చెరువులకు మహర్దశ
తిరుపతి నగర పరిధిలోని చెరువులకు మహర్దశ కలగనుంది. ఇన్నాళ్లూ చుక్కనీరు లేక.. ఆక్రమణలకు గురై.. ఎందుకూ పనికిరాకుండా ఉండే తొమ్మిది చెరువులను టీటీడీ పరం చేసేందుకు రెవెన్యూ సిద్ధమైంది. ఇకపై చెరువుల పరిధిలోని ఆయకట్టు పచ్చని పంటలతో కళకళలాడనుంది. ఈ మేరకు బుధవారం రెవెన్యూ అధికారులు నివేదికలు సిద్ధంచేసి కలెక్టర్‌కు పంపారు.
- తిరుపతి చెరువులు టీటీడీ పరం
- తొమ్మిది చెరువులను అప్పగించేందుకు రెవెన్యూ సిద్ధం
- చెరువులను పరిశీలించిన అర్బన్ తాహశీల్దార్ .
తిరుపతి మంగళం: తిరుపతి పరిధిలోని చెరువులు టీటీడీ పరంకానున్నాయి. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని తొమ్మిది చెరువులను టీటీడీకి అప్పగించేందుకు రెవెన్యూ సిద్ధమైంది. ఇదివరకే కార్పొరేషన్, రెవెన్యూ, టీటీడీ, ఇరిగేషన్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో చెరువులను పరిశీలించారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశాల మేరకు తిరుపతి తిమ్మినాయుడుపాళెం పరిధిలోని పూలవానిగుంట, అక్కారంపల్లి, గొల్లవానిగుంట, ఉప్పరపాళెం, కొరమేనుగుంట, బూచమ్మగుంట, కొరమేనుగుంట చిన్నచెరువు, తిమ్మినాయుడుపాళెం, లింగాళమ్మ (వినాయకసాగర్) చెరువులను టీటీడీకి అప్పగించేందుకు బుధవారం తిరుపతి అర్బన్ తహశీల్దార్ వెంకటేశ్వర్లు పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని తొమ్మిది చెరువులను టీటీడీ తీసుకుని నీటిని నిల్వ చేసేందుకు చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా చెరువుల్లో పూడిక తీసి, చట్టూ కట్టవేసి పచ్చదనం ఉట్టిపడేలా పార్కులను కూడా ఏర్పాటు చేస్తారన్నారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా పడిన వర్షపు నీటిని చెరువుల్లో నిల్వ ఉంచి పరిసరాల్లోని పంటపొలాలకు అందించేందుకు టీటీడీ సిద్ధమైందన్నారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశాల మేరకు తాము చెరువులను పరిశీలించి వాటి విస్తీర్ణం, పరిసరాలను గుర్తించి నివేదిక పంపనున్నట్లు తెలిపారు.
నీటి సరఫరా ఉండే చెరువులను ఇస్తే బాగుంటుంది
తిమ్మినాయుడుపాళెం, శెట్టిపల్లి పంచాయతీ పరిధిలో చాలా పెద్ద చెరువులు ఉన్నాయని, వాటికి నీటి కెనాల్(వంకలు) బాగా ఉన్నాయని అర్బన్ తాహశీల్దార్ తెలిపారు. అలాంటి వాటిని టీటీడీకి ఇస్తే ప్రయోజనం ఉంటుందని, నీటి కెనాల్ లేని చెరువుల్లో పూడికలు తీసి ప్రయోజనం ఏముంటుందన్నారు. శెట్టిపల్లి పంచాయతీలోనే అధికంగా పంటపొలాలు ఉన్నాయని, అలాంటి వాటిని గుర్తించి టీటీడీకి ఇచ్చేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళుతానన్నారు. చెరువులను పరిశీలించిన వారిలో సర్వేయర్లు ప్రసాద్, రమేష్‌బాబు, ఆర్‌ఐ రామచంద్ర, విఆర్‌వో చెంగల్‌రాయులు, సిబ్బంది బాబు ఉన్నారు.