చంద్రగిరి, న్యూస్‌లైన్: శ్రీనివాస మంగాపురంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అశేష భక్తజన సందోహం మధ్య కల్యాణ వెంకటేశ్వరస్వామి సతీసమేతంగా విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అంతకు ముందు తెల్లవారు జామున స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి ధూపదీప నిత్య కైంకర్య, పూజాకార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వాహన మండపంలో కొలువుంచి స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. గరుడ వాహన సేవను పురస్కరించుకుని ప్రత్యేకంగా తయారు చేసిన పుష్ప హారాలు, పచ్చల హారాలు, తిరుమల నుంచి వచ్చిన లక్ష్మీహారాన్ని తొడిగారు. అనంతరం కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవేరులతో కలిసి గరుడవాహన మెక్కి వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణల నడుమ ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
వాహనం ముందు ఏర్పాటు చేసిన భజన బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చెన్నైకి చెందిన భక్తుడు సుబ్రమణ్యం రూ.12 లక్షల విలువ చేసే గరుడవాహనాన్ని కానుకగా ఇచ్చారు. గరుడ వాహన సేవకు ముందు ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, జేఈవో పోలా భాస్కర్, డెప్యూటీ ఈవో శ్రీధర్, సూపరింటెండెంట్ ధనంజయ ఉత్సవంలో పాల్గొన్నారు.
గరుడునిపై గోవిందుని వైభవం
Published Mon, Feb 24 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM
Advertisement