పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ముక్కుపచ్చలారని శిశువులకు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కరువైంది. వ్యాక్సిన్ల కొరత నవజాత శిశువుల పాలిట శాపంలా మారుతోంది. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిర్లిప్తత చిన్నారులను వ్యాధుల బారిన పడేసేలా ఉంది. ఇక పేద, మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా పరిణమిస్తోంది. సర్కారు దవాఖానాల్లో వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవటంతో ప్రైవేటు ఆస్పత్రులు, లేదా మెడికల్‌షాపుల్లో అధిక ధరలకు వ్యాక్సిన్లు కొని బిడ్డలకు వేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పుట్టిన 24గంటల్లోనే శిశువులకు అత్యంత ప్రమాదకరమైన హెపటైటిస్–బీ వ్యాక్సిన్ వేయించాల్సి ఉండగా.. ఈ వ్యాక్సిన్ ఆస్పత్రుల్లో లభించడం లేదు. మిగతా వ్యాక్సిన్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. ఎప్పుడు అడిగినా వ్యాక్సిన్లు లేవనే సమాధానమే వస్తోంది. దీంతో ప్రభుత్వ వైఫల్యంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వాస్పత్రుల్లోనే 9 వేల ప్రసవాలు
జిల్లా ఆస్పత్రి, ప్రాంతీయ ఆస్పత్రి, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లోనే అధికంగా ప్రసవాలు జరుగుతాయి. జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా సుమారు 15వేల మంది పిల్లలు జన్మిస్తుంటే, ఒక్క ప్రభుత్వాస్పత్రుల్లోనే 9 వేల ప్రసవాలు జరుగుతున్నట్లు వైద్య శాఖ అధికారుల అంచనా. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోనే నెలలో సుమారు 2 వేల ప్రసవాలుజరుగుతున్నాయి. ఒక వేళ ప్రైవేటు అసుపత్రుల్లో ఆపరేషన్లు, ప్రసవాలు చేయించుకున్నా తమ బిడ్డలకు మాత్రం వ్యాక్సిన్లను ప్రభుత్వాస్పత్రుల్లోనే తల్లిదండ్రులు వేయిస్తారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వేయించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని. అందుకే చాలామంది వ్యాక్సిన్లకు ప్రభుత్వాస్పత్రులనే ఆశ్రయిస్తారు. సుమారు 75 శాతానికి పైగా తల్లులు తమ బిడ్డలకు ప్రభుత్వాస్పత్రుల్లోనే వ్యాక్సిన్లు వేయిస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్లు వేస్తుండడమే దీనికి కారణం. బయట వ్యాక్సిన్లు కొనాలంటే రూ.150 నుంచి రూ.350 వరకూ, ఇక డిమాండ్‌ను బట్టి రూ.500 వరకూ వెచ్చించాల్సిన పరిస్థితి.
వ్యాక్సిన్లు చంటిబిడ్డలకు శ్రీరామరక్ష
భయంకరమైన ప్రాణాంతక వ్యాధుల నుంచి చంటి బిడ్డలను కాపాడుకునేందుకు వ్యాక్సిన్లు వేయించాల్సి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే శిశువులకు సకాలంలో వ్యాక్సిన్లు వేయించటం శ్రీరామరక్ష వంటిదనే చెప్పాల్సి ఉంటుంది. వ్యాక్సిన్లు వేయించటం ఎంత ముఖ్యమో సకాలంలో వ్యాక్సిన్ ఇవ్వటం అత్యంత ప్రాధాన్యమైంది. సకాలంలో బిడ్డలకు వ్యాక్సిన్ వేయించకుంటే నిమోనియా, ధనుర్వాతం, కోరింతదగ్గు, హెపటైటిస్–బీ (కాలేయ జబ్బులు) వస్తాయి. ఈ జబ్బులు రాకుండానే నివారించేందుకు ప్రయత్నించాలి తప్ప సోకిన అనంతరం చికిత్స చాలా కష్టమైన అంశం. క్రమం తప్పకుండా నిర్దేశించిన సమయానికి ఏ వ్యాక్సిన్ వేయించాలో ఆ టీకా తప్పకుండా వేయించటం చిన్నారుల భవిష్యత్తుకు భరోసానే.
24 గంటల్లోనే వ్యాక్సిన్ వేయాలి
పుట్టిన బిడ్డకు 24గంటల్లోనే కామెర్ల వ్యాధి రాకుండా హెపటైటిస్–బీ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటంది. కానీ ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం ప్రధాన ఆస్పత్రుల్లోనూ అందుబాటులో లేదు. ప్రైవేటు అస్పత్రులకు వెళితే భారీగా సొమ్ములు గుంజేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఇలా ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌లు తమ పిల్లలకు వేయించటం తలకుమించిన భారంలా పరిణమి స్తోంది. భావితరాల ఆరోగ్యానికి ప్రభుత్వం ఏ మేరకు శ్రద్ధ చూపిస్తోందో వ్యాక్సిన్ల కొరతను చూస్తే అర్థమవుతోంది. ఇక మీజిల్స్ రూబెల్లా (తట్టు రాకుండా) వ్యాక్సిన్ సైతం అందుబాటులో లేదు. ఇనాక్టివ్ పోలియో వ్యాక్సిన్ ప్రభుత్వాస్పత్రిలో దొరకనే దొరకదు. కోరింత దగ్గుకు ఇచ్చే డీపీటీ వ్యాక్సిన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. పైనుంచే సరఫరా లేదని సమాచారం. ముందుగానే వ్యాక్సిన్లు తెప్పించుకోవాల్సి ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సిన్లు లేవట
నా భార్య విజయలక్ష్మి బాబుకు జన్మనిచ్చింది. వైద్యులు వెంటనే హెపటైటిస్–బీ వ్యాక్సిన్ వేయించాలని చెప్పారు. ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సిన్ అందుబాటులో లేదన్నారు. బయట మందుల షాపులో తీసుకుని వేయించాల్సి వచ్చింది. పిల్లలకు సకాలంలో వ్యాక్సిన్ వేయకపోతే మీ బిడ్డకే ప్రమాదమని వైద్యులు చెబితే చాలా కంగారు పడ్డాను. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా వేయాల్సిన వ్యాక్సిన్ దొరకకపోతే ఎలా.
– వెంకటేశ్వరరావు, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment