ప్రాదేశిక లెక్కింపు ఒకేచోట? | votes counting | Sakshi
Sakshi News home page

ప్రాదేశిక లెక్కింపు ఒకేచోట?

Published Sat, Mar 29 2014 2:31 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

ప్రాదేశిక లెక్కింపు ఒకేచోట? - Sakshi

ప్రాదేశిక లెక్కింపు ఒకేచోట?

ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల లెక్కింపు, ఈవీఎంలు, బ్యాలెట్ బాక్సుల భద్రతపై అధికారులు దృష్టి సారించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు రెండు విడతల్లో వచ్చే నెల 6, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని తాజాగా నిర్ణయించడం, ఓట్ల లెక్కింపును కూడా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత.. అంటే మే 7వ తేదీ తర్వాత నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో దాదాపు నెల రోజులపాటు బ్యాలెట్ బాక్సు లను భద్రంగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
వాస్తవానికి ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11 ఆయా నియోజకవర్గ కేంద్రాల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఓట్ల లెక్కింపు వాయిదా పడటంతో నెల రోజులపాటు వేర్వేరు చోట్ల స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేస్తే భద్రత కల్పించడం కష్టమవుతుందన్న భావనతో జిల్లా యూనిట్‌గా ఒకేచోట స్ట్రాంగ్ రూము ఏర్పాటు చేసి.. అక్కడే లెక్కింపు నిర్వహించాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఎచ్చెర్లలోని 21వ శతాబ్ది గురుకుల భవనాలు అందుకు అనువైనవిగా గుర్తించారు.
 
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, జెడ్పీ సీఈవో నాగార్జున సాగర్‌లు శుక్రవారం  21వ శతాబ్ది గురుకులాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్ల ఏర్పాటుకు, అలాగే ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు అనువైన భవనాలను గుర్తించారు.
 
శివానీలో సార్వత్రిక లెక్కింపు
కాగా మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల(ఇచ్చాపురం,పలాస, టెక్కలి,పాతపట్నం,శ్రీకాకుళం,ఆమదలవలస,ఎచ్చెర్ల,నరసన్న పేట, రాజాం)తోపాటు శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కూడా ఒకేచోట నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం జాతీయ రహదారికి ఆనుకొని చిలకపాలెంలో ఉన్న శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలను ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్, ఎస్పీ నవీన్ గులాఠీలు శుక్రవారం ఈ కళాశాలకు వెళ్లి పరిశీలించారు.
 
చేపట్టాల్సిన భద్రతా చర్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్లకు అవసరమైన గదులను పరిశీలించారు. వాటిలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా పది నియోజకవర్గాలు ఉండగా పాలకొండ సెగ్మెంట్ అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉండటంతో ఆ ఓట్లను అక్కడ లెక్కిస్తారని తెలుస్తోంది. కాగా రాజాం, ఎచ్చెర్ల సెగ్మెంట్లు విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో ఎంపీ ఓట్లను విజయనగరంలో, అసెంబ్లీ ఓట్లను ఇక్కడ లెక్కించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement