దూసుకొచ్చిన మృత్యువు | van crushed to auto, nine people died | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

Published Mon, Apr 7 2014 3:14 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

దూసుకొచ్చిన మృత్యువు - Sakshi

దూసుకొచ్చిన మృత్యువు

అదుపు తప్పి తిరగబడ్డ ఆటో, అదే సమయంలో ఢీకొన్న వ్యాన్
 ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి
 
 కొత్తపేట, న్యూస్‌లైన్: అసలే మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఆటో.. దానికి తోడు సెల్‌ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో నడిరోడ్డు నెత్తుటి మడుగైంది. తోబుట్టువు ఇంట్లో జరిగే శుభకార్యానికి చేరుకోవాలన్న అతడి ఆత్రుత తొమ్మిది మందిని మృత్యుకుహరంలోకి నెట్టింది.
 
 తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం గొలకోటివారి పాలెం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన దుర్గారావు (40), అతడి భార్య దుర్గ (35), కుమార్తె చిట్టి (3), తల్లి నాగరత్నం (60), పినతల్లి నాగమణి (45), పినతండ్రి వెంకటేశ్వరరావు (45), మరో పినతండ్రి కొడుకు బాలకృష్ణ (35), అన్న కుమారుడు నాని (10), అక్క తొత్తరమూడి మంగ (45) ప్రాణాలు కోల్పోయారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి శివారు తాడిచెరువు గట్టుకు చెందిన ఆటోడ్రైవర్ దుర్గారావు చెల్లెలు లంకపార్వతిది రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు. ఆమెకు ఇటీవల ఆడపిల్ల పుట్టింది.
 
 ఆ పాపకు మీద పళ్లు ముందు రావడంతో వారి నమ్మకం ప్రకారం ఆదివారం శాంతి కార్యక్రమం తలపెట్టారు. ఉదయం 9.10 గంటలకు ఆ కార్యక్రమం తలపెట్టగా దుర్గారావు కుటుంబసభ్యులు, బంధువులతో తాడిచెరువు గట్టు నుంచి ఆలస్యంగా బయల్దేరాడు. అయినప్పటికీ ముహూర్తానికి ముమ్మిడివరప్పాడు చేరుకోవాలన్న ఆత్రుతతో ఆటోను వేగంగా నడుపుతున్నాడు. గొలకోటివారిపాలెం వచ్చేసరికి.. ఆటోకు ముందు వెళ్తున్న అమలాపురం-రాజమండ్రి ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దింపేందుకు ఆగింది.
 
 బస్సును ఢీకొనకుండా తప్పించే యత్నంలో ఆటో తిరగబడింది. అదే సమయంలో రావులపాలెం నుంచి ముక్కామలకు కొబ్బరి లోడుతో వెళ్తున్న వ్యాన్ ఆటోను ఢీకొని కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఈ క్రమం లో ఆటో.. రోడ్డు పక్కనున్న తురాయి చెట్టుకు, సమీపంలోని వంతెన గోడకు.. వ్యాన్‌కు మధ్య ఇరుక్కుని నుజ్జునుజ్జయింది. దుర్గారావు, దుర్గ, పాపమ్మ, నాగమణి, బాలకృష్ణ, నాని, మంగ అక్కడికక్కడే మరణించారు. దుర్గారావు కుమార్తె చిట్టి, వెంకటేశ్వరరావు, సోదరుడు చాట్ల పల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు.   చిట్టి, వెంకటేశ్వరరావుల పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు.  
 
 కన్నీరుమున్నీరైన ఆత్మీయులు
 తొమ్మిదిమందిని పొట్టన పెట్టుకున్న ప్రమాదం వారి ఆత్మీయులను కన్నీటి సంద్రంలో ముంచింది. మృతుల్లో ఒకరైన బాలకృష్ణ భార్య కుమారి ప్రస్తుతం గర్భిణి. వారికి ఇప్పటికే రెండేళ్ల కుమార్తె ఉంది. మీదు పళ్ల దోషనివారణ వేడుకకు కుమారి కూడా వెళ్లాల్సి ఉన్నా చర్చికి వెళ్లాలని ఆగిపోయింది. అన్న కుమారుడైన నానిని తీసుకు బయల్దేరిన బాలకృష్ణ ఆ బాలుడితో సహా కడతేరిపోయాడు. మరో మృతురాలు నాగమణి భర్త చంద్రరావు తాను కొద్దిసేపటి కిందట సాగనంపిన భార్య తిరిగి రాని లోకాలకు తరలిపోయిందని తెలుసుకుని కుప్పకూలిపోయాడు. ఆటోడ్రైవర్ దుర్గారావు కుమార్తెలు జ్యోతి (5), చిట్టి (3) మేనత్త ఇంట జరిగే వేడుకకు పట్టు పరికిణీలు ధరించి, ఎంతో ఉత్సాహంగా బయలుదేరారు. తీవ్రంగా గాయపడి, నెత్తుట తడిసిన పట్టు పరికిణీతో చిట్టిని చూసిన వారందరూ కంటతడిపెట్టారు. చిట్టిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడింది. స్వల్పగాయాలతో బయటపడిన జ్యోతి బంధువులను వాటేసుకుని.. ‘అమ్మానాన్న ఏరీ?’ అని ఏడుస్తూ అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక కంటతడి పెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement