ.8 వేల వేతనంతో కాంక్రీట్ మిక్సర్ మిల్లర్(టీఎం)పై హెల్పర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం యంత్రాన్ని శుభ్రం చేస్తుండగా అతని చొక్కా కాలర్ మిల్లర్‌కు బిగుసుకుంది. తల యంత్రం లోపల చిక్కుకొని నలిగిపోయింది. దీంతో దేవేందర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు ఉదయం 7.45 గంటల సమయంలో మృతదేహాన్ని రహస్యంగా ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న కార్మికులు 9 గంటల సమయంలో పనులు నిలిపివేసి విధ్వంసానికి దిగారు. లాఠీలతో చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా రాళ్లు రువ్వారు. ఎల్‌అండ్‌టీ కార్యాలయంలోకి ప్రవేశించి చేతికి అందిన వస్తువులను ధ్వంసం చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు దేవేందర్ మృతదేహాన్ని వెనక్కి రప్పించారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు చేస్తున్నవారికి రక్షణ లేకుండా పోయిందని, కార్మిక చట్టాలను అమలు చేశాకే మృతదేహాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లనిస్తామని సీపీఎం, సీఐటీయూ నేతలు, కార్మికులు పట్టుబట్టారు.
కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం
ఘటనా స్థలానికి వచ్చిన గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, సీఆర్‌డీఏ అదనపు కార్యదర్శి శ్రీధర్, గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌లు కార్మిక నాయకులతో చర్చలు జరిపారు. ఎల్‌అండ్‌టీ, కార్మిక శాఖలతో చర్చించి బాధితుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమరావతి ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్మాణ సంస్థ, కార్మిక శాఖతో చర్చించి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
నెల రోజుల క్రితమే కార్మికుడి మృతి
తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో ఉండగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన సామ్రాట్ రౌత్ (20) ప్రమాదంలో మృతి చెందాడు. గత నెలలో బోర్‌పైల్స్ వేస్తుండగా దుర్మరణం పాలయ్యాడు. అప్పుడు కూడా ఆ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించినట్లు తెలుస్తోంది.
కార్మికులు, నేతలపై లాఠీచార్జ్
గుంటూరు జేసీ, ఎస్పీలు గుంటూరులో సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశాన్ని కార్మికులు, సీపీఎం, సీఐటీయూ నేతలు బహిష్కరించారు. ఘటనా స్థలంలో సమావేశం నిర్వహిస్తేనే తాము హాజరవుతామని స్పష్టం చేశారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంతంలోని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వారిపై పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీలతో చితకబాదారు. ఉదయం నుంచి కార్మికుల పక్షాన మాట్లాడిన నాయకులను గుర్తుపెట్టుకుని మరీ కొట్టారు. ఆందోళనకు దిగిన రాజధాని ప్రాంత సీపీఎం కార్యదర్శి సీహెచ్ బాబూరావు, గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శి పాశం రామారావు, సీఐటీయూ నాయకులు లెనిన్, నవీన్‌ప్రకాష్, లక్ష్మీనారాయణతోపాటు మరో ముగ్గుర్ని అరెస్టు చేసి అమరావతి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లాఠీచార్జీలో గాయపడ్డ లెనిన్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.