పెట్రోల్‌పై వ్యాట్ మోత! | VAT on petrol-lift! | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌పై వ్యాట్ మోత!

Published Sun, Jan 4 2015 1:34 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

పెట్రోల్‌పై వ్యాట్ మోత! - Sakshi

పెట్రోల్‌పై వ్యాట్ మోత!

  • అదనంగా రెండు శాతం పన్ను విధించనున్న రాష్ట్ర ప్రభుత్వం
  • పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ఆదాయం తగ్గిన నేపథ్యంలో నిర్ణయం
  • రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్
  • లీటర్ పెట్రోల్ రూ. 1.60, డీజిల్ ఒక రూపాయి వరకూ పెరిగే అవకాశం
  • సాక్షి, హైదరాబాద్: పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయంగా తగ్గుతున్నా.. తెలంగాణ ప్రజలపై భారం పెరగబోతోంది. విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పెంపుతో వినియోగదారులపై మోత మోగించేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతోంది. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను రెండు శాతం మేర పెంచాలని నిర్ణయించింది. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదలతో పన్నుల ఆదాయం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

    దీనికి సంబంధించి ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ ప్రతిపాదనలు సమర్పించిందని.. ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సీఎం కేసీఆర్‌తో చర్చించారని సమాచారం. దీనికి సంబంధించి రెండు లేదా మూడు రోజుల్లో సీఎం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ పెంపు ప్రతిపాదన ఉన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధ్రువీకరించారు.
     
    చాటు దెబ్బ..: అంతర్జాతీయంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గినా... కేంద్ర ప్రభుత్వం రిటైల్ మార్కెట్‌లో తగ్గించలేదు. శుక్రవారం నుంచి ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ. 2 మేర పెంచి సర్దుబాటు చేసింది. తద్వారా వచ్చే మూడు నెలల్లో దేశవ్యాప్తంగా రూ. 6 వేల కోట్ల ఆదాయాన్ని పొందనుంది. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ఆదాయం తగ్గడంతో... రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం దారిలో నడవాలని నిర్ణయించింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాల మీద వ్యాట్ రూపంలో 2014 జూన్ నుంచి 2015 మార్చి వరకు రూ. 7 వేల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేసింది.

    కానీ గత ఆరునెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు దాదాపు రూ. 10 వరకూ తగ్గడంతో... వ్యాట్ ఆదాయం తగ్గిపోయింది. గత  జూన్ నుంచి ఏనెలకానెల రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల మేర ఆదాయం తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను 2 శాతం వరకు పెంచాలని యోచిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలపై ఇప్పటికిప్పుడే భారం పడకపోయినా... రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను పెంచితే మాత్రం లీటర్‌కు ఒక రూపాయి నుంచి రూ. 1.60 వరకు అదనపు భారం వెంటనే పడుతుంది.
     
    నెలకు రూ. 14 కోట్ల భారం..

    ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్ మీద 22.25 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. అంటే పన్నులు లేకుండా పెట్రోల్ ధర రూ. 49.75, డీజిల్ ధర రూ. 44.65 కాగా... వ్యాట్ తరువాత పెట్రోల్ రూ. 66.54కు, డీజిల్ రూ. 54.88కు చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న వ్యాట్‌ను మరో రెండు శాతం పెంచితే పెట్రోల్ ధర రూ. 1.60 పెరిగి రూ. 68కి, డీజిల్ రూపాయికి పైగా పెరిగి రూ. 56 వరకు చేరే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏటా సుమారు 130 కోట్ల లీటర్ల మేర డీజిల్ అమ్మకాలు జరుగుతుండగా... 18 లక్షల నుంచి 20 లక్షల లీటర్ల వరకు పెట్రోల్ అమ్మకాలు సాగుతున్నాయి. తద్వారా అదనంగా  నెలకు రూ. 14 కోట్ల చొప్పున ఏటా రూ. 160 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement