సాక్షి, అమరావతి : డీజిల్ భారాన్ని తగ్గించుకునేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రణాళికలు రూపొందిస్తోంది. సంస్థకు ఉద్యోగుల వేతనాల తర్వాత డీజిల్‌పై ఖర్చే అధికం. ఏటా వేతనాలకు రూ.3 వేల కోట్లు వెచ్చిస్తున్న సంస్థ డీజిల్‌పై రూ.2,100 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆర్టీసీలో రోజుకు 8 లక్షల లీటర్ల డీజిల్ వాడుతున్నారు. డీజిల్‌పై రూపాయి పెరిగితే రోజుకు రూ.8 లక్షలు నెలకు రూ.2.40 కోట్లు అదనపు భారం పడుతుంది. అదే రూ.2 పెరిగితే అదనంగా రూ.4.80 కోట్ల భారం పడుతుంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ సీఎన్‌జీ బస్సులను పెంచుకోవడం, బయో డీజిల్ వాడకంపై దృష్టి సారించింది. 350 విద్యుత్తు బస్సుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
తిరుమలకు 150, విజయవాడలో 100, విశాఖపట్నంలో 100 విద్యుత్తు బస్సులను నడిపాలని నిర్ణయించింది. కేంద్రం ఫేమ్–2 పథకం కింద నిధులు అందించేందుకు సుముఖంగానే ఉండటంతో ఆర్టీసీ విద్యుత్తు బస్సుల కోసం ప్రతిపాదనలు పంపింది. తొలుత తిరుమలలో 150 బస్సులు నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ)తో నడిచే బస్సులు పెంచాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 302 సీఎన్‌జీ బస్సులున్నాయి. విజయవాడలో విద్యాధరపురం, గవర్నర్‌పేట–2, ఇబ్రహీంపట్నం డిపోల పరిధిలోను, తూర్పుగోదావరి రీజియన్‌లో రాజమండ్రిలోను సీఎన్‌జీ బస్సులు తిప్పుతున్నారు. వీటిని పెంచేందుకు ఈడీల కమిటీ అధ్యయనం చేస్తోంది.
ఆయిల్ బంకుల ఏర్పాటుపై అధ్యయనం
ఆర్టీసీ డిపోల్లో ఆయిల్ బంకులను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ వాహనాలకు ఆయిల్ సరఫరా చేస్తే నాన్ టిక్కెట్ రెవెన్యూ కింద కొంత ఆదాయం ఆర్జించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం.. పోలీస్ శాఖ గుంటూరు, విశాఖల్లో నిర్వహిస్తున్న ఆయిల్ బంకులపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం ఆర్టీసీ డిపోల్లో బంకుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment