telugu jathi
-
తెలుగు ఖ్యాతి ప్రపంచవ్యాప్తి
తెలుగు ప్రపంచం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఖండఖండాంతరాల వరకు విస్తరించిన ఘనత గలది మన తెలుగుజాతి. తొలి తరాల్లో విదేశాలకు వెళ్లిన తెలుగు ప్రముఖులు ఖండాంతరాలలో మన ఖ్యాతిపతాకాన్ని ఎగురవేశారు. విదేశాల్లో స్థిరపడ్డ మన తెలుగువారు ఇప్పుడు కూడా అదే పరంపరను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అమెరికాలోని తెలుగువాళ్లు సొంత విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఐదేళ్ల కిందట ప్రారంభమైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం శాన్వాకిన్ జిల్లా పరిధిలోని ట్రేసీ పట్టణానికి చేరువలో అరవైఏడు ఎకరాల సువిశాల స్థలంలో ప్రపంచస్థాయి విద్యాప్రాంగణ నిర్మాణాన్ని తలపెట్టింది. దీనికి సీనియర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ కమిషన్ గుర్తింపు లభించడం విశేషం. తెలుగు ప్రజలు గర్వించదగిన పరిణామం ఇది. ఖండాంతరాలలో తెలుగువారి కీర్తపతాక రెపరెపలకు దోహదపడిన తొలితరం ప్రముఖులను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ముఖ్యంగా తెలుగునేలకు వెలుపలి నుంచి కృషి కొనసాగించిన మహానుభావులను తలచుకోవాలి. రష్యాలో పనిచేస్తూ ఉప్పల లక్ష్మణరావు, ఇంగ్లండ్‌లో పనిచేస్తూ గూటాల కృష్ణమూర్తి గత శతాబ్దిలోనే తెలుగు వెలుగులను విదేశాలకు విస్తరించారు. వృక్షశాస్త్రవేత్తగా జగదీశ్చంద్ర బోస్ వద్ద పరిశోధనలు కొనసాగించిన ఉప్పల లక్ష్మణరావు, కమ్యూనిజం వైపు ఆకర్షితులై రష్యా వెళ్లారు. రష్యన్ నుంచి తెలుగులోకి దాదాపు నలభైకి పైగా పుస్తకాలను అనువదించారు. రష్యన్–తెలుగు నిఘంటువును నిర్మించారు. స్వాతంత్య్రోద్యమ నేపథ్యంలో రాసిన ‘అతడు–ఆమె’ నవల, ‘బతుకు పుస్తకం’ ఆత్మకథ సహా పలు రచనలు ఉప్పల స్థానాన్ని తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిపాయి. ఇక ఇంగ్లిష్ సాహిత్యం చదువుకున్న గూటాల కృష్ణమూర్తి ‘లండన్ టైమ్స్’ పత్రికలో గుమస్తా ఉద్యోగం కోసం లండన్ చేరుకున్నారు. అక్కడే పీహెచ్డీ పూర్తి చేసి, ఇన్నర్ లండన్ ఎడ్యుకేషనల్ అథారిటీ సర్వీస్‌లో చేరి, వివిధ కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. మహాకవి శ్రీశ్రీ చేతిరాతతో ‘మహాప్రస్థానం’ ముద్రించడమే కాకుండా, ఆయన స్వయంగా చదివిన ‘మహాప్రస్థానం’ ఆడియో టేపును రికార్డు చేశారు. ఉప్పల, గూటాల ఇద్దరూ తెలుగునేలకు వెలుపల ఒడిశాలో పుట్టి పెరిగిన వారే! ఉప్పల లక్ష్మణరావు బరంపురంలో, గూటాల కృష్ణమూర్తి పర్లాకిమిడిలో పుట్టారు. ఒడిశాలోని ఈ రెండు పట్టణాలూ అప్పట్లో ఒకే జిల్లాలో–గంజాం జిల్లాలో ఉండేవి. పర్లాకిమిడి ఇప్పుడు గజపతి జిల్లా కేంద్రమైంది. తెలుగునేలకు వెలుపల ఉన్న ఈ రెండు పట్టణాలూ ఆధునిక తెలుగు భాషా సాహిత్యాల్లోని కీలకమైన మలుపులకు కేంద్రస్థావరాలుగా నిలిచాయి. వ్యావహారిక భాషోద్యమ సారథి గిడుగు రామమూర్తి పర్లాకిమిడి కేంద్రంగానే తన ఉద్యమాన్ని కొనసాగించారు. తెలుగు పత్రికారంగంలో వాడుక భాషను ప్రవేశపెట్టిన ఘనత గిడుగువారి శిష్యుడు తాపీ ధర్మారావుకు దక్కుతుంది. తాపీవారు బరంపురంలోని ఖల్లికోట కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకుడిగా కొన్నాళ్లు పనిచేశారు. తన మిత్రుడు దేవరాజు వెంకట కృష్ణారావుతో కలసి బరంపురంలో ‘వేగుచుక్క గ్రంథమాల’ను స్థాపించారు. దేవరాజు వెంకట కృష్ణారావు తెలుగులో తొలి డిటెక్టివ్ నవల ‘వాడే వీడు’ రచించారు. తెలుగునేలకు వెలుపల పురుడు పోసుకున్న వ్యావహారిక భాషోద్యమం, డిటెక్టివ్ సాహిత్యం తర్వాతికాలంలో తెలుగు భాషా సాహిత్యాలపై చూపిన ప్రభావం సామాన్యమైనది కాదు. తెలుగులో తొలి డిటెక్టివ్ నవలా రచయితగా మాత్రమే కాదు, గళ్లనుడికట్టు పదప్రహేళిక సృష్టికర్తగా కూడా దేవరాజు వెంకట కృష్ణారావు సాధించిన ఘనత చిరస్మరణీయం. తెలుగునేలకు వెలుపల దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ, వివిధ దేశాల్లోనూ తెలుగువాళ్లు భాషా సాంస్కృతిక సంఘాలను ఏర్పాటు చేసుకుని, భాషా సాంస్కృతిక పరిరక్షణ కోసం ఇతోధికంగా కృషి చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో తెలుగు భాషా సాంస్కృతిక సంస్థలు నేటికీ క్రియాశీలకంగానే పనిచేస్తున్నాయి. అమెరికా, యూరోప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, గల్ఫ్, తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లోనూ తెలుగువారు తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. మయన్మార్‌లో కొద్ది దశాబ్దాలుగా పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి గానీ, బ్రిటిష్ హయాంలో తెలుగువాళ్లు గణనీయమైన సంఖ్యలోనే అక్కడకు వలస వెళ్లేవారు. అప్పట్లో అది బర్మా. దాని రాజధాని రంగూన్. తెలుగువాళ్లు రంగూన్నే ‘రంగం’గా పిలుచుకునేవారు. ఇప్పటికీ వ్యాప్తిలో ఉన్న ఆనాటి జానపద గేయాల్లోనూ, సామెతల్లోనూ వినిపించే ‘రంగం’ రంగూనే! అప్పట్లో బర్మాలో మూడు తెలుగు దినపత్రికలు నడిచేవంటే ఇప్పటి తరానికి నమ్మశక్యం కాదు గానీ, అది వాస్తవ చరిత్ర. తెలుగు రాష్ట్రాలకు దూరంగా మనుగడ సాగిస్తున్న తెలుగు ప్రజలు, తమ ప్రాంతాల్లోని ప్రభుత్వాల సహకారం ఉన్నా, లేకున్నా, తమ భాషా సంస్కృతులను కాపాడుకోవడానికి తమ శాయశక్తులా కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు. తెలుగు భాషలో విద్యాబోధనకు అవకాశాలు లేని ప్రాంతాల్లో తమ పిల్లలు కనీసం తెలుగు మాటలనైనా మరచిపోకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా తెలుగు బడులు సైతం నిర్వహిస్తున్నారు. మన దేశంలోని పలు రాష్ట్రాల్లోనే కాకుండా, తెలుగువారు ఉండే కొన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే, మరికొన్ని దేశాల్లోని విశ్వవిద్యాలయాలు ఎంతో ఉదారంగా తెలుగు బోధన, పరిశోధనలకు ఆస్కారం కల్పిస్తుండటం విశేషం. విదేశాల్లో సొంత విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకున్న ఘనతను తమిళులు మనవాళ్ల కంటే ముందే సాధించారు. ఏదేమైతేనేం, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం ద్వారా తెలుగు అంతర్జాతీయ భాషగా వెలుగొందగలదని ఆశించవచ్చు. -
వి‘భజన’ మిత్రుడు.. చవితి ‘చంద్రుడు’
సాక్షి ప్రతినిధి, విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర శుక్రవారం జిల్లాలో ప్రవేశించనుండడంతో తమ్ముళ్లు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి చందంగా మారింది. అధినేత తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి, ఇప్పుడు సీమాంధ్రలో ఈ యాత్ర చేపట్టడంపై సర్వత్రా నిరసన, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నేపథ్యంలో బాబు యాత్రను సమైక్యవాదులు అడ్డుకుంటే పరిస్థితి ఏమిటని వారు మధనపడుతున్నారు. ఇప్పటికే పార్టీ వైఖరిని వివరించలేక, ఉద్యమంలో చురుగ్గా పాల్గొనలేక ఆ పార్టీ జిల్లా నేతలు గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన హరికృష్ణ ఎన్టీఆర్ సొంతగడ్డ నిమ్మకూరు నుంచి ఆత్మగౌరవ యాత్ర చేపడతానని ప్రకటించడం, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ పాదయాత్ర నిర్వహిస్తాననడంతో కేడర్ కంగుతిన్నారు. అయితే ఆ రెండు యాత్రలు కేవలం ప్రకటనలకే పరిమితం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో బాబు బస్సు యాత్ర శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు జిల్లాలోకి ప్రవేశించనుంది. వారంరోజుల పాటు ఈ యాత్ర సాగే అవకాశం ఉందని పార్టీ ఉపాధ్యక్షులు కంభంపాటి రామమోహనరావు చెబుతున్నారు. తొలిరోజు 20కిలోమీటర్ల మేర నగర పరిధిలోని పశ్చిమ, సెంట్రల్, గన్నవరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. వస్త్రలత సెంటర్లో బహిరంగసభలో మాట్లాడతారని కంభంపాటి విడుదలచేసిన ప్రకటన తెలిపింది. ఈ ప్రశ్నలకు బదులేదీ...? బాబుపై ప్రశ్నల శరపరంపరాలు సంధించేందుకు జనం ఎదురుచూస్తున్నారు. నిన్న లేఖ ఇచ్చి ఇప్పుడు యాత్ర ఎందుకు? ఏమి ఆశించి చేస్తున్నారు? విభజనతో నీటి వనరులపై హక్కు మాటేమిటి? ఇప్పటికే సాగు నీరు లేక ఒక పంటకే పరిమితమైన డెల్టా ఎడారిగా మారిపోయే ప్రమాదాన్ని బాబు ఎందుకు గుర్తించలేదు? సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత తీరుబడిగా స్పందిస్తూ సీమాంధ్రలో రాజధాని ఏర్పాటుకు నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయనడమంటే విభజనకు అంగీకరించినట్టు కాదా? గతం నుంచి తాను రాష్ట్ర విభజనను అడ్డుకుంటు వచ్చానని చెబుతున్న బాబు ఇప్పుడు తాను సమైక్యావాదినేనని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సీమాంధ్రకు చెందిన తమ ప్రజాప్రతినిధులతో ఎందుకు రాజీనామా చేయించలేదు? సమైక్యవాదానికి కట్టుబడినందుకు ఒక్క హరికృష్ణ రాజీనామానే ఆఘమేఘాలపై ఆమోదించడానికి తెరవెనుక కారణం ఏమిటి? వంటి ప్రశ్నలు జిల్లాలో బాబుకు ఎదురుకానున్నాయి. క్యాడర్ హైరానా..... బుధవారం రాత్రి గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కృష్ణాజిల్లా నేతలు, నియోజక వర్గ ఇన్‌చార్జీలతో సమావేశమై బాబు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. యాత్ర సందర్భంగా నియోజక వర్గానికి 250 బైక్‌లు తక్కువ కాకుండా ఉండాలని ఆదేశించారు. అధినేత ఆజ్ఞను శిరసావహించాలంటే భారీ ఖర్చుతో పాటు జనాన్ని పెద్ద ఎత్తున తరలించాల్సి ఉండటంతో పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న దశలో ఈ యాత్రకు జనాన్ని భారీగా తరలించడం ఆషామాషీ వ్యవహారం కాదని నేతలు బెంబేలెత్తుతున్నారు. నగరంలో పార్టీకి సరైన క్యాడర్ లేనందున జన సమీకరణకు నేతలు చేతులెత్తేస్తున్నారు. గత జనవరిలో బాబు నిర్వహించిన పాదయాత్రకు చేసిన అప్పులు తీరకుండానే మళ్లీ ఈ తిప్పలు ఏంటో అర్థం కావడం లేదని పార్టీ శ్రేణులు లబోదిబోమంటున్నాయి. ఉద్యమ నేపథ్యంలో బాబు యాత్రకు ఆందోళనకారుల నుంచి ఎటువంటి ఆటంకంలేకుండా చూసేందుకు భారీగా పోలీసు బలగాలను ఏర్పాటుచేయాలని సీపీ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మరోమారు బట్టబయలైన కుమ్మక్కు రాజకీయం చంద్రబాబు యాత్రకు సహకరించాలంటూ జిల్లా కాంగ్రెస్ నేతలకు అధిష్ఠానం నుంచి వర్తమానం అందినట్లు సమాచారం. బాబును అడ్డుకుని తీరుతామని ప్రగల్బాలు పలికిన పలువురు నేతలు ఇప్పుడు కిమ్మనకుండా కూర్చొనాలని నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో బాబు పాదయాత్ర సందర్భంగా కనువిప్పు యాత్ర అంటూ హడావుడి చేసిన ఎంపీ లగడపాటి ఈసారి చడీచప్పుడు చేయడంలేదు. ఈ రెండు పార్టీల కుమ్మకు రాజకీయాలు మరోమారు బట్టబయలైనట్లయిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ప్రజాప్రతినిధులకు మున్సిపల్ సేవలు బంద్
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: తెలుగుజాతి ఉనికికే ప్రమాదకరంగా మారిన రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా దొంగనాటకాలు ఆడుతున్న ప్రజాప్రతినిధుల నివాసాలకు ఇకపై మున్సిపల్, కార్పొరేషన్ల నుంచి అత్యవసర సేవలు నిలిచిపోనున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రాకపోతే వారి ఇళ్లకు మంచినీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల వంటి సేవలను ఈ నెల 26వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్టు మున్సిపల్ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.లోకేశ్వర వర్మ తిరుపతిలో గురువారం ప్రకటించారు. ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మెబాట పట్టిన మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. గురువారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఉద్యోగులు ఒంటి కాలిపై నిలుచుకుని వినూత్న నిరసన తెలిపారు. అనంతరం సమైక్యాంధ్ర కోసం ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. దొంగనాటకాలు కట్టిపెట్టండి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 22 రోజులుగా సీమాంధ్ర ప్రజలు రోడ్డుపైకొచ్చి అలుపెరగని ఉద్యమాలు చేస్తున్నా వారి గోడు వినే పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు లేరని కేఎల్ వర్మ దుయ్యబట్టారు. విభజన తెలుగు జాతి ఉనికికే ప్రమాదకరంగా మారినా, తమ పదవులకోసం ప్రజల నుంచి తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వకుండా దొంగనాటకాలు ఆడే వారికి సత్తా చూపిస్తామన్నారు. సోమవారం నుంచి వారి ఇళ్ల వద్ద పారిశుద్ధ్య చర్యలు చేపట్టబోమని, మంచినీటి, వీధి దీపాల సేవలను విర మిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ ప్రభావం జిల్లాలోని ఆరు మున్సిపల్, రెండు కార్పొరేషన్లలో ఉంటుందని, ఈ మేరకు ఆయా ప్రాంతాల్లోని ఉద్యోగ, కార్మిక నాయకులకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలకు ప్రభుత్వ ఉపాధి శిక్షణ సంస్థ ప్రాంతీయ డెప్యూటీ డెరైక్టర్ బాలసుబ్రమణ్యం, పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. వీరితోపాటు ఐటీఐ అసోసియేషన్ నాయకులు ప్రతాప్‌నాయుడు, భాస్కర్‌నాయుడు మద్దతు తెలిపారు.