స్పష్టత లేని జీవోపై రైతుల ఆవేదన
చేతిచమురు వదులుతోందని గగ్గోలు
ఒక పక్క జోరుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం, పెరిగిన భూమి విలువతో పుట్టుకొస్తున్న వివాదాలు... ఈ రెండింటికి ఒకటే పరిష్కార మార్గం.. భూమి సర్వే చేసి హద్దులు నిర్థారిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.... దీనికి అనువుగా ప్రభుత్వం ప్రత్యేక సర్వేయర్లను నియమించినా, వారికి చెల్లించే రుసుంపై స్పష్టత లేకపోవడంతో చేతిచమురు వదులుతోందని రైతులు వాపోతున్నారు.
నర్సీపట్నం : స్పష్టతలేని ప్రభుత్వ విధానాలు రైతులను అవస్థలపాల్జేస్తున్నాయి. సర్వేయర్ల విషయంలో ఇదే సమస్యను రైతులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది వరకు మండలానికి ఒక ప్రభుత్వ సర్వేయర్ ఉండేవారు. రైతులు నేరుగా మీ సేవలో రూ. 250 చెల్లిస్తే రెవెన్యూ అధికారుల ఆదేశంతో వారు సంబంధిత రైతుల భూములను కొలిచి హద్దులు నిర్ణయించేవారు. గత పదేళ్ల నుంచి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకు న్నాయి. భూమి అమ్మకాలు, కొనుగోళ్లు గతంలో ఎన్నడూలేని విధంగా పెరిగాయి. ఇందుకు అనుగుణంగా సర్వే పనులు సైతం పెరుగుతూ వచ్చాయి. దీంతో ఎక్కువ శాతంలో ధరఖాస్తులు రావడం, వాటి పరిష్కారానికి అవసరమైన సర్వేయర్లు అందుబాటులో లేకపోవడంతో పెండింగ్ జాబితా చాంతాడంత పెరుగుతూ వచ్చింది.
పేరుకుపోయిన సర్వే దరఖాస్తులు
నర్సీపట్నం డివిజన్‌లో ఒక్క ఎస్ రాయవరం మండలంలోనే 495 సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితులను గమనించిన ప్రభుత్వం రెవెన్యూ సర్వేయర్లతో పాటు అదనంగా మరికొంతమందిని నియమించింది. అర్హత ఉన్న వారిని గుర్తించి వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్వేకు వినియోగించుకోవాలని ఆదేశించింది. ఈ విధంగా డివిజన్‌లో ప్రభుత్వ సర్వేయర్లు పది మందితో పాటు ఒక్కో మండలానికి ఐదుగురు లెసైన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విధంగా ప్రభుత్వం అదనపు సిబ్బందిని నియమించినా సమస్య పరిష్కారానికి గతంలో మాదిరిగానే ఈ సేవ లో చెల్లించే రుసుంలో ఎటువంటి మార్పులు చేయలేదు.
తప్పని మామూళ్ల బెడద
రైతులు తమ భూమికి సంబంధించి హద్దులు నిర్ణయించేందుకు వచ్చిన దరఖాస్తులను గుర్తించిన తహశీల్దార్లు పరిష్కార బాధ్యతను సర్వేయర్లకు ఇంతవరకు బాగానే ఉన్నా తహశీల్దారు ఆదేశాలతో హద్దులు నిర్ణయించే లెసైన్స్‌డ్ సర్వేయర్లు ఎకరానికి కొంత మొత్తం చెల్లించాలంటూ రైతుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విధంగా ఎకరానికి రూ. రెండు వేల వరకు గుంజుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకున్నా నేరుగా క్షేత్రస్థాయిలో ఈ వసూళ్లకు పాల్పడుతుండటంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిషత్తులో భూమి సర్వే చేయించాలంటేనే రైతులు ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదని పలువురు ఆవేదన చెందుతున్నారు.
రూ.500 మాత్రమే రైతు చెల్లించాలి
ప్రభుత్వ సర్వేయర్ల కొరత ఎక్కువగా ఉంది. దీనివల్ల సర్వేకు అందిన దరఖాస్తుల పరిష్కారానికి జాప్యం ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మండలానికి ఐదుగురు లెసైన్డ్ సర్వేయర్లను తీసుకుంది. సర్వే జరిపించేకునే రైతు సర్వే రుసుం ప్రభుత్వానికి మీసేవ ద్వారా చెల్లించాలి. సర్వే జరిపినందుకు లెసైన్‌సడ్ సర్వేయర్‌కు రూ.500 రైతే చెల్లించుకోవాలి.
- ఎంఆర్‌పీ బాబు, డివిజనల్ సర్వేయర్, నర్సీపట్నం
సర్వేయర్లకు కాసుల పంట.!
Published Sat, Mar 5 2016 11:54 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement