
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆహ్వానపత్రాన్ని అందిస్తున్న మంత్రి వెలంపల్లి. చిత్రంలో ఎమ్మెల్యే విష్ణు తదితరులు
సాక్షి, అమరావతి: వచ్చే నెల 5న విజయవాడ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దసరా పండుగ నేపథ్యంలో ఈనెల 29 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దుర్గ గుడిలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూలా నక్షత్రం రోజున 5వ తేదీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసంలో కలిశారు. కనకదుర్గమ్మ అమ్మవారి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆలయ ఈవో సురేష్‌బాబు సీఎంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.