ఇంకెన్నాళ్లీ కష్టాలు ?
ఇంకెన్నాళ్లీ కష్టాలు ?
Published Mon, Oct 17 2016 1:45 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
మార్కెట్‌లో మారని పరిస్థితులు
దుమ్ము, దూళిలో వ్యాపారం
డేరాల కిందనే విక్రయాలు
రోడ్లపైనే యథేచ్ఛగా..
ట్రాఫిక్ జామ్‌తో సతమతం
ఆధునికీకరణ మరచిన అధికారులు
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్‌లోని ప్రధాన కూరగాయల మార్కెట్‌లో సమస్యలు పరిష్కారం కావడం లేదు. మార్కెట్ బయట రోడ్డుపై కూరగాయలు విక్రయించొద్దనే అధికారుల ఆదేశాలు అమలుకావడం లేదు. మార్కెట్‌లోపలే విక్రయించాలంటున్న అధికారులు సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా మళ్లీ వ్యాపారులు రోడ్డెక్కుతున్నారు. దుమ్ముదూళిలోనే కూరగాయలు విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యగా మారింది. మోడల్ మార్కెట్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం ఆ మాటలు మరిచిపోయినట్లు ఉంది. ఏడాదిన్నర క్రితం అధికారులు ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకున్నారు.
స్థలాలు చూపించినా..
గతేడాది మార్చిలో కూరగాయల మార్కెట్‌లోని ఆక్రమణలు తొలగించి రోడ్డుపైన విక్రయించే వారందరికీ లోపల స్థలాలు చూపించారు. అయితే ఇన్నాళ్లు రోడ్డుపై విక్రయించేందుకు అలవాటుపడ్డ వ్యాపారులు కొద్దీ రోజులకే మళ్లీ రోడ్డెక్కారు. రోడ్డుపై విక్రయాలు నిషేధిస్తూ..రోడ్డుపై వర్తకులకు రైతుబజార్‌లో చోటు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వ్యాపారులు ససేమిరా అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.
ఆధునికీకరణ ఎప్పుడో?
ప్రధాన కూరగాయల మార్కెట్‌లో నిలువ నీడలేకపోవడంతో వ్యాపారులు ఇబ్బం దులు పడుతున్నారు. మార్కెట్ లోపలిక ంటే బయటనే వ్యాపారం బాగుంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. యాబై ఏళ్ల క్రితం ఏర్పడిన మార్కెట్‌లో ఇన్నాళ్లు చిన్నపాటి వివాదాలున్నప్పటికీ ప్రస్తుతం అవి కూడా సమసిపోయాయి. దీంతో మార్కెట్ ఆధునికీకరిస్తామని చెప్పిన అధికారులు లోపల ఉన్న షెడ్లను కూల్చి చదును చేశారు. ఎండొస్తే ఎండుతూ, వానొస్తే తడుస్తూ వ్యాపారు లు డేరాల కింద కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్, పోలీసుశాఖ దృష్టి సారించి మార్కెట్ ఆధునికీకరణతో పాటు రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది.
ట్రాఫిక్ సమస్య
ప్రధాన మార్కెట్‌కు మూడు వైపులా ఉన్న రోడ్లపై ఇరువైపులా కూరగాయలు విక్రయిస్తున్నారు. మార్కెట్‌లోకి వెళ్లాలంటే రోడ్డుపై కదలడమే కష్టంగా మారింది. దీనికి తోడు ఆటోలు, ద్విచక్ర వాహనాలు మార్కెట్ రోడ్డుపైకి రావడంతో కాలినడక కష్టంగా మారింది. ప్రధాన మార్కెట్ ఏరియానే కాకుండా నగరంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. వారసంత, ఫారెస్ట్ ఆఫీసు ఎదుట, ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట, పాతబజార్, కార్ఖానగడ్డ, ముకరంపుర, ఆదర్శనగర్ ప్రాంతాల్లో రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు.
Advertisement
Advertisement