బండెనక బండి.. పరిష్కారమేదండి..! | Vehicle Parking Problems In Vijayawada | Sakshi
Sakshi News home page

బండెనక బండి.. పరిష్కారమేదండి..!

Published Sat, Oct 19 2019 12:42 PM | Last Updated on Sat, Oct 19 2019 12:42 PM

Vehicle Parking Problems In Vijayawada - Sakshi

వన్‌టౌన్‌లోని తారాపేట ప్రాంతంలో రోడ్డుపైనే పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనాలు

బెజవాడలో వాహనాల పార్కింగ్‌ పెద్ద సమస్యగా పరిణమిస్తోంది.. ప్రధాన సెంటర్లలో పార్కింగ్‌ ఏర్పాట్లు లేకపోవడం.. షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో వాహనాలకు సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో వాహనదారులకు రోడ్లే పార్కింగ్‌ స్థలాలు అవుతున్నాయి. దీంతో ఇప్పటికే నగరవాసిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రాఫిక్‌ సమస్య మరింత జఠిలమవుతోంది. సమస్యను పరిష్కరించాల్సిన విజ యవాడ నగర పాలక సంస్థ మిన్నకుండిపోవడం.. ట్రాఫిక్‌ పోలీసులు అడపా దడపా వాహనదారులకు ఫైన్‌ విధించి చేతులు దులుపుకోవడం తప్ప.. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోకపోవడంతో సమస్య తీవ్రతరం అవుతోంది.

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో వాహనదారులకు పార్కింగ్‌ ఆందోళనకర సమస్యగా మారింది. సరైన పార్కింగ్‌ స్థలాలు లేకపోవడంతో బిజీగా ఉన్న రోడ్లకు ఇరువైపులా పార్కింగ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలోని మహాత్మాగాంధీ రోడ్, కార్ల్‌మార్క్స్‌ రోడ్, కాంగ్రెస్‌ ఆఫీస్‌ రోడ్, టికిల్‌ రోడ్‌ సహా ప్రధాన రహదారులు ప్రతిరోజూ రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా గవర్నర్‌పేట, బీసెంట్‌ రోడ్, నక్కల్‌ రోడ్, సూర్యారావుపేట, కస్తూరీబాయ్‌పేటతోపాటు ఇతర వాణిజ్య ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. రోడ్డుకు ఇరువైపులా అనధికార పార్కింగ్‌ వల్ల పాదాచారులు సైతం రహదారులపై నడవలేని పరిస్థితి నెలకొంది. 

నిత్య నరకం..
నగరం రాజధాని ప్రాంతంలో భాగమయ్యాక జనాభా భారీగా పెరిగింది. 2011లో పది లక్షలు ఉన్న జనాభా ప్రస్తుతం 17 లక్షలకు చేకుందని అంచనా. వాహనాల సంఖ్య సైతం రెట్టింపైంది. ప్రస్తుతం విజయవాడలో మొత్తం 6,87,088 వాహనాలు ఉన్నాయి. ట్రాన్స్‌పోర్టు వాహనాలు 90,837 కాగా.. నాన్‌ ట్రాన్స్‌పోర్టు 5,96,251 ఉన్నాయి. అయితే రహదారులు మాత్రం ఇరుకిరుకుగానే ఉన్నాయి. ప్రధాన రహదారుల్లో ఉన్న వాణిజ్య భవనాల్లో 90 శాతం వాటికి పార్కింగ్‌ సౌకర్యాలు లేవు.  

రోడ్లే దిక్కు..
నగరంలోని అత్యధిక శాతం షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లో పార్కింగ్‌ సదుపాయాలు లేవు. దీంతో షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు వెళ్లే వాహనదారులు రహదారులపైనే తమ వాహనాలు పార్కు చేసి వెళ్తున్నారు. చాలా వరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు సెల్లార్లను స్టాక్‌యార్డులుగా వినియోగిస్తున్నారు. కొన్ని చోట్ల వాహనాలను రహదారులపైనే పార్కింగ్‌ చేయాలని కోరుతుండటం గమనార్హం. మరికొన్ని చోట్ల పార్కింగ్‌ ఫీజులు అధిక మొత్తంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ల యాజమాన్యాలు వసూలు చేస్తుండటంతో వాహనదారులు రోడ్లపైనే తమ వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో నగరపాలక సంస్థ అధికారులు 18 సముదాయాల్లో పార్కింగ్‌ ప్రదేశాల్లో నిర్మించిన కట్టడాలను తొలగించారు. 59 వాణిజ్య భవనాలకు నోటీసులు జారీ చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. 

అటకెక్కిన ప్రతిపాదనలు..
నగరంలో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు చిత్తూరి కాంప్లెక్స్, కాళేశ్వరరావు మార్కెట్, ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ల్లో స్మార్ట్‌ పార్కింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డుల్లోనూ అలాంటి పార్కింగ్‌ కేంద్రాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి తరువాత దానిని విస్మరించింది. అలాగే నగరంలో బహుళ అంతస్తుల పార్కింగ్‌ సముదాయాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను అధికారులు అటకెక్కించడంతో అవి కలగానే మిగిలిపోయాయి. కృష్ణా జిల్లా రహదారి భద్రతా సలహా కమిటీ నగరంలో పార్కింగ్‌ సమస్యపై దృష్టి సారించింది. నగరంలో వాణిజ్య ప్రాంతాల్లో పార్కింగ్‌ సముదాయాలను నిర్మించాలని వీఎంసీ అధికారులకు సూచించింది. ఇదీ ప్రతిపాదనగానే మిగిలిపోయింది.

కేసులు నమోదు చేసినా..
వీధుల్లో అనధికార పార్కింగ్‌పై చర్యలు తీసుకోవడంలో ట్రాఫిక్‌ పోలీసులు విఫలమయ్యారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అనధికారికంగా పార్కింగ్‌ చేసిన వాహనదారులపై 16వేల కేసులు నమోదు చేశారు. అయినా నేటికీ ప్రధాన రహదారులు, జంక్షన్లలో వాహనాల పార్కింగ్‌ కొనసాగుతూనే ఉంది.  

ప్రతిపాదనలు సిద్ధం చేశాం..
బహుళ అంతస్తుల పార్కింగ్‌ సముదాయాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాం. నగరంలో ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకొని బీసెంట్‌ రోడ్డు, వన్‌టౌన్‌ ప్రాంతాల్లో నిర్మించాలని నిర్ణయించాం. అయితే వన్‌టౌన్‌ ప్రాంతంలో వీఎంసీకి చెందిన స్థలం లేదు. ప్రైవేటు భూమి సేకరించాల్సి ఉంది. బీసెంట్‌ రోడ్డులో నిర్మించే భవనానికి దాదాపు రూ. 5 కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాం. ప్రభుత్వ ఆమోదించి ప్రత్యేక నిధులు విడుదల చేస్తే వాటి నిర్మాణాలు మొదలు పెడతాం. 
– ప్రసన్న వెంకటేష్, కమిషనర్, వీఎంసీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement