చిరు బతుకులను కూల్చేశారు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ఆమదాలవలస: టీడీపీ నేతలు పంతం నెగ్గించుకున్నారు. ఏళ్ల తడబడి చిరు వ్యాపారాలు చేసుకుంటున్న కుటుంబాలపై ఉక్కుపాదం మోపారు. ఓ కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు, పోలీసుల సహాయంతో రాత్రి వేళ దమనకాండ కొనసాగించారు. ఆమదాలవసల రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న శ్రీపాలపోలమ్మతల్లి కూరగాయాల మార్కెట్ దుకాణాల తొలగింపు ప్రక్రియలో అధికారులు, పోలీసులు.. టీడీపీ నేతలు సూచించినట్టే నడుచుకోవడం నివ్వెరపోయేలా చేసింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు చర్చల పేరిట తంతు కొనసాగించిన అధికారులు .. రాత్రి 9 గంటల తర్వాత విశ్వరూపం చూపారు. 42 కుటుంబాలు కూరగాయల షాపులు నడుపుకొంటున్న మార్కెట్ సముదాయ స్థలంలో రూ.80 లక్షలతో దుకాణ సముదాయం నిర్మించేందుకు మున్సిపాలిటీ ముందుకు వచ్చింది. ఈ ప్రక్రియ ఎన్నికల ముందే మొదలైనా.. జనం అడ్డుతగలడంతో కొన్నాళ్లపాటు నిలిచిపోయింది. మూడు నెలల అనంతరం మళ్లీ తెరమీదకు వచ్చింది.
కథ నడిపిన చైర్‌పర్సన్ భర్త
కొత్తగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్సులో 42 మందికి దుకాణాలు కేటాయిస్తామని నాయకులు అంగీకరించారు. అయితే లిఖితపూర్వక హామీ ఇవ్వాలని వర్తకులు పట్టుబట్టారు. ఇటీవల ఈ విషయపై సిటిజన్ ఫోరం, ప్రజా సంక్షేమ సంఘం, మరికొందరు పెద్దల సమక్షంలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీత, ఆమె భర్త విద్యాసాగర్ (తంబి), తహశీల్దార్ కె. శ్రీరాములు, కమిషనర్ ఎన్.నూకేశ్వరరావులు తీర్మానించారని చెబుతూ వర్తకుల్ని నమ్మిస్తూ వచ్చారు.
అయితే ఆ కాపీని బయటపెట్టలేదు. సోమవారం ఉదయం నుంచి స్థానిక పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ టి.మోహనరావు, సీఐ విజయానంద్ సమక్షంలో చర్చలు జరిపినా మున్సిపల్ చైర్‌పర్సన్ హాజరుకాలేదు. ఆమె భర్త మాత్రం వచ్చి కథంతా నడిపించారు. తమకు నచ్చని వ్యక్తుల వద్దకు వ్యాపారులు వెళ్లి పంచాయితీ పెట్టారని, తాము ఎంత చెప్పినా వినకుండా కోర్టుకు వెళ్లారని, కొత్త కాంప్లెక్సులో దుకాణాలిస్తామని చెబుతున్నా వినకుండా ఆందోళనకు దిగుతున్నారనిఅధికారులు, పోలీసుల వద్దే ఆగ్ర హం వెళ్లగక్కారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాటను కాదని తానెలా లిఖితపూర్వక హామీ ఇస్తానని ప్రశ్నించారు. మీడియా, పోలీసులు, పెద్దల సమక్షంలో చెప్పినా చాలదా అంటూ ఊగిపోయారు.
పోలీసుల హైడ్రామా
తీర్మానం తెలియకుండానే, చట్టం చదవకుండానే పోలీసులు హైడ్రామా నడిపారు. తొలుత మున్సిపల్ అధికారులు, నాయకుల నుంచి లిఖితపూర్వక హామీ ఇప్పిస్తామని వ్యాపారులకు చెప్పి చివరికి చేతులెత్తేశారు. ఒకవైపు అదనపు బలగాలు రప్పించి.. మరోవైపు ఒప్పంద పత్రం తయారు చేశారు. అయితే దానిపై సంతకాలకు ఎవరూ ముందుకు రాలేదు. పెద్ద మనుషులు చెబుతున్నారు కదా వినండి అంటూ వ్యాపారులపై ఒత్తిడి పెంచారు. తరువాత మార్కెట్ వద్దకు మాజీ మంత్రి తమ్మినేని సీతారాం రావడం, వైఎస్సార్ సీపీ నాయకుల సహాయంతో అక్కడ బైఠాయించడం, మున్సిపల్ కమిషనర్‌కు ఎన్ని వివరాలు అడిగినా స్పష్టమైన వివరణలు లభించపోవడాన్ని గమనించినా.. తాము విధులు నిర్వహించడానికే వచ్చామని,
కమిషనర్ ఎలా చెబితే అలా వింటామని చెప్పడం, కమిషనర్‌గారూ మీరే చెప్పండి..మీరు ఏం చెబితే అది చేస్తాం అనగానే కమిషనర్ నూకేశ్వరరావు తొలగింపు ప్రక్రియకు పచ్చజెండా ఊపేయడంతో భారీ బందోబస్తు నడుమ, 144 సెక్షన్ విధించి, లాఠీలతో జనాలను చెదరగొట్టారు. అనంతరం జేసీబీ సాయంతో మున్సిపల్ సిబ్బంది అక్కడి దుకాణాల్ని పడగొట్టేశారు. ఈ సందర్భంగా తమ్మినేని, ఆయన తనయుడు చిరంజీవినాగ్, కౌన్సిలర్లు దుంపల శ్యామలరావు, జీవీ అప్పలనాయుడు, బొడ్డేపల్లి అజంతాకుమారి, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పొన్నాడ కృష్ణవేణి తదితరుల్ని అరెస్టు చేసి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు జె. వెంకటేశ్వరరావు, కిరణ్, వ్యాపారులకు మద్ధతు పలికారు.
స్టే వస్తుందనుకుంటున్నంతలోనే..
వాస్తవానికి తమకు జరుగుతున్న అన్యాయంపై వ్యాపారులు గతంలోనే కోర్టుకు వెళ్లారు. రేపోమాపో స్టే కూడా వస్తుందన్న ధీమాతో ఉన్నారు. అంతలోనే అధికారులు ఈ దమనకాండకు పాల్పడ్డారు. స్టే వస్తే తమ పాచిక పారదనే భయంతోనే అంతా కానిచ్చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ కాంట్రాక్టర్‌తో టీడీపీ నాయకులు కుమ్మక్కై దుకాణాల్ని తొలగించారనే విమర్శలున్నాయి. రాత్రి వేళ విద్యుత్ సరఫరా నిలిపివేసి భారీ బందోబస్తుతో వ్యాపారుల పొట్ట కొట్టారు. కౌన్సిల్ తీర్మానం లేకుండానే, ఎలాంటి నోటీసులూ జారీ చేయకుండానే, ఈనెల 30నాటి సమావేశంలో ఎజెండా చూపెట్టకుండానే మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగనున్నారు. సెక్షన్ 151, 192లు అమలవుతున్నాయని, గతంలోనే ప్రత్యేకాధికారి అంగీకరించేశారని దుకాణాల గూర్చి కమిషనర్ చెబుతున్నా వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేడి అడిగిన కొన్ని ప్రశ్నలకు కమిషనర్ సమాధానాలు చెప్పలేకపోవడం గమనార్హం. దుకాణాల తొలగింపులో స్థానికుల గోడ కూలిపోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
ఫోన్లోనే అంతా
కమిషనర్, చైర్‌పర్సన్ భర్త విద్యాసాగర్ సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన తంతును ఎప్పటికప్పుడు కూన రవికుమార్, ఇతర టీడీపీ నేతలకు ఫోనులో తెలియజేస్తూనే ఉన్నారు. పోలీసులతో చర్చలు జరుపుతున్నప్పుడూ ఇది స్పష్టమైంది. ఏం జరిగినా ఫరవాలేదు..మేం చెప్పిందే చేయండి అంటూ కూన ఫోన్లో స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోనూ గతంలో ఇదే మాదిరిగా దుకాణాలు తొలగించినా తరువాత వర్తకులకు అన్యాయమే జరిగిందని పలువురు ప్రస్తావించినా తాము చెప్పింది చేయడమే అధికారుల బాధ్యత అంటూ అట్నుంచి స్వరం వినిపించడంతో అధికారులు అనుకున్నది చేసేశారు.