ఉల్లి దర కోయకుండానే కన్నీరు పెట్టిస్తోంది. పచ్చిమిర్చి రుచి చూడకుండానే ఘాటెక్కిస్తోంది. కాకర కొరకకుండానే చేదిక్కిస్తోంది.. ములక్కాడ కొండెక్కింది..టమోటా దడపుట్టిస్తోంది. ప్రస్తుతం కూరగాయల ధరల ధాటికి పేద, మధ్య తరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.అన్ని ప్రాంతాల్లోనూ ధరల దరవు మోగుతోంది.
కందుకూరు రూరల్: కందుకూరు మార్కెట్‌లో కూరగాయల ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. రోజురోజుకూ ధరలు పెరుడుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ప్రాంతానికి మైదుకూరు, కోడూరు, మద్రాసు, బెంగళూరు, మంగళగిరి తదితర చోట్ల నుంచి కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. నెల క్రితం ఏ కూరగాయల ధరలైన కిలో రూ.25లకు మించి ఉండేది కాదు. ఇప్పుడు ధరలు అమాంతం పెరిగిపోయాయి. రూ.15 నుంచి రూ.20ల వరకు ఉన్న ఉల్లి ధర రూ.35లకు పెరిగిపోయింది. రూ.20లు ఉన్న టమోట ఒకేసారి రూ.38లకు పెరిగింది. ఆయా పంటలు పండే ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతుండటంతో ధరలు కొండెక్కాయని వ్యాపారులు చెప్తున్నారు.
సంచి నిండటం లేదు
వేసవిలో పరిస్థితి వర్షాకాలంలో కనిపిస్తోందని వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఏ కూరగాయల ధరలు చూసినా రూ.30 నుంచి రూ.40లకు పైగా ఉండటంతో రోజు గడిచేదెలా..అని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. రూ.200 తీసుకెళ్తే చిన్న సంచి కూడా నిండం లేదని వాపోతున్నారు. టమోటా, పచ్చి మిర్చి ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అన్ని రకాల కూరగాయలు సంగతి ఇలా ఉంటే ములక్కాయ తానేం తక్కువ తినలేదన్నట్లు కాయ 10 నుంచి 15 పలుకుతోంది. కష్ట కాలంలో బంగాళాదుంప, దొసకాయలు ఆదుకుంటున్నాయని కొంతమేర ఊరట చెందుతున్నారు. ఇక ఆకు కూరలైతే కట్ట 5 నుంచి 10 వరకు చేరింది. ఇక బండ్లు, వీధిల్లోని దుకాణాల్లో ధరలైతే వారి చెప్పిందే ధరగా చలామణి అవుతోంది. ఇలాగే వర్షాలు కురుస్తుంటే మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెప్తున్నారు.
రైతు బజారు వ్యాపారులు చేతివాటం
రైతు బజారులోని వ్యాపారులు అధికారులు నిర్ణయించిన ధరలకే కూరగాయలు విక్రయించాల్సి ఉంది. కానీ ఇక్కడ వ్యాపారులు ఎదురుగా బోర్డుపై ధరలు పట్టిక వేసి ఉన్నా వినియోగదారుల కళ్లు కప్పి అధిక ధరలు విక్రయిస్తున్నారు. టమోటా 38 ఉంటే 40 నుంచి 45 వరకు విక్రయిస్తున్నారు. వినియోగదారుడిని బట్టి వ్యాపారి తన చేతి వాటం చూపిస్తున్నాడు. బోర్డుపై ప్రకటించిన ధరలకు మించి విక్రయించకూడదని చెప్పిన ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ధరలు మండిస్తున్నారు. అసలే ధరలు పెరిగి ప్రజలు ఆందోళన చెందుతుంటే రైతు బజారు వ్యాపారుల ధాటికి మరింత ధరలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment