
ఇద్దరూ మాట్లాడుకుంటే సరిపోతుంది
► చట్టపరంగా ఇళయరాజా నోటీసు సమంజసమే
► బాలసుబ్రహ్మణ్యానికి ఐపీఆర్‌ఎస్ నిబంధనలు తెలియవా?
► సినీ సమీక్షకుడు వీఏకే రంగారావు
బొబ్బిలి రూరల్: సినీ పరిశ్రమలోనే కాదు.. సంగీతాభిమానుల్లోనూ ఇళయరాజా.. బాలు మధ్య ఏర్పడిన అగాధంపై తీవ్ర చర్చ నడుస్తోంది. తన అనుమతి లేకుండా తాను స్వరపరచిన గీతాలు ఆలపించడం సరికాదంటూ ఇళయరాజా బాలసుబ్రహ్మణ్యానికి నోటీసులు పంపడం సినీవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వీరి వివాదం నోటీసుల వరకు ఎందుకు? ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే వివాదం ముదిరేది కాదేమో.. అని విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ప్రముఖ నృత్యకారుడు, సినీ విశ్లేషకుడు, సమీక్షకుడు, లిమ్కాబుక్ రికార్డు నెలకొల్పిన పాటల సేకరణకర్త వీఏకే రంగారావు అభిప్రాయపడ్డారు.
మంగళవారం బొబ్బిలిలో ‘సాక్షి’ పలకరించినపుడు ఆయన అభిప్రాయాలను వెల్లడించారు. చట్టపరంగా ఇళయరాజా నోటీసు సమంజసమేనన్నారు. ఆయన ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు ఇవ్వడమే విచిత్రమని పేర్కొన్నారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి ఐపీఆర్‌ఎస్ నిబంధనలు తెలియవా.. అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...
‘రాయల్టీ కోరే హక్కు గాయకులు, రచయితలు, స్వరకర్తలు, నిర్మాతలు.. అందరికీ ఉంది. టికెట్లు వసూలు చేసే కార్యక్రమాల నిర్వాహకులు రాయల్టీ చెల్లించాలి. దీనిపై వారధిగా 1969లో ది ఇండియన్ పెర్‌ఫార్మెన్స్ రైట్స్ సొసైటీ (ఐపీఆర్‌ఎస్) ఏర్పడింది. దీని నిబంధనల ప్రకారం టికెట్ వసూలుచేసే ప్రోగ్రామ్స్‌లో ఎవరి పాటలైనా పాడితే, ఏర్పాటుచేస్తే రాయల్టీ చెల్లించాలి. ఎవరైనా అభ్యంతరపెడితే వారి పాటలు పాడకూడదు. ఇది ప్రైవేటు రిజిస్టర్డ్ సంస్థ. దీని నిబంధనలకు అందరూ కట్టుబడాలి. గతంలో ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లలో ప్రోగ్రామ్స్‌కు రాయల్టీలు ఇచ్చేవారు. గతంలో లతామంగేష్కర్ తన పాటలకు రాయల్టీ కోరారు.’
‘చట్టప్రకారం ఇళయరాజాకు నోటీసు ఇచ్చే అధికారం ఉంది. కానీ బాలు యూఎస్‌లో పాడే సమయంలోనే ఎందుకు ఇచ్చారో? అర్థంకావడం లేదు. 50 ఏళ్లకుపైగా పాటలు పాడుతున్న బాలసుబ్రహ్మణ్యానికి ఐపీఆర్‌ఎస్ గురించి తెలీదా? చారిటీతో పాటలు పాడినా.. డబ్బులు తీసుకుని కచేరీలు నిర్వహించేటప్పుడు రాయల్టీ చెల్లించాల్సిందే. ఈ వివాదంపై ఐపీఆర్‌ఎస్ స్పందించాలి. దీనిపై పలువురు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పారు. అనంతశ్రీరామ్ ఐపీఆర్‌ఎస్‌పై బాగా చెప్పారు. 25 శాతం వాటాలో ఎంతో నాకు తెలీదు కానీ.. ఆయన గాయకుల విషయం చెప్పలేదు. వారిద్దరూ స్నేహితులే కాబట్టి.. మధ్యవర్తులు లేకుండా వారిద్దరే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది.’