
రేసు గుర్రాలు
ద్వారకానగర్: ముద్దులొలికే చిన్నారులు ఇప్పుడు బుడిబుడి అడుగులు వేస్తూనే సైకిల్ కావాలంటున్నారు. రకరకాల మోడల్స్‌లో వస్తున్న బైసికిల్ కావాలని మారాం చేస్తున్నారు. కట్టిపడేసే కార్టూన్ బొమ్మల రూపంలో మార్కెట్లోకి వస్తున్న చైనా సైకిళ్లు వారిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు ఇచ్చేయడంతో వీటికి డిమాండ్ మరింత పెరిగింది. సైకిళ్లు కొనిపించుకొని రోడ్లపై, ఖాళీ స్థలాల్లో చక్కర్లు కొడుతున్నారు. కాస్త పెద్ద పిల్లలైతే ఎత్తయిన సైకిళ్లు కొనుక్కొని రేసుగుర్రాల్లా దూసుకుపోతున్నారు. ‘ఇది మన ఏరియా’ అన్నట్టు రహదారులను ఆక్రమించేస్తున్నారు.
వాహన చోదకులు బాలల ఉత్సాహాన్ని చూసి ముచ్చట పడుతూ వారికి దారి వదులుతున్నారు. సైకిలు కొనుక్కోవాలనుకునే వారికి కొన్ని సూచనలు...మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సుగల చిన్నారులకు 12 ఇంచీల సైకిల్ సరిపోతుంది. దీని ధర రూ.2500 ఉంది. నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాల వయస్సు మధ్యగల చిన్నారులకు 14 ఇంచీల సైకిల్ సరిపోతుంది. దీని ధర రూ.3,500లు. ఐదు నుంచి పది సంవత్సరాల చిన్నారులకు 16 ఇంచీలు, ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల వారికి 18 ఇంచీల సైకిల్ అవసరం. ఇవి రూ.3,900 నుంచి రూ.4,250 వరకు ధర పలుకుతున్నాయి.
గత సంవత్సరంతో పోలిస్తే ఐదు శాతం ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త మోడల్స్ వచ్చాయి. ఆధునిక సైకిళ్లకు మ్యూజికల్స్‌తోపాటు డిస్క్ బ్రేకు ఇచ్చారు. లైటింగ్ ఉంటుంది. ట్రైసైకిల్ ఒకటి నుంచి ఐదు సంవత్సరాల చిన్నారులకు ఉపయోగపడుతుంది. హ్యాండిల్ వద్ద ఉన్న వీణలోను హెడ్‌లోనూ మ్యూజిక్ ఉంటుంది. వెనక భాగంలో పెద్దలు పట్టుకుని తోయడానికి హ్యాండిల్ ఉంటుంది. ఇవి నగరంలోని పలు పేరొందిన షాపుల్లో లభిస్తున్నాయి. మరికొన్ని సైకిల్స్ కారు మోడల్స్ కూడా లభిస్తున్నాయి.