
సాక్షి, విజయవాడ : అమ్మఒడి పథకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానసపుత్రిక అని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో గురువారం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన 7 నెలల కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. నాడు నేడు కార్యక్రమంతో అన్ని పాఠశాలలను అన్ని వసతులతో ఏడాది కాలంలో ఆధునీకరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని, నమోదు చేసుకున్న వారందరికీ పథకాన్ని వర్తించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదువుతో ఉన్నత స్థానాలకు చేరుకుని మంచి జీవితాన్ని జీవించవచ్చని అన్నారు. ఉగాది నాటికి అందరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని, అమ్మఒడి కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు అమరావతి తప్ప ప్రజల సంక్షేమం పట్టదని మంత్రి విమర్శించారు. (జిల్లాలో ‘అమ్మ ఒడి’ ప్రారంభించిన మంత్రి)
అమ్మఒడి పథకం అనేది జగనన్న నవరత్నాల్లో మొదటి రత్నమని మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల వరకు 15 వేల రూపాయలు వారి ఖాతాల్లో వేయడం జరుగుతుందని తెలిపారు. అర్భన్‌లో లక్ష 60 వేల మంది లబ్ది దారులున్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 95 కోట్ల నిధులు వారి ఖాతాల్లో వేయడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచంలో ఈ తరహాలో ఇదే మొదటి కార్యక్రమని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 3 లక్షల 45 వేల మంది లబ్ధిదారులను గుర్తించామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకం సహా ఆరోగ్యశ్రీ వంటి మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారని ప్రశంసించారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, ఈ పధకాలను ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని కోరుతున్నామన్నారు.