vegetables market
-
కూరగాయల వైపే..
సాక్షి సిటీబ్యూరో: కరోనా భయంతో జనం కూరగాయల వైపు చూస్తున్నారు. నాన్ వెజ్ ఎందుకులే.. అంత రిస్క్ ఎందుకనో ఏమో మాంసాహారం వైపు వెళ్లడం లేదు.చికెన్ తింటే కరోనా ప్రభావం ఉండదని ప్రకటనలు వస్తున్నా ఎందుకో జనం జంకుతున్నారు. ముక్క లేనిది ముద్ద దిగని వారు కూడా వెజిటేరియన్ ఫుడ్ తింటున్నారు. గ్రేటర్ పరిధిలో మాములు రోజుల్లో కంటే ఇటీవల కాలంలో కూరగాయల వినియోగం ఎక్కువగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. గ్రేటర్‌జనాభా..కూరగాయల డిమాండ్ ఇలా.. గ్రేటర్లో దాదాపు కోటిమంది నివాసముంటున్నారు. ప్రతిరోజూ 3వేల టన్నుల కూరగాయలు వినియోగించేవారు. అంటే ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్కరికీ 300 గ్రాములు అవసరం. అయితే గత వారం రోజుల నుంచి కరోనా ప్రభావంతో నగర జనం నాన్‌వెజ్‌కు దూరమయ్యారు. అదనంగా మరో వెయ్యి టన్నుల కూరగాయల విక్రయాలు సాగుతున్నాయి. రోజు 4 వేల టన్నుల కూరగాయలు నగరవాసి వినియోగిస్తున్నాడు. నగరానికి రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచే కాక కర్నూలు, చిత్తూరు, అనంతపురం తదితర ప్రాంతాలనుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి.కర్ణాటక ప్రాంతానికి చెందిన చిక్‌బళ్లాపుర్ నుంచి వస్తున్నాయి. అతితక్కువ టమాట కేజీ రూ. 10 ఉండగా, అత్యధికంగా చిక్కుడు, బీరకాయ ధర కేజీ రూ. 40 వరకు ఉన్నాయి. ఇక వచ్చే నెల నుంచి కూరగాయల సీజన్ ముగుస్తుంది. ఇదే స్థాయిలో కూరగాయల వినియోగం ఉంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలో ఒక్క కొల్డ్‌ప్టొరేజ్ లేదు... గ్రేటర్‌తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కూరగాయలు నిలువ చేయడానికి ఒక్క కోల్డ్‌ప్టొరేజ్ లేదు. దీంతో స్థానిక సీజన్లో ఎక్కువ మోతాదులో కూరగాయలు, దుంపలు, ఆకుకూరలు మార్కెట్‌కు రైతులు తీసుకొస్తే ప్రభుత్వం కొనుగోలు చేసి వాటిని భద్రపర్చడానికి అవకాశం లేదు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయం గురించిపట్టించుకోని ప్రభుత్వం వచ్చే నెల ఏప్రిల్ నుంచి కూరగాయల సీజన్ ముగుస్తుంది. ప్రస్తుతం డిమాండ్‌కు సరిపడా కూరగాయలు నగర మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి. కూరగాయల వినియోగం ప్రస్తుతం ఉన్నట్లు ఉంటే వచ్చే నెలలో ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయనుందో తెలియదు. సీజన్లో కూరగాయలు ఎక్కువ దిగుబడి అయితే వాటిని నిలువ చేసి అన్‌సీజ్‌లో ధరలు నిలకడగా ఉంచడానికి మర్కెటింగ్, హార్టికర్చర్ శాఖ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. -
ఆ అధికారి నిర్వాకంపై నెటిజన్ల ఫైర్..
లక్నో : ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మార్కెట్‌కు ఓ రైతు తీసుకువచ్చిన కూరగాయలను తన వాహనంతో తొక్కించిన ప్రభుత్వ అధికారి ఉదంతం ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హపూర్ జిల్లాలోని ప్రభుత్వం నిర్వహించే మార్కెట్లో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అధికారుల అనుమతి లేకుండా రైతు తన కూరగాయలను అమ్ముకుంటున్నాడనే ఆక్రోశంతో అధికారి చేసిన నిర్వాకంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ రైతు అమ్మకానికి ఉంచిన కూరగాయలపై మార్కెట్ కార్యదర్శి సుశీల్ కుమార్ తన ఎస్‌యూవీతో పలుమార్లు ముందుకు, రివర్స్ తీసుకోవడం మొబైల్ ఫోన్ వీడియోలో రికార్డయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇతర అధికారులు, సిబ్బంది సహా ఏ ఒక్కరూ సుశీల్ కుమార్ ఆగడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ అధికారి తన డ్రైవర్‌ను మందలించి చేతులు దులుపుకున్నారు. ఓ ప్రభుత్వ అధికారి రైతు తీసుకువచ్చిన కూరగాయలను ధ్వంసం చేయడం సరైంది కాదని నెటిజన్లు మండిపడ్డారు. రైతు మార్కెట్‌కు తీసుకువచ్చిన కూరగాయలను వృధా చేశారని ఆ అధికారి తీరును ట్విటర్లో జనం తీవ్రంగా ఖండించారు. -
‘మన కూరగాయలు’ చాలా కాస్ట్ గురూ..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రవేశపెట్టిన ‘మనకూరగాయలు’ రిటైల్ విక్రయ కేంద్రాల్లో ధరలు హాట్ హాట్‌గా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు. శుక్రవారం మోండా డివిజన్ మారేడుపల్లి నెహ్రూపార్కులో ‘మన కూరగాయల’ రిటైల్ విక్రయ కేంద్రాన్ని సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు. తాజా కూరగాయలు తక్కువ ధరలో విక్రయించాలనే సంకల్పంతో ‘మన కూరగాయల’ రిటైల్ కేంద్రాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. జన సంచారం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కేంద్రాన్ని ఏర్పాటుచేసి సేల్స్మెన్ల ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. మన కూరగాయల రిటైల్ విక్రయ కేంద్రాన్ని ప్రత్యేక క్యాబిన్లో ఏర్పాటు చేశారు. కూరగాయలు తాజాగా ఉండేందుకు ఏసీని సైతం ఏర్పాటు చేశారు. అన్నిరకాల కూరగాయలతో పాటు పండ్లను ఈ కేంద్రంలో అమ్మకానికి పెట్టారు. అయితే మన కూరగాయలు విక్రయ కేంద్రంలో ధరలు చూసి వినియోగదారులు కళ్లు తేలేస్తున్నారు. బయట మార్కెట్ ధరల కంటే సుమారు కిలోకు రూ.5 నుంచి 10 వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. సూపర్ మార్కెట్ల కంటే అదనంగా రేట్లు ఉండడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. బయటి మార్కెట్ కం టే సూపర్మార్కెట్లో కొంతమేర అధిక ధరలు ఉన్నప్పటికీ అదే స్థాయిలో మనకూరగాయలు విక్రయ కేంద్రంలో ధరలు ఉండడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. నేరుగా రైతు పండించిన కూరగాయలను వినియోగదారులకు అందించాలనే సంకల్పంతో వ్యవసాయ మార్కె టింగ్ శాఖ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ధరల్లో వ్యత్యాసం మూలంగా వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. దళారీ వ్యవస్థ నిర్మూలనకు మన కూరగాయలు తాజా కూరగాయలను అందించడంతో పాటు తక్కువ ధరలో నాణ్యమైన కూరగాయాలను అందించే లక్ష్యంగా ‘మన కూరగాయలు’ విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మన కూరగాయల రిటైల్ విక్రయ కేంద్రం ద్వారా దళారుల వ్యవస్థను పూర్తిగా రూపుమాపవచ్చునని, దీంతో వినియోగదారులకు తక్కువ ధరల్లోనే కూరగాయలు లభిస్తాయన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరికొన్ని మనకూరగాయల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సాయన్న తెలి పారు. డిప్యూటీ డైరెక్టర్ పద్మహర్ష, మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మోండా మార్కెట్ కార్పొరేటర్ రూప, నగేశ్ ఉన్నారు. -
ఇంకెన్నాళ్లీ కష్టాలు ?
మార్కెట్లో మారని పరిస్థితులు దుమ్ము, దూళిలో వ్యాపారం డేరాల కిందనే విక్రయాలు రోడ్లపైనే యథేచ్ఛగా.. ట్రాఫిక్ జామ్‌తో సతమతం ఆధునికీకరణ మరచిన అధికారులు కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్‌లోని ప్రధాన కూరగాయల మార్కెట్లో సమస్యలు పరిష్కారం కావడం లేదు. మార్కెట్ బయట రోడ్డుపై కూరగాయలు విక్రయించొద్దనే అధికారుల ఆదేశాలు అమలుకావడం లేదు. మార్కెట్‌లోపలే విక్రయించాలంటున్న అధికారులు సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా మళ్లీ వ్యాపారులు రోడ్డెక్కుతున్నారు. దుమ్ముదూళిలోనే కూరగాయలు విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యగా మారింది. మోడల్ మార్కెట్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం ఆ మాటలు మరిచిపోయినట్లు ఉంది. ఏడాదిన్నర క్రితం అధికారులు ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకున్నారు. స్థలాలు చూపించినా.. గతేడాది మార్చిలో కూరగాయల మార్కెట్లోని ఆక్రమణలు తొలగించి రోడ్డుపైన విక్రయించే వారందరికీ లోపల స్థలాలు చూపించారు. అయితే ఇన్నాళ్లు రోడ్డుపై విక్రయించేందుకు అలవాటుపడ్డ వ్యాపారులు కొద్దీ రోజులకే మళ్లీ రోడ్డెక్కారు. రోడ్డుపై విక్రయాలు నిషేధిస్తూ..రోడ్డుపై వర్తకులకు రైతుబజార్లో చోటు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వ్యాపారులు ససేమిరా అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఆధునికీకరణ ఎప్పుడో? ప్రధాన కూరగాయల మార్కెట్లో నిలువ నీడలేకపోవడంతో వ్యాపారులు ఇబ్బం దులు పడుతున్నారు. మార్కెట్ లోపలిక ంటే బయటనే వ్యాపారం బాగుంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. యాబై ఏళ్ల క్రితం ఏర్పడిన మార్కెట్లో ఇన్నాళ్లు చిన్నపాటి వివాదాలున్నప్పటికీ ప్రస్తుతం అవి కూడా సమసిపోయాయి. దీంతో మార్కెట్ ఆధునికీకరిస్తామని చెప్పిన అధికారులు లోపల ఉన్న షెడ్లను కూల్చి చదును చేశారు. ఎండొస్తే ఎండుతూ, వానొస్తే తడుస్తూ వ్యాపారు లు డేరాల కింద కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్, పోలీసుశాఖ దృష్టి సారించి మార్కెట్ ఆధునికీకరణతో పాటు రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ సమస్య ప్రధాన మార్కెట్‌కు మూడు వైపులా ఉన్న రోడ్లపై ఇరువైపులా కూరగాయలు విక్రయిస్తున్నారు. మార్కెట్లోకి వెళ్లాలంటే రోడ్డుపై కదలడమే కష్టంగా మారింది. దీనికి తోడు ఆటోలు, ద్విచక్ర వాహనాలు మార్కెట్ రోడ్డుపైకి రావడంతో కాలినడక కష్టంగా మారింది. ప్రధాన మార్కెట్ ఏరియానే కాకుండా నగరంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. వారసంత, ఫారెస్ట్ ఆఫీసు ఎదుట, ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట, పాతబజార్, కార్ఖానగడ్డ, ముకరంపుర, ఆదర్శనగర్ ప్రాంతాల్లో రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. -
చిరు బతుకులను కూల్చేశారు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ఆమదాలవలస: టీడీపీ నేతలు పంతం నెగ్గించుకున్నారు. ఏళ్ల తడబడి చిరు వ్యాపారాలు చేసుకుంటున్న కుటుంబాలపై ఉక్కుపాదం మోపారు. ఓ కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు, పోలీసుల సహాయంతో రాత్రి వేళ దమనకాండ కొనసాగించారు. ఆమదాలవసల రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న శ్రీపాలపోలమ్మతల్లి కూరగాయాల మార్కెట్ దుకాణాల తొలగింపు ప్రక్రియలో అధికారులు, పోలీసులు.. టీడీపీ నేతలు సూచించినట్టే నడుచుకోవడం నివ్వెరపోయేలా చేసింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు చర్చల పేరిట తంతు కొనసాగించిన అధికారులు .. రాత్రి 9 గంటల తర్వాత విశ్వరూపం చూపారు. 42 కుటుంబాలు కూరగాయల షాపులు నడుపుకొంటున్న మార్కెట్ సముదాయ స్థలంలో రూ.80 లక్షలతో దుకాణ సముదాయం నిర్మించేందుకు మున్సిపాలిటీ ముందుకు వచ్చింది. ఈ ప్రక్రియ ఎన్నికల ముందే మొదలైనా.. జనం అడ్డుతగలడంతో కొన్నాళ్లపాటు నిలిచిపోయింది. మూడు నెలల అనంతరం మళ్లీ తెరమీదకు వచ్చింది. కథ నడిపిన చైర్పర్సన్ భర్త కొత్తగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్సులో 42 మందికి దుకాణాలు కేటాయిస్తామని నాయకులు అంగీకరించారు. అయితే లిఖితపూర్వక హామీ ఇవ్వాలని వర్తకులు పట్టుబట్టారు. ఇటీవల ఈ విషయపై సిటిజన్ ఫోరం, ప్రజా సంక్షేమ సంఘం, మరికొందరు పెద్దల సమక్షంలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత, ఆమె భర్త విద్యాసాగర్ (తంబి), తహశీల్దార్ కె. శ్రీరాములు, కమిషనర్ ఎన్.నూకేశ్వరరావులు తీర్మానించారని చెబుతూ వర్తకుల్ని నమ్మిస్తూ వచ్చారు. అయితే ఆ కాపీని బయటపెట్టలేదు. సోమవారం ఉదయం నుంచి స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పీ టి.మోహనరావు, సీఐ విజయానంద్ సమక్షంలో చర్చలు జరిపినా మున్సిపల్ చైర్పర్సన్ హాజరుకాలేదు. ఆమె భర్త మాత్రం వచ్చి కథంతా నడిపించారు. తమకు నచ్చని వ్యక్తుల వద్దకు వ్యాపారులు వెళ్లి పంచాయితీ పెట్టారని, తాము ఎంత చెప్పినా వినకుండా కోర్టుకు వెళ్లారని, కొత్త కాంప్లెక్సులో దుకాణాలిస్తామని చెబుతున్నా వినకుండా ఆందోళనకు దిగుతున్నారనిఅధికారులు, పోలీసుల వద్దే ఆగ్ర హం వెళ్లగక్కారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాటను కాదని తానెలా లిఖితపూర్వక హామీ ఇస్తానని ప్రశ్నించారు. మీడియా, పోలీసులు, పెద్దల సమక్షంలో చెప్పినా చాలదా అంటూ ఊగిపోయారు. పోలీసుల హైడ్రామా తీర్మానం తెలియకుండానే, చట్టం చదవకుండానే పోలీసులు హైడ్రామా నడిపారు. తొలుత మున్సిపల్ అధికారులు, నాయకుల నుంచి లిఖితపూర్వక హామీ ఇప్పిస్తామని వ్యాపారులకు చెప్పి చివరికి చేతులెత్తేశారు. ఒకవైపు అదనపు బలగాలు రప్పించి.. మరోవైపు ఒప్పంద పత్రం తయారు చేశారు. అయితే దానిపై సంతకాలకు ఎవరూ ముందుకు రాలేదు. పెద్ద మనుషులు చెబుతున్నారు కదా వినండి అంటూ వ్యాపారులపై ఒత్తిడి పెంచారు. తరువాత మార్కెట్ వద్దకు మాజీ మంత్రి తమ్మినేని సీతారాం రావడం, వైఎస్సార్ సీపీ నాయకుల సహాయంతో అక్కడ బైఠాయించడం, మున్సిపల్ కమిషనర్‌కు ఎన్ని వివరాలు అడిగినా స్పష్టమైన వివరణలు లభించపోవడాన్ని గమనించినా.. తాము విధులు నిర్వహించడానికే వచ్చామని, కమిషనర్ ఎలా చెబితే అలా వింటామని చెప్పడం, కమిషనర్‌గారూ మీరే చెప్పండి..మీరు ఏం చెబితే అది చేస్తాం అనగానే కమిషనర్ నూకేశ్వరరావు తొలగింపు ప్రక్రియకు పచ్చజెండా ఊపేయడంతో భారీ బందోబస్తు నడుమ, 144 సెక్షన్ విధించి, లాఠీలతో జనాలను చెదరగొట్టారు. అనంతరం జేసీబీ సాయంతో మున్సిపల్ సిబ్బంది అక్కడి దుకాణాల్ని పడగొట్టేశారు. ఈ సందర్భంగా తమ్మినేని, ఆయన తనయుడు చిరంజీవినాగ్, కౌన్సిలర్లు దుంపల శ్యామలరావు, జీవీ అప్పలనాయుడు, బొడ్డేపల్లి అజంతాకుమారి, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పొన్నాడ కృష్ణవేణి తదితరుల్ని అరెస్టు చేసి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు జె. వెంకటేశ్వరరావు, కిరణ్, వ్యాపారులకు మద్ధతు పలికారు. స్టే వస్తుందనుకుంటున్నంతలోనే.. వాస్తవానికి తమకు జరుగుతున్న అన్యాయంపై వ్యాపారులు గతంలోనే కోర్టుకు వెళ్లారు. రేపోమాపో స్టే కూడా వస్తుందన్న ధీమాతో ఉన్నారు. అంతలోనే అధికారులు ఈ దమనకాండకు పాల్పడ్డారు. స్టే వస్తే తమ పాచిక పారదనే భయంతోనే అంతా కానిచ్చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ కాంట్రాక్టర్‌తో టీడీపీ నాయకులు కుమ్మక్కై దుకాణాల్ని తొలగించారనే విమర్శలున్నాయి. రాత్రి వేళ విద్యుత్ సరఫరా నిలిపివేసి భారీ బందోబస్తుతో వ్యాపారుల పొట్ట కొట్టారు. కౌన్సిల్ తీర్మానం లేకుండానే, ఎలాంటి నోటీసులూ జారీ చేయకుండానే, ఈనెల 30నాటి సమావేశంలో ఎజెండా చూపెట్టకుండానే మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగనున్నారు. సెక్షన్ 151, 192లు అమలవుతున్నాయని, గతంలోనే ప్రత్యేకాధికారి అంగీకరించేశారని దుకాణాల గూర్చి కమిషనర్ చెబుతున్నా వైఎస్సార్సీపీ నేత తమ్మినేడి అడిగిన కొన్ని ప్రశ్నలకు కమిషనర్ సమాధానాలు చెప్పలేకపోవడం గమనార్హం. దుకాణాల తొలగింపులో స్థానికుల గోడ కూలిపోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఫోన్లోనే అంతా కమిషనర్, చైర్పర్సన్ భర్త విద్యాసాగర్ సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన తంతును ఎప్పటికప్పుడు కూన రవికుమార్, ఇతర టీడీపీ నేతలకు ఫోనులో తెలియజేస్తూనే ఉన్నారు. పోలీసులతో చర్చలు జరుపుతున్నప్పుడూ ఇది స్పష్టమైంది. ఏం జరిగినా ఫరవాలేదు..మేం చెప్పిందే చేయండి అంటూ కూన ఫోన్లో స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోనూ గతంలో ఇదే మాదిరిగా దుకాణాలు తొలగించినా తరువాత వర్తకులకు అన్యాయమే జరిగిందని పలువురు ప్రస్తావించినా తాము చెప్పింది చేయడమే అధికారుల బాధ్యత అంటూ అట్నుంచి స్వరం వినిపించడంతో అధికారులు అనుకున్నది చేసేశారు. -
‘చెత్త’ మార్కెట్లు
జిల్లాలోని మార్కెట్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. రోజుల తరబడి వ్యర్థాలను తొలగించడం లేదు. దుర్వాసన కారణంగా మార్కెట్లలోకి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునేవారు లేరు. జిల్లాలోని 50 శాతానికిపైగా మండలాల్లో మార్కెట్ల ఊసే లేదు. సంతలు లేదా రోడ్లపైనే అమ్మకాలు సాగుతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస సదుపాయాలు లేకపోవడంతో వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. సాక్షి, చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా కూరగాయల మార్కెట్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. పారిశుద్ధ్యం గురించి పట్టించుకునే వారు కరువవుతున్నారు. తిరుపతి, పుంగనూరు, మదనపల్లె, చిత్తూరు వంటి పెద్ద పట్టణాల మార్కెట్లలో చెత్త రెండు రోజులకోసారి తొలగిస్తున్నారు. రెండవ శ్రేణి పట్టణాలైన పలమనేరు, శ్రీకాళహస్తి వంటి చోట్ల మూడునుంచి నాలుగురోజులకోసారి చెత్త తొలగిస్తున్నారు. వి.కోటవంటి చోట్ల చెత్త ను తొలగించేవారే లేరు. సత్యవేడు వంటి పట్టణాల్లో రోడ్లపైనే కూరగాయల విక్రయాలు సా గుతున్నా యి. జిల్లాలో ని 50 శాతానికిపైగా మండలాల్లో మార్కెట్లే లేవు. తిరుప తి, చిత్తూరు నగరాల్లోని రైతు బజార్ల నిర్వహణ అంతంతమాత్రంగా ఉంది. కుప్పం బైపాస్‌రోడ్డులో కూరగాయల మార్కెట్ ఉంది. రోజుకు 500 మందికిపైగా కొనుగోలుదారులు వస్తుంటారు. మార్కెట్లోనే వ్యర్థాలను పడేస్తున్నారు. చెత్త తొలగింపు చర్యలను పంచాయతీ పట్టించుకోవడం లేదు. దుర్వాసన కారణంగా ప్రజ లు ఇబ్బంది పడుతున్నారు. వి.కోట, పలమనేరు మార్కెట్ల నిర్వహణ సరిగా లేదు. వ్యర్థాలను సకాలంలో తొల గించడం లేదు. పలమనేరులో కూరగాయల వ్యర్థాలను తొలగించేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు మున్సిపాలిటీకి నెలవారి డబ్బులు చెల్లించడం లేదు. దీంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోంది. బెరైడ్డిపల్లె, పెద్దపంజాణి, గంగ వరం మండలాల్లో కూరగాయల మార్కెట్లే లేవు. సత్యవేడులో మార్కెట్ ఉన్నా నిరుపయోగం. మార్కెట్ గదుల్లో సరైన సౌకర్యాలు లేవు. దీంతో వ్యాపారులు రోడ్డుపైనే అమ్మకాలు సాగిస్తున్నారు. కొందరు ప్రయివేటుగా గదులు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. కూరగాయల వ్యర్థాలను రోడ్లపైనే కుమ్మరిస్తున్నారు. సమస్యను పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పట్టించుకోవడం లే దు. వ్యర్థాలను తినేందుకు పశువులు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. నాగలాపురం, బీఎన్.కండ్రిగలో కూరగాయల మార్కెట్లు లేవు. పిచ్చాటూరులో కొత్తగా సంత పెట్టారు. శ్రీకాళహస్తి పెద్ద మార్కెట్లో నాలుగురోజులకోసారీ కూడా మున్సిపాలిటీ వారు చెత్త తీయడం లేదు. ఏడు మిని మార్కెట్లలోనూ చెత్త పేరుకుపోయి ఉంటోంది. పుత్తూరులోని మార్కెట్లో 40 గదులు ఉన్నాయి. సౌకర్యాలు అంతంతమాత్రమే. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. రెండు రోజులకోసారి చెత్త తొలగిస్తున్నారు. నగరిలో సంత ఉంది. నిండ్ర, వడమాల పేట, విజయపురంలో కూరగాయల మా ర్కెట్లు లేవు. చంద్రగిరి నియోజకవర్గానికి అంతటికీ కలిపి చంద్రగిరిలోనే కూరగాయల మార్కెట్ ఉం ది. ఇక్కడా పారిశుద్ధ్యం అంతంతమాత్రమే. ఎర్రవారిపాళెం, రామచంద్రాపురం, చిన్నగొట్టిగల్లు, తిరుపతి రూరల్‌లో కూరగాయల మార్కెట్లు లేవు. బి.కొత్తకోటలో మార్కెట్లేదు. రోడ్లపైనే కూరగాయల అమ్మకాలు సాగుతున్నాయి. తంబళ్లపల్లె, ములకలచెరువు, పీటీఎం, కురబలకోట, పెద్దమండ్యం మండలాల్లో కూరగాయల మార్కెట్లు లేవు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కూరగాయల మార్కెట్లు లేవు. పెనుమూరు, వెదురుకుప్పం, పాలసముద్రం, కార్వేటినగరం మండలాల్లో వారానికోసారి సంత నిర్వహిస్తున్నారు. అయితే షెడ్లు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. చిత్తూరు, పుంగనూరులో కూరగాయల మార్కెట్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. చెత్త తొలగింపులో జాప్యం చోటు చేసుకుం టోంది. ఈ క్రమంలో కొనుగోలుదారుల అ వస్థలు వర్ణనాతీతం. -
రైతు కష్టం వర్షార్పణం
చేగుంట, న్యూస్‌లైన్ : మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఆరుబయట ఆరబోసిన మొక్కజొన్న విత్తనాలు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పక్షం రోజులుగా మండలంలోని రుక్మాపూర్, అనంతసాగర్, ఉల్లితిమ్మాయిపల్లి, రెడ్డిపల్లి, వడియారం, చిన్నశివునూర్లకు చెందిన రైతులు పంటను బైపాస్‌రోడ్డుకు పక్కనే ఉన్న సర్వీస్‌రోడ్డుపై ఆరబోసారు. రోడ్డుపై పోస్తే తొందరగా ఆరుతాయని వాటిని నేరుగా వ్యాపారులకు అక్కడే అమ్ముకోవచ్చని రైతు భావించారు. అయితే బుధవారం కురిసిన అకాల వర్షం రైతులను ముంచింది. దీంతో రోడ్డుపై ఆరబోసిన మక్కలన్నీ వరద నీటిలో కొట్టుకు పోయినీటిలో కలిసిపోయాయి. రుక్మాపూర్ రైతు సిద్దిరాంలుకు చెందిన మక్కలన్నీ నీటిలో కొట్టుకు పోయాయి. దీంతో ఆయన వాటిని సేకరించే పనిలోపడ్డాడు. మరోవైపు 10 రోజుల క్రితం క్వింటాలుకు రూ. 1500 పలికిన మక్కల ధర ప్రస్తుతం తగ్గించారు. అంతే కాకుండా నాణ్యతాలోపం పేరున మక్కలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తిచూపడం లేదు. రూ. 1100 క్వింటాలు చొప్పున నాణ్యమైన మక్కలను మాత్రమే కొనుగోలు చేస్తామని వ్యాపారులు తెగేసి చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి చొరవ చూపి మక్కలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మక్కలు నేలపాలు కొల్చారం : మండలంలో బుధవారం అర్ధరాత్రి, గురువారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట విత్తు దశలోనే వర్షాలు విస్తారంగా పడడంతో సరిగా మొలకెత్తలేదని, ప్రస్తుతం భారీ వర్షానికి పంట మొత్తం తుడిచి పెట్టుకుపోయిందని రైతులు పేర్కొంటున్నారు. దీంతో పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 30 క్వింటాళ్లు వచ్చే మొక్కజొన్న పంట ప్రస్తుతం వర్షం తాకిడికి సగానికి సగం తగ్గిపోయిందంటూ రైతులు గోడును వెల్లబోసుకుంటున్నారు. గింజలను రోడ్లపై ఆరబోసిన సమయంలోనే వర్షాలు కురియడంతో అవికాస్త నేలపాలయ్యాయి. ప్రభుత్వం ఆదుకుని తమ పంటకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. తుడిచిపెట్టుకుపోయిన మక్కలు సిద్దిపేట రూరల్ : అకాల వర్షానికి చేతికొచ్చిన మొక్కజొన్న పంట నీటిపాలైయింది. గురువారం ఉదయం మండలంలో కురిసిన వర్షానికి మొక్కజొన్నలు తడిసి ముద్దగా మారాయి. మూడు నెలలు కష్టం ఒక్క రోజులో బుగ్గిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పుల్లూరు బండపై మక్క క ంకులు, మక్కలు ఎండేశారు. అయితే వర్షానికి మక్కలు మొత్తం నానిపోయాయని, వీటిని వ్యాపారులు కొనుగోలు చేయని వాపోయారు. మక్కలు మొలకెత్తడం, బరువు తగ్గడం జరుగుతుంది. దీంతో కనీస మద్దతు ధర పలుకదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని లింగారెడ్డిపల్లి, నాంచారుపల్లి, బక్రిచె ప్యాల, రాఘావాపూర్, చింతమడక, నారాయణరావుపేట, తోర్నాల, వెంకటాపూర్, ఇర్కోడ్, తదితర గ్రామాలలో అధిక మొత్తంలో నష్టం జరిగిన ట్లు తెలిసింది. మొక్కజొన్న రైతుల రాస్తారోకో సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్ : మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట సిద్దిపేట - కరీంనగర్ రహదారిపై రైతులు రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, కొండపాక మండలాలతో పాటు కరీంనగర్ , వరంగల్ జిల్లాల సమీప గ్రామాల నుంచి సుమారు మూడు వేల క్వింటాళ్ల మొక్కజొన్నలు స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు వచ్చాయన్నారు. అయి తే మొక్కజొన్నల ధర పడిపోయిందంటూ ట్రేడర్లు వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 1310గా మద్దతు ధర ప్రకటించినా స్థానిక అధికారులు, వ్యాపారులు తేమ ఇతర కారణాలను చూపుతూ తక్కువ ధరకు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాలుకు రూ.1250 నుంచి రూ.1350 మధ్య కోనుగోలు చేయాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ డౌన్ డౌన్, మొక్కజొన్నకు మద్దతు ధర చెల్లించాలి, ఆర్డీఓ వెంటనే రావాలి - రైతులకు న్యాయం చేయాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, టూటౌన్ సీఐ, ఎస్ఐలు రాంచందర్‌రావు, చిట్టిబాబు, ట్రాఫిక్ సీఐ సురేందర్‌రెడ్డి, మార్కెట్ కార్యదర్శి శ్రీనాథ్, సివిల్ సప్లై అధికారులు రైతులతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని నచ్చజెప్పారు. అనంతరం రైతులు, ట్రేడర్లతో చర్చలు జరిపారు. రైతులు కోరిన విధంగా మార్కెట్లో తాము మొక్కజొన్నలను ఖరీదు చేయబోమని స్పష్టం చేశారు. దీంతో రైతులు మళ్లీ మధ్యాహ్నం, సాయంత్రం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. వ్యాపారులు చేసేదిలేక కొనుగోళ్లను నిలిపివేసి వెళ్లారు. ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ఉన్నతాధికారులకు సమస్యను వివరించారు. అధికారుల సూచనతో కొనుగోళ్లను జరపకపోతే సంబంధిత ట్రేడర్ల లెసైన్సులను రద్దు చేస్తామని హెచ్చరించడంతో వ్యాపారులు మళ్లీ కొనుగోళ్లు జరిపారు. వ్యాపారిపై దాడికి యత్నం.. గుమాస్తాల నిర్బంధం వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తెచ్చిన మొక్కజొన్నలను కొనుగోలు చేస్తుండగా గుర్తుతెలియని కొందరు ఓ వ్యాపారిపై దాడి చేసేందుకు యత్నించా రు. యార్డులో ఉన్న మొక్కజొన్నలను పూర్తిగా కొనుగోలు చేయకుండా కొంత మంది రైతులవే కొనుగోలు చేస్తారా? అ న్నీ కొనాల్సిందేనని నిలదీశారు. ఈ క్ర మంలో కొందరు రైతులు గుమాస్తాలను నిర్బంధించారు. పోలీసులు, ఏఎంసీ చైర్మన్ జోక్యం చేసుకుని గుమాస్తాలను అక్కడి నుంచి పంపేశారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ జిల్లా అధికారులతోమాట్లాడి వారి అనుమతితో శుక్రవారం అధికారులు మొక్కజొన్నలను కొనుగోళ్లు చేస్తారని చెప్పడంతో వారు శాంతించారు. -
తగ్గుముఖంపట్టిన ఉల్లిధర
పరిగి, న్యూస్‌లైన్: రెండు నెలలకు పైగా వినియోగదారులకు కన్నీళ్లు పెట్టించిన ఉల్లి కాస్త శాంతించింది. ఉల్లిధరలు కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఉల్లి ధరలు కాస్తా దిగివచ్చాయి. గత వారం పరిగి మార్కెట్లో కిలో ఉల్లిధర రూ. 60 నుంచి 70 వరకు విక్రయించగా ఈ వారం ఆధరలు 40 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గాయి. శుక్రవారం పరిగి మార్కెట్లో తెల్లరకం ఉల్లిగడ్డ కిలో రూ. 40 నుంచి 50 వరకు విక్రయించగా, ఎర్రఉల్లిగడ్డలు కిలో రూ.30 చొప్పున విక్రయించారు. దీంతో వినియోగదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో టమాటా ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. గతవారం కిలో టమాటాలు రూ. 30కి విక్రయించగా ఈ వారం కిలో టమాటాలు రూ. 15నుంచి 20 వరకు విక్రయించారు. ఇదే సమయంలో మిర్చి ధరలు మాత్రం వినియోగదారులను ఆందోళనకు గురిచే స్తున్నాయి. గత వారం కిలో మిర్చి రూ. 50నుంచి రూ. 60కి విక్రయించగా ఈ వారం ఏకంగా ఆధరలు కిలో రూ.80కి పెరిగాయి. ప్రభుత్వం విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు అనుమతించటం, ప్రభుత్వమే డీసీఎంఎస్‌ల ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకోవటంతోనే ఉల్లి ధరల్లో తగ్గుదల నమోదైందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.