
కోడిపందాలు నిర్వహిస్తూ వీక్షిస్తున్న వెలగపూడి(ఫైల్)
మూడు దశాబ్దాల కిందట విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి రంగా హత్యకేసులో మూడో నిందితుడు. బెజవాడలో ఉంటే తనకేమవుతుందోనన్న భయంతో విశాఖలో తలదాచుకోవడానికొచ్చారు. కొన్నాళ్లపాటు అజ్ఞాతంలో గడిపారు. ఆ తర్వాత బతుకుదెరువు కోసం అన్నట్టు ఏదో వ్యాపకమో, వ్యాపారమో చేసుకుంటూ కాలక్షేపం చేశారు.
సినీ నటుడు బాలకృష్ణ అభిమానిగా ముద్ర వేయించుకుని విశాఖలో ఏవేవో కార్యక్రమాలు, కార్యకలాపాలు సాగించి ఆయనకు దగ్గరయ్యారు. కొన్నాళ్లకు కాలం కలిసొచ్చి బాలయ్య సహకారంతో 2009లో విశాఖ తూర్పు నియోజకవర్గానికి తెలుగుదేశం టికెట్టు సంపాదించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో మరోసారి గెలిచారు. ఎమ్మెల్యే కాకముందూ, అయ్యాక కూడా తన నేర స్వభావాన్ని మార్చుకోలేదు. పైగా మరింతగా దూకుడు పెంచారు. హత్యాయత్నం కేసుతో పాటు పలు క్రిమినల్ కేసులూ ఆయనపై నమోదై ఉన్నాయి.
సాక్షి టాస్క్‌ఫోర్స్ :2014లో రెండో సారి ఎమ్మెల్యే అయ్యాక ఇంకా హద్దులు దాటారు. అధికారంలో ఉన్నామన్న అహంతో అనుచిత ప్రవర్తనలు పెంచారు. తన ఇలాకాలో చెప్పినట్టు నడుచుకునే అధికారులను నియమించుకుని ఇష్టారాజ్యంగా నియోజకవర్గాన్ని ఏలుతున్నారు.కోడిపందాలు, భూకబ్జాలు, ప్రత్యర్థులపై దౌర్జన్యాలు.. మద్యం వ్యాపారంలో ఆరితేరి సిండికేట్ సామ్రాజ్యానికి అధిపతిగా, బోగస్ ఓటర్లను చేర్పించడంలో దిట్టగా ఇలా బహు రూపాల్లో విశాఖలో నిర్భీతిగా చక్రం తిప్పుతున్న ఆ ఎమ్మెల్యేనే.. వెలగపూడి రామకృష్ణ బాబు. ఆయన అవినీతి, ఆగడాలు, అక్రమాలు, అరాచకాల చిట్టా చూద్దాం రండి.
కోడిపందాల జోరు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోడి పందాల సంస్కృతి ఎన్నడూ లేదు. ఎక్కడైనా ఒకటి రెండుచోట్ల పందాలు నడిచినా బరులు గీసి రూ.కోట్లలో పందాలు ఆడేంతటి పరిస్థితి మాత్రం కనిపించేది కాదు. కానీ వెలగపూడి రామకృష్ణబాబు ఎమ్మెల్యే అయ్యాక తన ఇలాకాలో విచ్చలవిడిగా కోడిపందాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మూడేళ్లుగా ఆరిలోవ దరి ముడసర్లోవ ప్రాంతంలో (రామకృష్ణాపురం వెనుక) సుమారు పది ఎకరాల జీవీఎంసీ ఖాళీ స్థలంలో వీటిని నిర్వహిస్తున్నారు. గతేడాది స్వయంగా ఆయనే పందాలను ప్రారంభించారు. పందెంరాయుళ్లు రూ.కోట్లలో పందాలు కాశారు. వాటితో పాటు పేకాట, మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయి. ఎమ్మెల్యే వెలగపూడి ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు దగ్గరుండి మరీ బరి కోసం నిర్దేశించిన స్థలాన్ని చదును చేయగా.. నీటి సరఫరా విభాగం అధికారులు ప్రతి రోజు నీళ్లు చల్లారు. ఓ వైపు హైకోర్టు ఆదేశాలిస్తున్నా.. వెలగపూడి బరులు సిద్ధం చేసి మరీ పందాలు నిర్వహించారు.
అండగా ఉంటూఆక్రమణలకు ఊతం
భీమునిపట్నం మండలం కాపులుప్పాడ పంచాయతీ పరిధిలోని సోమన్నపాలెంలో రైతులు మరుపిళ్ల అప్పలనాయుడు, సూరిబాబు, అప్పలస్వామి, పోతిన పాపాయమ్మ, మరుపిళ్ల రాంబాబు, మరుపిళ్ల అప్పల నరసయ్య, మరుపిళ్ల నరసయ్య, నరసాయమ్మ, మరుపిళ్ల తాతయ్యలకు 5.90 ఎకరాల భూమి ఉంది. పూర్వీకుల నుంచి పిత్రార్జితంగా వచ్చిన భూమి 624/1981గా సర్వే నంబర్ 268/3లో 1.36 సెంట్లు, 269/2లో 1.90 సెంట్లు, 269/10లో 1.96 సెంట్లు, 269/11లో 0.36 సెంట్లు, 269/13లో 0.02 సెంట్లు మొత్తం 5.90 సెంట్లుగా నమోదై ఉంది. 20 ఏళ్ల కిందట విశ్వ సౌజన్య రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న నిమ్మలకూడి వీర వెంకట(ఎన్‌వీవీ) సత్యనారాయణ ఆ రైతుల భూమి తీసుకుని లే అవుట్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నమ్మిన రైతులు 73 సెంట్ల భూమి తమ వద్ద ఉంచుకుని.. 1996లో కొంత భూమి, 1998లో మరికొంత భూమి మొత్తంగా 5.17 సెంట్ల భూమిని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ)గా అతనికి రాసిచ్చి బతుకుదెరువు కోసం విజయవాడ పాతబస్తీకి వలస వెళ్లిపోయారు. కానీ ఆ రియల్టర్ మాత్రం ఆ భూమి ఇక్కడ అభివృద్ధి చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. 2010లో విజయవాడ నుంచి తిరిగి సోమన్నపాలెం వచ్చేసిన ఆ రైతు కుటుంబాల సభ్యులు ఎన్‌వీవీ సత్యనారాయణను కలిశారు. ఆ భూమి తీసుకుని మాకేమీ ఇవ్వలేదు.. అలాగని ఆ భూమి కూడా అభివృద్ధి చేయలేదు.. అని ప్రశ్నిస్తే.. అసలు మీరెవరని ఎదురు తిరిగాడు. ఆ భూమే తనదేనని, కొనుగోలు చేసుకున్నట్టు పత్రాలు కూడా ఉన్నాయని, మీరేం చేసుకుంటారో చేసుకోండని ఎన్‌వీవీ అడ్డం తిరిగాడు. ఎమ్మెల్యే వెలగపూడి అండతోనే ఎన్‌వీవీ ఎదురు తిరిగాడనే ఆరోపణలు ఉన్నాయి.
వెలగపూడి సిత్రాలివీ..
⇔ ఎమ్మెల్యే పేరు చెప్పి ఆయన అనుచరులు దందాలు చేస్తారు. రుబాబు చేసి దౌర్జన్యాలకు పాల్పడతారు.
⇔ కోర్టుల్లో ఉన్న కేసులను సైతం బయట సెటిల్మెంట్లు చేస్తామని, ఆ కేసులను వదిలేయాలని కాళ్ల శంకర్ వంటి ఎమ్మెల్యే అనుచరులు న్యాయవాదులను బెదిరింపులకు దిగుతారు.
⇔ వెలగపూడి యువసేన అధ్యక్షుడు కంచర్ల సందీప్ పలు నేరాల్లో జైలుకెళ్లాడు. ఓ హత్య కేసులోనూ జైలుకెళ్లాడు. కొన్నాళ్లకు ఆ కేసు కొట్టేశారు.
⇔ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మద్యం షాపులతో పాటు బెల్టు షాపులను విచ్చలవిడిగా నడుపుతున్నారు.
⇔ ఆరిలోవ 1, 2 సెక్టార్లు, జాలరిపేట, విశాలాక్షినగర్, అడవివరం రోడ్డు, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ, జోడుగుళ్లపాలెం ప్రాంతాల్లో బెల్టు షాపులు ఉన్నాయి.
⇔ ఎమ్మెల్యే ఏరికోరి తెచ్చుకున్న ఎక్సైజ్ అధికారులే ఇక్కడ విధులు నిర్వహిస్తుండడంతో వారెవరూ అటువైపు కన్నెత్తయినా చూడరు.
⇔ ఈ బాబు నేతృత్వంలో శ్రీనగర్, హార్బర్ అప్రోచ్‌రోడ్డు, ఆరిలోవ, టీఐసీ పాయింట్, ఎంవీపీ కాలనీ, దండుబజార్, రైల్వే న్యూకాలనీ, చినగదిలి బీఆర్‌టీఎస్, ఏవీఎన్ కాలేజీ డౌన్, జగదాంబ జంక్షన్ తదితర ప్రాంతాల్లో నడుస్తున్న మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు వేళాపాళలు ఉండవు. అర్ధరాత్రి దాటినా మూతపడవు.
నేరాలచిట్టా ఇదీ..
⇔ విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు బెజవాడలో రంగా అనుచరులకు భయపడి ప్రాణం అరచేతిలో పెట్టుకొని విశాఖపట్నం వచ్చారు. వైజాగ్‌కు వచ్చి టెలెక్స్ పేపర్స్ తయారు చేసే కంపెనీలో సిగ్నల్ లైట్స్ సత్యనారాయణ దగ్గర సెక్టార్–6లోని బిల్డింగ్‌లో వెలగపూడి తన అనుచరులతో కలిసి తలదాచుకున్నారు.
⇔ జనప్రియ సిండికేట్ వాళ్లను టెండర్లు వెయ్యొద్దంటూ బెదిరించి రౌడీలతో దౌర్జన్యం చేయించారు. ఈ వ్యవహారంలో త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై రౌడీషీట్ తెరిచారు. కానీ అప్పటి ఏసీపీ రంగారావు సాయంతో ఆ రౌడీషీట్‌ను ఎత్తివేయించుకున్నారు.
⇔ సెక్టార్– 2లో రజకులను ఖాళీ చేయించి హయగ్రీవ బిల్డర్స్ దగ్గర కోట్ల రూపాయలను వెలగపూడి, ఆయన ముఖ్య అనుచరుడు పట్టాభి తీసుకున్నారు. బిల్డర్స్‌కు అనుకూలంగా లేఖ ఇస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులను కొట్టించారు. రెండోసారి హయగ్రీవ బిల్డర్స్‌ను ఒక ఫ్లోర్ మొత్తం కావాలని బ్లాక్‌మెయిల్ చేసి ఇవ్వకపోయే సరికి లేఖ వెనక్కి తీసుకొని వారిపై ఫిర్యాదు చేశారు.
⇔ రుషికొండ సర్వే నం.21/ఏ,బీల్లో 650 గజాల గెడ్డ పోరంబోకు ఆక్రమించారు. రోడ్డులో స్థలం పోయిందని వుడా దగ్గర రుషికొండ లేఅవుట్‌లో 2 స్థలాలను అప్పనంగా తీసుకున్నారు.
⇔ వెలగపూడి యువసేన పేరుతో ఆరిలోవ ప్రాంతంలో సందీప్ అనే అనుచరుడు దందాలు చేస్తూ ఒకరిని హత్య చేశాడు.
⇔ విశాఖ విమానాశ్రయంలో సిబ్బందిపై దాడి, దౌర్జన్యం కేసులోనూ వెలగపూడి నిందితుడిగా ఉన్నారు.
⇔ విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐపై దాడి చేసి గాయపరిచారు.
⇔ బిల్లులు లేకుండా కంపెనీల నుంచి దొంగతనంగా మద్యం తరలించి ప్రభుత్వానికి పన్ను ఎగవేత, అక్రమ మద్యం కేసులో ఏసీబీ నిందితుల జాబితాలోనూ వెలగపూడి ఉన్నారు.
⇔ ప్రభుత్వోద్యోగిని విధులకు ఆటంకం కలిగించిన కేసులున్నాయి.
⇔ అల్లర్లకు పాల్పడడం, మారణాయుధాలతో హత్యాయత్నం కేసు ఈయనపై నమోదై ఉంది.
⇔ ఉద్దేశపూర్వకంగా వ్యక్తిపై దాడి చేయడంపై కేసు నమోదైంది.
వెలగపూడిపై నమోదైన కేసులు..
1 : ఐపీసీ సెక్షన్లు 147, 148, 149, 332: క్రైం నంబర్ 348/2010 ఫస్ట్ ఏసీఎంఎం
2 : ఐపీసీ సెక్షన్లు 147, 148, 149, 353@ క్రైం నంబర్ 349/2010 4వ ఏడీజే కోర్టు
3 : ఐపీసీ సెక్షన్లు 147, 148, 149, 332@ క్రైం నంబర్ 350/2010 ఫస్ట్ ఏసీఎంఎం
4 : ఐపీసీ సెక్షన్లు 332, 34, క్రైం నంబర్ 351/2010, ఫస్ట్ ఏసీఎంఎం
5 : ఇండియన్ రైల్వే యాక్ట్ క్రైం నంబర్ సీ3సీ/3(01)/2010, రైల్వే కోర్టు
6 : ఇండియన్ రైల్వే యాక్ట్ క్రైం నంబర్ సీ4/48(12)/2009, రైల్వే కోర్టు
నేరస్తులకు అండ
విశాఖలో రౌడీషీటర్లు, నేరస్తులంతా కట్టకట్టుకుని ఎక్కడుంటారు? అని అడిగితే ఈ టీడీపీ ఎమ్మెల్యే పేరే చెబుతారు. ఎమ్మెల్యే అయ్యాక ‘పరిధి’పెంచి రౌడీషీటర్లకు సహకారం అందిస్తూ వస్తున్నారు. నగరంలో ఎక్కడ గలాటా జరిగినా నిందితులకు ఈయన ఇల్లు, కార్యాలయాలు అడ్డాగా మారిపోతాయన్న పేరుంది. గతంలో ఈయన ఓ సంచలన హత్య కేసులో నిందితుడు అయినప్పటికీ కోర్టు కొట్టివేసింది. ఆర్థిక వివాదాలు, భూ కబ్జా కేసులు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. కానీ హత్య కేసుల్లోని నిందితులకు, వివాదాస్పద వ్యక్తులకు ఈ ఎమ్మెల్యే ఆశ్రయం కల్పిస్తున్నాడన్న వాదనలు బలంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment