సాక్షి, విజయవాడ : రాష్ట్రం తగలబడిపోతుంటే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చలికాచుకుంటోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగు ఆత్మగౌరవయాత్ర ఆరో రోజు శుక్రవారం రాత్రి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ సోనియాగాంధీ అసలు చదువుకోలేదని, మాట్లాడటం కోసం ఇంగ్లిషు, ఫ్రెంచి నేర్చుకున్నట్లు ఒక అఫిడవిట్‌లో చెప్పారని, త్వరలోనే ఈ వివరాలు వెల్లడిస్తానని చంద్రబాబు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం మెజార్టీ పంచాయతీలు గెలుచుకోవడంతో వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ కపటరాజకీయం ఆడుతోందన్నారు. తెలుగుజాతి అనాథ కాదని, ఎవరినీ భిక్ష అడగదని, తాను తెలుగుజాతికి అండగా ఉంటానని, తెలుగుజాతి జోలికి ఎవరైనా వస్తే మసైపోతారని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సోనియాగాంధీకి డబ్బు పిచ్చిపట్టిందని, ప్రధానిని తోలుబొమ్మ, కీలుబొమ్మగా మార్చి తైతక్కలాడుతున్నారని ఎద్దేవా చేశారు.
బొగ్గుపైల్స్ పోయాయని చెబుతున్నారని, బొగ్గు ఫైల్స్ కాపాడలేని ప్రధాని మంత్రి ఈ దేశాన్ని ఏం కాపాడతారని చంద్రబాబు ప్రశ్నించారు. ఫైల్స్ ఉంటే జైలుకు పోవాల్సి వస్తుందని వాటిని తగలబెట్టించి ఉంటారని ఆరోపించారు. తన హయాంలో తక్కువ ఆదాయంతోనే ఎక్కువ అభివృద్ధిని సాధించి, నీతిమంతమైన పాలన అందించామని, నాలెడ్జ్ సొసైటీ కోసం ప్రయత్నించానని వివరించారు. విద్యార్థులు ఇంజినీరింగ్ చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు 35 నుంచి 350 ఇంజినీరింగ్ కళాశాలకు పెంచానని తెలిపారు. తన తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని, మరో తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి ఉంటే విశాఖ,విజయవాడ, తిరుపతి నగరాలను అభివృద్ధి చేసేవాడినని చెప్పుకొన్నారు.
తెలుగుప్రజలకు ఎక్కడ కష్టం వస్తే అక్కడ తాను ఉంటానని చెబుతూ ఉత్తరాఖండ్‌లో బాధితుల్ని ఆదుకోవడంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే తాను అక్కడికి వెళ్లి తెలుగువారిని సురక్షితంగా తరలించానని చెప్పారు. రైతుల గిట్టుబాటు ధర కోసం, వ్యాపారస్తుల కోసం వ్యాట్ తగ్గించాలని తాను పోరాడానని గుర్తు చేశారు. మైనార్టీలు, బీసీలులకు వేర్వేరు డిక్లరేషన్లు ప్రకటించడంతో ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారని, కాంగ్రెస్ భయపడి కపటనాటకం ఆడి రాష్ట్రవిభజన చేసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈ కుటిల ప్రయత్నాలను తెలుగువారు తిప్పి కొట్టాలంటూ, కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయిస్తామంటూ ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.
కాంగ్రెస్ చలి కాచుకుంటోంది
Published Sat, Sep 7 2013 3:27 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement