అసలీ ప్రభుత్వానికి సిగ్గుందా?
హైదరాబాద్: ఏపీ మంత్రులు అలీబాబా దొంగల ముఠాలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. హైదరాబాద్ లో శనివారం ఆమె మాట్లాడుతూ సీఆర్డీఏ బిల్లును మెకన్సీ అనే బ్రిటిష్ సంస్థకు అప్పగించడం దారుణమన్నారు. మెకన్సీ రూపొందించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసిన ప్రభుత్వానికి సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. రాజధాని బిల్లును కూడా రూపొందించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా అని ఆమె ఎద్దేవా చేశారు . చంద్రబాబు ఏపీని దేశానికి గేట్వేగా మార్చడం కాదని.. ప్రైవేటు సంస్థల దోపిడీకి గేట్ వేగా మారుస్తున్నారంటూ ఆమె ధ్వజమెత్తారు.
సింగపూర్ బృందం బందిపోట్లలా అర్ధరాత్రి పర్యటించడమేంటని, ఇది ప్రజాస్వామ్యమా లేక బ్రిటిష్ పాలనా అని ప్రశ్నించారు. ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తుంటే చంద్రబాబు మాత్రం విదేశాల వైపు చూస్తున్నారంటూ విమర్శించారు. బిల్లును విదేశీ సంస్థకు అప్పగించడంపై న్యాయ విచారణ జరిపించాలని పద్మ డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో విదేశాలతో చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలను బయటపెట్టాలన్నారు.