తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: తెలుగుజాతి ఉనికికే ప్రమాదకరంగా మారిన రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా దొంగనాటకాలు ఆడుతున్న ప్రజాప్రతినిధుల నివాసాలకు ఇకపై మున్సిపల్, కార్పొరేషన్‌ల నుంచి అత్యవసర సేవలు నిలిచిపోనున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రాకపోతే వారి ఇళ్లకు మంచినీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల వంటి సేవలను ఈ నెల 26వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్టు మున్సిపల్ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.లోకేశ్వర వర్మ తిరుపతిలో గురువారం ప్రకటించారు. ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మెబాట పట్టిన మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. గురువారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఉద్యోగులు ఒంటి కాలిపై నిలుచుకుని వినూత్న నిరసన తెలిపారు. అనంతరం సమైక్యాంధ్ర కోసం ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
దొంగనాటకాలు కట్టిపెట్టండి
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 22 రోజులుగా సీమాంధ్ర ప్రజలు రోడ్డుపైకొచ్చి అలుపెరగని
ఉద్యమాలు చేస్తున్నా వారి గోడు వినే పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు లేరని కేఎల్ వర్మ దుయ్యబట్టారు. విభజన తెలుగు జాతి ఉనికికే ప్రమాదకరంగా మారినా, తమ పదవులకోసం ప్రజల నుంచి తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వకుండా దొంగనాటకాలు ఆడే వారికి సత్తా చూపిస్తామన్నారు. సోమవారం నుంచి వారి ఇళ్ల వద్ద పారిశుద్ధ్య చర్యలు చేపట్టబోమని, మంచినీటి, వీధి దీపాల సేవలను విర మిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ ప్రభావం జిల్లాలోని ఆరు మున్సిపల్, రెండు కార్పొరేషన్లలో ఉంటుందని, ఈ మేరకు ఆయా ప్రాంతాల్లోని ఉద్యోగ, కార్మిక నాయకులకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలకు ప్రభుత్వ ఉపాధి శిక్షణ సంస్థ ప్రాంతీయ డెప్యూటీ డెరైక్టర్ బాలసుబ్రమణ్యం, పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. వీరితోపాటు ఐటీఐ అసోసియేషన్ నాయకులు ప్రతాప్‌నాయుడు, భాస్కర్‌నాయుడు మద్దతు తెలిపారు.
ప్రజాప్రతినిధులకు మున్సిపల్ సేవలు బంద్
Published Fri, Aug 23 2013 4:25 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement