రైతు కష్టం వర్షార్పణం | Heavy rain smashes acres of crops | Sakshi
Sakshi News home page

రైతు కష్టం వర్షార్పణం

Published Fri, Oct 4 2013 12:47 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Heavy rain smashes  acres of crops

 చేగుంట, న్యూస్‌లైన్ :
 మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఆరుబయట ఆరబోసిన మొక్కజొన్న విత్తనాలు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పక్షం రోజులుగా మండలంలోని రుక్మాపూర్, అనంతసాగర్, ఉల్లితిమ్మాయిపల్లి, రెడ్డిపల్లి, వడియారం, చిన్నశివునూర్‌లకు చెందిన రైతులు పంటను బైపాస్‌రోడ్డుకు పక్కనే ఉన్న సర్వీస్‌రోడ్డుపై ఆరబోసారు. రోడ్డుపై పోస్తే తొందరగా ఆరుతాయని వాటిని నేరుగా వ్యాపారులకు అక్కడే అమ్ముకోవచ్చని రైతు భావించారు. అయితే బుధవారం కురిసిన అకాల వర్షం రైతులను ముంచింది. దీంతో రోడ్డుపై ఆరబోసిన మక్కలన్నీ వరద నీటిలో కొట్టుకు పోయినీటిలో కలిసిపోయాయి. రుక్మాపూర్ రైతు సిద్దిరాంలుకు చెందిన మక్కలన్నీ నీటిలో కొట్టుకు పోయాయి. దీంతో ఆయన వాటిని సేకరించే పనిలోపడ్డాడు. మరోవైపు 10 రోజుల క్రితం క్వింటాలుకు రూ. 1500 పలికిన మక్కల ధర ప్రస్తుతం తగ్గించారు. అంతే కాకుండా నాణ్యతాలోపం పేరున మక్కలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తిచూపడం లేదు. రూ. 1100 క్వింటాలు చొప్పున నాణ్యమైన మక్కలను మాత్రమే కొనుగోలు చేస్తామని వ్యాపారులు తెగేసి చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి చొరవ చూపి మక్కలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
 
 మక్కలు నేలపాలు
 కొల్చారం : మండలంలో బుధవారం అర్ధరాత్రి, గురువారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట విత్తు దశలోనే వర్షాలు విస్తారంగా పడడంతో సరిగా మొలకెత్తలేదని, ప్రస్తుతం భారీ వర్షానికి పంట మొత్తం తుడిచి పెట్టుకుపోయిందని రైతులు పేర్కొంటున్నారు. దీంతో పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 30 క్వింటాళ్లు వచ్చే మొక్కజొన్న పంట ప్రస్తుతం వర్షం తాకిడికి సగానికి సగం తగ్గిపోయిందంటూ రైతులు గోడును వెల్లబోసుకుంటున్నారు. గింజలను రోడ్లపై ఆరబోసిన సమయంలోనే వర్షాలు కురియడంతో అవికాస్త నేలపాలయ్యాయి. ప్రభుత్వం ఆదుకుని తమ పంటకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
 
 తుడిచిపెట్టుకుపోయిన మక్కలు
 సిద్దిపేట రూరల్ : అకాల వర్షానికి చేతికొచ్చిన మొక్కజొన్న పంట నీటిపాలైయింది. గురువారం ఉదయం మండలంలో కురిసిన వర్షానికి మొక్కజొన్నలు తడిసి ముద్దగా మారాయి. మూడు నెలలు కష్టం ఒక్క రోజులో బుగ్గిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పుల్లూరు బండపై మక్క క ంకులు, మక్కలు ఎండేశారు. అయితే వర్షానికి మక్కలు మొత్తం నానిపోయాయని, వీటిని వ్యాపారులు కొనుగోలు చేయని వాపోయారు. మక్కలు మొలకెత్తడం, బరువు తగ్గడం జరుగుతుంది. దీంతో కనీస మద్దతు ధర పలుకదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని లింగారెడ్డిపల్లి, నాంచారుపల్లి, బక్రిచె ప్యాల, రాఘావాపూర్, చింతమడక, నారాయణరావుపేట, తోర్నాల, వెంకటాపూర్, ఇర్కోడ్, తదితర గ్రామాలలో అధిక మొత్తంలో నష్టం జరిగిన ట్లు తెలిసింది.
 
 మొక్కజొన్న రైతుల రాస్తారోకో
 సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్ : మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట సిద్దిపేట - కరీంనగర్ రహదారిపై రైతులు రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, కొండపాక మండలాలతో పాటు కరీంనగర్ , వరంగల్ జిల్లాల సమీప గ్రామాల నుంచి సుమారు మూడు వేల క్వింటాళ్ల మొక్కజొన్నలు స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు వచ్చాయన్నారు. అయి తే మొక్కజొన్నల ధర పడిపోయిందంటూ ట్రేడర్లు వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 1310గా మద్దతు ధర ప్రకటించినా స్థానిక అధికారులు, వ్యాపారులు తేమ ఇతర కారణాలను చూపుతూ తక్కువ ధరకు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాలుకు రూ.1250 నుంచి రూ.1350 మధ్య కోనుగోలు చేయాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ డౌన్ డౌన్, మొక్కజొన్నకు మద్దతు ధర చెల్లించాలి, ఆర్డీఓ వెంటనే రావాలి - రైతులకు న్యాయం చేయాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
 
  సమాచారం అందుకున్న ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, టూటౌన్ సీఐ, ఎస్‌ఐలు రాంచందర్‌రావు, చిట్టిబాబు, ట్రాఫిక్ సీఐ సురేందర్‌రెడ్డి, మార్కెట్ కార్యదర్శి శ్రీనాథ్, సివిల్ సప్లై అధికారులు రైతులతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని నచ్చజెప్పారు. అనంతరం రైతులు, ట్రేడర్లతో  చర్చలు జరిపారు. రైతులు కోరిన విధంగా మార్కెట్‌లో తాము మొక్కజొన్నలను ఖరీదు చేయబోమని స్పష్టం చేశారు. దీంతో రైతులు మళ్లీ మధ్యాహ్నం, సాయంత్రం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. వ్యాపారులు చేసేదిలేక కొనుగోళ్లను నిలిపివేసి వెళ్లారు. ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ఉన్నతాధికారులకు సమస్యను వివరించారు. అధికారుల సూచనతో కొనుగోళ్లను జరపకపోతే సంబంధిత ట్రేడర్ల లెసైన్సులను రద్దు చేస్తామని హెచ్చరించడంతో వ్యాపారులు మళ్లీ కొనుగోళ్లు జరిపారు.
 
 వ్యాపారిపై దాడికి యత్నం..
 గుమాస్తాల నిర్బంధం
 వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తెచ్చిన మొక్కజొన్నలను కొనుగోలు చేస్తుండగా గుర్తుతెలియని కొందరు ఓ వ్యాపారిపై దాడి చేసేందుకు యత్నించా రు. యార్డులో ఉన్న మొక్కజొన్నలను పూర్తిగా కొనుగోలు చేయకుండా కొంత మంది రైతులవే కొనుగోలు చేస్తారా? అ న్నీ కొనాల్సిందేనని   నిలదీశారు. ఈ క్ర మంలో కొందరు రైతులు గుమాస్తాలను నిర్బంధించారు. పోలీసులు, ఏఎంసీ చైర్మన్ జోక్యం చేసుకుని గుమాస్తాలను అక్కడి నుంచి పంపేశారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ జిల్లా అధికారులతోమాట్లాడి వారి అనుమతితో శుక్రవారం  అధికారులు మొక్కజొన్నలను కొనుగోళ్లు చేస్తారని చెప్పడంతో వారు శాంతించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement