వీవీ ప్యాట్, ఈవీఎంల గురించి తెలియజేస్తున్న కలెక్టర్ ధర్మారెడ్డి, పక్కన పలువురు అధికారులు
మెదక్ అర్బన్ : శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ గురువారం నుంచి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే మొదటి విడత ఈవీఎంల తనిఖీలు పూర్తయినట్లు వివరించారు. ఈవీఎంలను తనిఖీ చేసే విధానం, సీల్ చేసే విధానాన్ని జాయింట్ కలెక్టర్, ఆయా రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో వివరించినట్లు తెలిపారు. ప్రతి ఈవీఎంను తనిఖీ చేసి, శుభ్రం చేసిన తర్వాత అది సరిగ్గా పని చేస్తున్నట్లయితేనే వాటిని వినియోగిస్తామన్నారు.
ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయులు, పట్టభ«ద్రుల ఓట్ల తుది విడత రూపొందించడం జరిగిందన్నారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు పట్టభద్రులు 7,473 మంది, ఉపాధ్యాయులు 1,120 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతి మండల కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఎన్నికల సమయంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారని... ఈవీఎంలో అన్ని సరిగ్గా పని చేస్తున్నాయనే నిర్ధారణకు వచ్చిన తర్వాతనే పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈవీఎంలలో డిజిటల్ క్లాక్ ద్వారా ఏ ఓటు ఎన్ని గంటల సమయంలో పోలైన విషయం కూడా స్పష్టంగా తెలుస్తుందని కలెక్టర్ వివరించారు. ఈవీఎంలను తనిఖీ చేసిన సమయంలో సరిగ్గా పని చేయని 22 కంట్రోల్ యూనిట్లు, 3 బ్యాలెట్ యూనిట్లు, 50 వీవీ ప్యాట్లను తిరిగి వెనక్కి పంపడం జరుగుతుందన్నారు. ఈవీఎంల పనితీరు, ఓటు వేసే విధానం గూర్చి జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో ప్రజలకు అవగాహన నిర్వహించడం జరుగుతుందన్నారు.
1950 నంబర్‌లో తెలుసుకోవచ్చు..
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారని.. నామినేషన్ల ప్రక్రియ తదితరాలు కలెక్టరేట్‌లో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఓటరు నమోదు ప్రక్రియ కార్యక్రమం నిర్వహించగా మంచి స్పందన వచ్చిందని ఇందులో 21 వేలకు పైగా నూతనంగా ఓటర్లుగా నమోదు జరిగిందన్నారు. వాటిలో మెదక్ నియోజకవర్గంలో 11,391, నర్సాపూర్ నియోజకవర్గంలో 10,090 నూతనంగా ఓటర్లు నమోదు ప్రక్రియ జరిగిందని కలెక్టర్ వివరించారు. మెదక్ నియోజకవర్గంలో మూడు వేల పైచిలుకు, నర్సాపూర్ నియోజకవర్గంలో 1,200 ఓట్లు తొలగింపులు, మార్పులు, చేర్పులు చేయడం జరిగిందన్నారు.
ఈనెల 22న తుది ఓటరు జాబితాను ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. అలాగే ఓటరు జాబితాను ప్రతి గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద అతికించడం జరుగుతుందన్నారు. అలాగే గ్రామాల్లో నివాసం ఉండకుండా ఇతర ప్రాంతాలకు బతుకుదెరువు నిమిత్తం వలసవెళ్ళిన వారు, ఉద్యోగ రీత్యా వెళ్ళిన వారు తమ పేరు ఓటరు జాబితాలో ఉందా ? లేదా అనే విషయాన్ని 1950 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. నామినేషన్ల చివరి తేదీకి పది రోజుల ముందు వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ ధర్మారెడ్డి వివరించారు. ఎన్నికల కమిషన్ ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల పాఠశాల (చునావ్ పాఠశాల) అని ఏర్పాటు చేసిందని... దీని ముఖ్య ఉద్దేశం ఎన్నికలపై అవగాహన, జరిగే తీరు, ఓటరు పాత్రపై అందరికి అవగాహన కల్పించడం అని తెలిపారు.
ఈ పాఠశాలలను ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతుందన్నారు. దీనికి బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) కో–ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రతి నెల మొదటి శనివారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని వివరాలను తెలియజేస్తారని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల పనితీరు, సీల్ చేసిన విధానం, ఓట్ల లెక్కింపు చేసే ప్రక్రియను కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో ఎన్నికల సిబ్బంది నజీర్ అహ్మద్, రవికుమార్, అధికారులు రాజిరెడ్డి, శైలేశ్వర్‌రెడ్డి, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment