కోలాహలంగా ఉట్లోత్సవం
తిరుచానూరు : గోకులాష్టమిని పురస్కరించుకుని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం ఎదుట మంగళవారం సాయంత్రం ఉట్లోత్సవం కోలాహలం గా జరిగింది. రెండు రోజులుగా అమ్మవారి ఆలయం లో రుక్మిణి సత్యభామ సమేతంగా కొలువైన శ్రీకృష్ణస్వామి వారికి నిర్వహించిన గోకులాష్టమి వేడుకలు ఉట్లోత్సవంతో ముగిశాయి.
ఇందులో భాగంగా వేకువజామున స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామికి శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో కన్నులపండువగా ఊంజల్‌సేవ నిర్వహించా రు. అనంతరం స్వామి వారు ఉభయదేవేరులతో సహా తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. తరువాత ఆలయం ఎదుట స్వామిని కొలువుదీర్చి ఉట్లోత్సవం నిర్వహించారు.
ఉట్టి కొట్టేందుకు స్థానికులు, భక్తులు ఉత్సాహం చూపారు. కార్యక్రమం లో ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు వరప్రసాద్, కేపీ.వెంకటరత్నం, ఆర్జితం, ప్రసాదం ఇన్‌స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయులు, ఏవీఎస్‌వో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.