
కూతుర్ని కాపాడుకునేందుకు...
వేల్పూరు హత్య కేసులో ప్రియురాలే నిందితురాలు
వినుకొండ టౌన్: వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితురాలిని మంగళవారం కోర్టుకు హాజరుపర్చారు. వినుకొండ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు.. శావల్యాపురం మండలం వేల్పూరుకు చెందిన మొగిలి హనుమంతరావు, ఈపూరు మండలంలోని అంగలూరుకు చెందిన బొడ్డు రమణ నాలుగేళ్లుగా వినుకొండలో సహజీవనం చేస్తున్నారు.
ఇరువురికీ అంతకుముందు వేర్వేరు వ్యక్తులతో వివాహమై, సంతానం కలిగి ఉన్నారు. ఇటీవల హనుమంతరావు రమణ పెద్ద కుమార్తెపై కన్నేసి తన కోరిక తీర్చమని వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గత నెల 23న రమణ తన కుమార్తెను రక్షించుకునే నిమిత్తం చెల్లెలు ఇంటికి పంపించింది. అయితే చిత్తుగా తాగి వచ్చిన హనుమంతరావు ఊరికి ఎందుకు పం పించావు అని రమణతో గొడవకు దిగడంతో పాటు నిన్ను చంపి, నీ కూతురితో కోరిక తీర్చుకుంటానని బెదిరించడంతో ఎలాగైనా హనుమంతరావు పీడ వదిలించుకోవాలని రమణ తిరగబడింది.
తోపులాటతో కిందపడిన హనుమంతరావును చీరతో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి సమీపంలోని ఖాళీ జాగాలో శవాన్ని పాత దుస్తులు, రాళ్లు వేసి మాయం చేయడానికి ప్రయత్నించింది. అయితే దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పరిశీలించి శవం ఆచూకీని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు రమణ కోసం గాలిస్తుండగా తిమ్మాయిపాలెం వీఆర్వో సునీత ద్వారా పోలీసులకు లొంగిపోయింది. పోలీసులు రమణను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. సమావేశంలో ఎస్‌ఐలు లక్ష్మీ నారాయణ రెడ్డి, నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
పాపం...వీరికి దిక్కేది..?
వినుకొండ టౌన్: విచ్చలవిడితనానికి అలవాటుపడ్డ తల్లి ప్రవర్తనతో చిన్నారులు రోడ్డున పడ్డారు. ఈపూరు మండలం అంగలూరుకు చెందిన బొడ్డు రమణ వ్యవసాయపనులకు కూలీలను మాట్లాడే మేస్త్రీగా పనిచేస్తుండేది. ఈ నేపథ్యంలో కూలీలను తరలించడానికి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న హనుమంతరావుకు రమణకు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది అక్రమ సంబంధానికి దారితీయడంతో రమణ భర్త సుబ్బారావు భార్యను ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు.
భర్త మాటలు పెడచెవిన పెట్టిన రమణ గత నాలుగేళ్లుగా తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని హనుమంతరావుతో వినుకొండలో సహజీవనం చేస్తోంది. యుక్తవయసుకు వచ్చిన రమణ పెద్ద కుమార్తెపై హనుమంతరావు కన్ను పడింది. అది సహించలేని రమణ అతడిని మట్టుబెట్టి జైలుపాలయింది. పోలీసులు తల్లిని అరెస్టు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు పాపం... ఆ చిన్నారులిద్దరూ దిక్కూమొక్కూ లేని వారయ్యారు. రమణ భర్త నుంచి విడిపోవడం, రమణ పుట్టింటివారు చాలాకాలం క్రితమే మరణించడంతో ఈ పిల్లలు ఎవరిని ఆశ్రయించాలో తెలియక పోలీసుస్టేషన్ పంచలోనే దీనంగా రోదిస్తూ ఉండడం చూసిన వారి కడుపు తరుక్కుపోతోంది.