Atmagaurava Yathra
-
కాంగ్రెస్ చలి కాచుకుంటోంది
సాక్షి, విజయవాడ : రాష్ట్రం తగలబడిపోతుంటే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చలికాచుకుంటోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగు ఆత్మగౌరవయాత్ర ఆరో రోజు శుక్రవారం రాత్రి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ సోనియాగాంధీ అసలు చదువుకోలేదని, మాట్లాడటం కోసం ఇంగ్లిషు, ఫ్రెంచి నేర్చుకున్నట్లు ఒక అఫిడవిట్లో చెప్పారని, త్వరలోనే ఈ వివరాలు వెల్లడిస్తానని చంద్రబాబు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం మెజార్టీ పంచాయతీలు గెలుచుకోవడంతో వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ కపటరాజకీయం ఆడుతోందన్నారు. తెలుగుజాతి అనాథ కాదని, ఎవరినీ భిక్ష అడగదని, తాను తెలుగుజాతికి అండగా ఉంటానని, తెలుగుజాతి జోలికి ఎవరైనా వస్తే మసైపోతారని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సోనియాగాంధీకి డబ్బు పిచ్చిపట్టిందని, ప్రధానిని తోలుబొమ్మ, కీలుబొమ్మగా మార్చి తైతక్కలాడుతున్నారని ఎద్దేవా చేశారు. బొగ్గుపైల్స్ పోయాయని చెబుతున్నారని, బొగ్గు ఫైల్స్ కాపాడలేని ప్రధాని మంత్రి ఈ దేశాన్ని ఏం కాపాడతారని చంద్రబాబు ప్రశ్నించారు. ఫైల్స్ ఉంటే జైలుకు పోవాల్సి వస్తుందని వాటిని తగలబెట్టించి ఉంటారని ఆరోపించారు. తన హయాంలో తక్కువ ఆదాయంతోనే ఎక్కువ అభివృద్ధిని సాధించి, నీతిమంతమైన పాలన అందించామని, నాలెడ్జ్ సొసైటీ కోసం ప్రయత్నించానని వివరించారు. విద్యార్థులు ఇంజినీరింగ్ చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు 35 నుంచి 350 ఇంజినీరింగ్ కళాశాలకు పెంచానని తెలిపారు. తన తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని, మరో తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి ఉంటే విశాఖ,విజయవాడ, తిరుపతి నగరాలను అభివృద్ధి చేసేవాడినని చెప్పుకొన్నారు. తెలుగుప్రజలకు ఎక్కడ కష్టం వస్తే అక్కడ తాను ఉంటానని చెబుతూ ఉత్తరాఖండ్‌లో బాధితుల్ని ఆదుకోవడంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే తాను అక్కడికి వెళ్లి తెలుగువారిని సురక్షితంగా తరలించానని చెప్పారు. రైతుల గిట్టుబాటు ధర కోసం, వ్యాపారస్తుల కోసం వ్యాట్ తగ్గించాలని తాను పోరాడానని గుర్తు చేశారు. మైనార్టీలు, బీసీలులకు వేర్వేరు డిక్లరేషన్లు ప్రకటించడంతో ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారని, కాంగ్రెస్ భయపడి కపటనాటకం ఆడి రాష్ట్రవిభజన చేసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈ కుటిల ప్రయత్నాలను తెలుగువారు తిప్పి కొట్టాలంటూ, కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయిస్తామంటూ ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. -
వి‘భజన’ మిత్రుడు.. చవితి ‘చంద్రుడు’
సాక్షి ప్రతినిధి, విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర శుక్రవారం జిల్లాలో ప్రవేశించనుండడంతో తమ్ముళ్లు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి చందంగా మారింది. అధినేత తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి, ఇప్పుడు సీమాంధ్రలో ఈ యాత్ర చేపట్టడంపై సర్వత్రా నిరసన, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నేపథ్యంలో బాబు యాత్రను సమైక్యవాదులు అడ్డుకుంటే పరిస్థితి ఏమిటని వారు మధనపడుతున్నారు. ఇప్పటికే పార్టీ వైఖరిని వివరించలేక, ఉద్యమంలో చురుగ్గా పాల్గొనలేక ఆ పార్టీ జిల్లా నేతలు గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన హరికృష్ణ ఎన్టీఆర్ సొంతగడ్డ నిమ్మకూరు నుంచి ఆత్మగౌరవ యాత్ర చేపడతానని ప్రకటించడం, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ పాదయాత్ర నిర్వహిస్తాననడంతో కేడర్ కంగుతిన్నారు. అయితే ఆ రెండు యాత్రలు కేవలం ప్రకటనలకే పరిమితం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో బాబు బస్సు యాత్ర శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు జిల్లాలోకి ప్రవేశించనుంది. వారంరోజుల పాటు ఈ యాత్ర సాగే అవకాశం ఉందని పార్టీ ఉపాధ్యక్షులు కంభంపాటి రామమోహనరావు చెబుతున్నారు. తొలిరోజు 20కిలోమీటర్ల మేర నగర పరిధిలోని పశ్చిమ, సెంట్రల్, గన్నవరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. వస్త్రలత సెంటర్లో బహిరంగసభలో మాట్లాడతారని కంభంపాటి విడుదలచేసిన ప్రకటన తెలిపింది. ఈ ప్రశ్నలకు బదులేదీ...? బాబుపై ప్రశ్నల శరపరంపరాలు సంధించేందుకు జనం ఎదురుచూస్తున్నారు. నిన్న లేఖ ఇచ్చి ఇప్పుడు యాత్ర ఎందుకు? ఏమి ఆశించి చేస్తున్నారు? విభజనతో నీటి వనరులపై హక్కు మాటేమిటి? ఇప్పటికే సాగు నీరు లేక ఒక పంటకే పరిమితమైన డెల్టా ఎడారిగా మారిపోయే ప్రమాదాన్ని బాబు ఎందుకు గుర్తించలేదు? సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత తీరుబడిగా స్పందిస్తూ సీమాంధ్రలో రాజధాని ఏర్పాటుకు నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయనడమంటే విభజనకు అంగీకరించినట్టు కాదా? గతం నుంచి తాను రాష్ట్ర విభజనను అడ్డుకుంటు వచ్చానని చెబుతున్న బాబు ఇప్పుడు తాను సమైక్యావాదినేనని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సీమాంధ్రకు చెందిన తమ ప్రజాప్రతినిధులతో ఎందుకు రాజీనామా చేయించలేదు? సమైక్యవాదానికి కట్టుబడినందుకు ఒక్క హరికృష్ణ రాజీనామానే ఆఘమేఘాలపై ఆమోదించడానికి తెరవెనుక కారణం ఏమిటి? వంటి ప్రశ్నలు జిల్లాలో బాబుకు ఎదురుకానున్నాయి. క్యాడర్ హైరానా..... బుధవారం రాత్రి గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కృష్ణాజిల్లా నేతలు, నియోజక వర్గ ఇన్‌చార్జీలతో సమావేశమై బాబు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. యాత్ర సందర్భంగా నియోజక వర్గానికి 250 బైక్‌లు తక్కువ కాకుండా ఉండాలని ఆదేశించారు. అధినేత ఆజ్ఞను శిరసావహించాలంటే భారీ ఖర్చుతో పాటు జనాన్ని పెద్ద ఎత్తున తరలించాల్సి ఉండటంతో పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న దశలో ఈ యాత్రకు జనాన్ని భారీగా తరలించడం ఆషామాషీ వ్యవహారం కాదని నేతలు బెంబేలెత్తుతున్నారు. నగరంలో పార్టీకి సరైన క్యాడర్ లేనందున జన సమీకరణకు నేతలు చేతులెత్తేస్తున్నారు. గత జనవరిలో బాబు నిర్వహించిన పాదయాత్రకు చేసిన అప్పులు తీరకుండానే మళ్లీ ఈ తిప్పలు ఏంటో అర్థం కావడం లేదని పార్టీ శ్రేణులు లబోదిబోమంటున్నాయి. ఉద్యమ నేపథ్యంలో బాబు యాత్రకు ఆందోళనకారుల నుంచి ఎటువంటి ఆటంకంలేకుండా చూసేందుకు భారీగా పోలీసు బలగాలను ఏర్పాటుచేయాలని సీపీ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మరోమారు బట్టబయలైన కుమ్మక్కు రాజకీయం చంద్రబాబు యాత్రకు సహకరించాలంటూ జిల్లా కాంగ్రెస్ నేతలకు అధిష్ఠానం నుంచి వర్తమానం అందినట్లు సమాచారం. బాబును అడ్డుకుని తీరుతామని ప్రగల్బాలు పలికిన పలువురు నేతలు ఇప్పుడు కిమ్మనకుండా కూర్చొనాలని నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో బాబు పాదయాత్ర సందర్భంగా కనువిప్పు యాత్ర అంటూ హడావుడి చేసిన ఎంపీ లగడపాటి ఈసారి చడీచప్పుడు చేయడంలేదు. ఈ రెండు పార్టీల కుమ్మకు రాజకీయాలు మరోమారు బట్టబయలైనట్లయిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.