సాక్షి ప్రతినిధి, విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర శుక్రవారం జిల్లాలో ప్రవేశించనుండడంతో తమ్ముళ్లు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి చందంగా మారింది. అధినేత తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి, ఇప్పుడు సీమాంధ్రలో ఈ యాత్ర చేపట్టడంపై సర్వత్రా నిరసన, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నేపథ్యంలో బాబు యాత్రను సమైక్యవాదులు అడ్డుకుంటే పరిస్థితి ఏమిటని వారు మధనపడుతున్నారు. ఇప్పటికే పార్టీ వైఖరిని వివరించలేక, ఉద్యమంలో చురుగ్గా పాల్గొనలేక ఆ పార్టీ జిల్లా నేతలు గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన హరికృష్ణ ఎన్టీఆర్ సొంతగడ్డ నిమ్మకూరు నుంచి ఆత్మగౌరవ యాత్ర చేపడతానని ప్రకటించడం, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ పాదయాత్ర నిర్వహిస్తాననడంతో కేడర్ కంగుతిన్నారు.
అయితే ఆ రెండు యాత్రలు కేవలం ప్రకటనలకే పరిమితం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో బాబు బస్సు యాత్ర శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు జిల్లాలోకి ప్రవేశించనుంది. వారంరోజుల పాటు ఈ యాత్ర సాగే అవకాశం ఉందని పార్టీ ఉపాధ్యక్షులు కంభంపాటి రామమోహనరావు చెబుతున్నారు. తొలిరోజు 20కిలోమీటర్ల మేర నగర పరిధిలోని పశ్చిమ, సెంట్రల్, గన్నవరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. వస్త్రలత సెంటర్లో బహిరంగసభలో మాట్లాడతారని కంభంపాటి విడుదలచేసిన ప్రకటన తెలిపింది.
ఈ ప్రశ్నలకు బదులేదీ...?
బాబుపై ప్రశ్నల శరపరంపరాలు సంధించేందుకు జనం ఎదురుచూస్తున్నారు. నిన్న లేఖ ఇచ్చి ఇప్పుడు యాత్ర ఎందుకు? ఏమి ఆశించి చేస్తున్నారు? విభజనతో నీటి వనరులపై హక్కు మాటేమిటి? ఇప్పటికే సాగు నీరు లేక ఒక పంటకే పరిమితమైన డెల్టా ఎడారిగా మారిపోయే ప్రమాదాన్ని బాబు ఎందుకు గుర్తించలేదు? సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత తీరుబడిగా స్పందిస్తూ సీమాంధ్రలో రాజధాని ఏర్పాటుకు నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయనడమంటే విభజనకు అంగీకరించినట్టు కాదా? గతం నుంచి తాను రాష్ట్ర విభజనను అడ్డుకుంటు వచ్చానని చెబుతున్న బాబు ఇప్పుడు తాను సమైక్యావాదినేనని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సీమాంధ్రకు చెందిన తమ ప్రజాప్రతినిధులతో ఎందుకు రాజీనామా చేయించలేదు? సమైక్యవాదానికి కట్టుబడినందుకు ఒక్క హరికృష్ణ రాజీనామానే ఆఘమేఘాలపై ఆమోదించడానికి తెరవెనుక కారణం ఏమిటి? వంటి ప్రశ్నలు జిల్లాలో బాబుకు ఎదురుకానున్నాయి.
క్యాడర్ హైరానా.....
బుధవారం రాత్రి గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కృష్ణాజిల్లా నేతలు, నియోజక వర్గ ఇన్‌చార్జీలతో సమావేశమై బాబు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. యాత్ర సందర్భంగా నియోజక వర్గానికి 250 బైక్‌లు తక్కువ కాకుండా ఉండాలని ఆదేశించారు. అధినేత ఆజ్ఞను శిరసావహించాలంటే భారీ ఖర్చుతో పాటు జనాన్ని పెద్ద ఎత్తున తరలించాల్సి ఉండటంతో పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న దశలో ఈ యాత్రకు జనాన్ని భారీగా తరలించడం ఆషామాషీ వ్యవహారం కాదని నేతలు బెంబేలెత్తుతున్నారు.
నగరంలో పార్టీకి సరైన క్యాడర్ లేనందున జన సమీకరణకు నేతలు చేతులెత్తేస్తున్నారు. గత జనవరిలో బాబు నిర్వహించిన పాదయాత్రకు చేసిన అప్పులు తీరకుండానే మళ్లీ ఈ తిప్పలు ఏంటో అర్థం కావడం లేదని పార్టీ శ్రేణులు లబోదిబోమంటున్నాయి. ఉద్యమ నేపథ్యంలో బాబు యాత్రకు ఆందోళనకారుల నుంచి ఎటువంటి ఆటంకంలేకుండా చూసేందుకు భారీగా పోలీసు బలగాలను ఏర్పాటుచేయాలని సీపీ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
మరోమారు బట్టబయలైన కుమ్మక్కు రాజకీయం
చంద్రబాబు యాత్రకు సహకరించాలంటూ జిల్లా కాంగ్రెస్ నేతలకు అధిష్ఠానం నుంచి వర్తమానం అందినట్లు సమాచారం. బాబును అడ్డుకుని తీరుతామని ప్రగల్బాలు పలికిన పలువురు నేతలు ఇప్పుడు కిమ్మనకుండా కూర్చొనాలని నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో బాబు పాదయాత్ర సందర్భంగా కనువిప్పు యాత్ర అంటూ హడావుడి చేసిన ఎంపీ లగడపాటి ఈసారి చడీచప్పుడు చేయడంలేదు. ఈ రెండు పార్టీల కుమ్మకు రాజకీయాలు మరోమారు బట్టబయలైనట్లయిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
వి‘భజన’ మిత్రుడు.. చవితి ‘చంద్రుడు’
Published Fri, Sep 6 2013 3:52 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement