సాక్షి, గుంటూరు : మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచే విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మద్యనిషేధంపై హేళనగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో బెల్టు షాపులు ఎత్తివేయడం వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని... మహిళలు ప్రశాంతంగా ఉంటే ఆయనకు ఇష్టం లేనట్లుగా కనిపిస్తుందని విమర్శించారు. ఆయన హయాంలో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో అందరికీ తెలుసునన్నారు. ఎన్టీఆర్ మద్య నిషేధం చేస్తే చంద్రబాబు నిషేధాన్ని ఎత్తివేసి వేశారని గుర్తుచేశారు.
గురువారమిక్కడ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... ‘మద్యం వల్లే దేశంలో 40 శాతం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నేరాలకు ప్రధాన కారణం కూడా అదే. మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. మద్యపాన నిషేధం అమలు చేయడం రాష్ట్రాల నైతిక బాధ్యత. చదువుకునే పిల్లలు సైతం మద్యానికి బానిసలు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అభినందనీయం. బిహారులో మద్యనిషేధం తర్వాత 20 శాతం క్రైం రేటు తగ్గింది. అయితే చంద్రబాబు మాత్రం మద్యపాన నిషేధాన్ని హేళన చేస్తూ.. తూట్లు పొడవాలని చూస్తున్నారు. నిషేధాన్ని నీరుగారిస్తే మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదు’ అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment