తిరుపతిలో వ్యవసాయ వర్సిటీ ఔట్!
- 48 గంటల్లో మారిన.. వ్యవసాయ విశ్వవిద్యాలయం కథ
- గుంటూరు-విజయవాడ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం!
నలభై ఎనిమిది గంటల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు కథ మారిపోయింది..! తిరుపతి నుంచి వ్యవసాయ విద్యాలయం చేజారిపోయింది. గుంటూరు-విజయవాడ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో వైవిధ్యభరితమైన భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో తిరుపతిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అత్యంత అనువైన ప్రాంతమని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరొక వర్సిటీని తిరుపతిలో సైతం నెలకొల్పాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జాతీ య స్థాయి విద్య, పరిశోధన కేంద్రాలను నెలకొల్పడానికి కేంద్రం నిధులను మంజూరు చేస్తానని గతంలోనే హామీ ఇచ్చింది. అందులో భాగంగా జిల్లాలో ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐఎస్‌ఈఆర్‌తో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భూమిని గుర్తించాలని రెండు రోజుల క్రితం కలెక్టర్ రాంగోపాల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన కలెక్టర్ రాంగోపాల్ రెవెన్యూ అధికారులతో రెండు రోజుల క్రితమే సమావేశమయ్యారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం భూమిని అన్వేషించడంలో అధికారు లు నిమగ్నమై ఉండగానే.. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తిరుపతిలో ఆ వర్సిటీని ఏర్పాటుచేయడం లేదని బాంబు పేల్చారు. ఆ వర్శిటీని గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతంలో ఏర్పాటుచేయాలని నిర్ణయిం చారు.
ఆ ప్రాంతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరూ కాదనడం లేదు. కానీ.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకరకమైన భౌగోళిక పరిస్థితులు.. తక్కిన ఏడు జిల్లాల్లోనూ మరొక రకమైన శీతోష్ణ పరిస్థితులు ఉన్నాయి.
వర్షాభావ ప్రాంతమైన రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో సంక్షోభంలో కూరుకుపోయిన సేద్యాన్ని గట్టెక్కించాలంటే.. నీటి ఎద్దడిని తట్టుకుని, అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను ఆవిష్కరించాల్సి న అవసరం ఎంతైనా ఉంది. తిరుపతిలో మరొక వ్యవసా య విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తేనే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సేద్యాన్ని గాడిలో పెట్టేందుకు సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి బలంగా విన్పిస్తోంది.