
బిల్లు ఆపుతామని వెంకయ్య అనలేదు
యెన్నం వ్యాఖ్యలను ఆరోపణలుగా చూడొద్దు
నష్టనివారణ చర్యలు చేపట్టిన బీజేపీ
జైరాంతో ఒంటరిగా చర్చించాల్సిందికాదు: పేరాల
హస్తినకు కిషన్‌రెడ్డి, రామచంద్రరావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి తమ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడుపై చేసిన వ్యాఖ్యలతో పార్టీ నాయకత్వం కంగుతింది. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పరిస్థితిని అంచనా వేసి నివేదికను పంపాల్సిందిగా జాతీయ కార్యవర్గసభ్యుడు పేరాల చంద్రశేఖరరావును ఆదేశించింది. అంతేకాక రాష్ట్ర పరిస్థితిని తెలుసుకునేందుకు మరో జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్.రామచంద్రరావును హస్తినకు పిలిపించింది. దీంతో ఢిల్లీ వెళ్లిన రామచంద్రరావు అక్కడ అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లతో భేటీ అయ్యారు. కాగా, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీ వెళుతున్నారు.
రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా పార్టీ నేతలకు చర్చలో సహకరించేవిధంగా 16 అంశాలతో నివేదికను కిషన్‌రెడ్డి తన వెంట తీసుకెళ్తున్నారు. ఇదిలాఉండగా, హైకమాండ్ ఆదేశంతో సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన పేరాల చంద్రశేఖరరావు అందుబాటులో ఉన్న నేతలతో ముచ్చటించారు. ఇది ‘టీ’ కప్పులో తుపాను లాంటిదని విలేకరులకు చెప్పి విషయం దాటవేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలను ఆరోపణలుగా చూడవద్దన్నారు. వెంకయ్యనాయుడు ఒంటరిగా కేంద్రమంత్రి జైరాం రమేశ్‌తో భేటీ కావడం అనేక అనుమానాలకు, అపార్థాలకు తావిచ్చిందన్నారు. వెంకయ్య ఒక బృందంతో వెళ్లి ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదన్నారు. ముఖ్యాంశాలు...
వెంకయ్యనాయుడు ఎన్నడూ తెలంగాణ బిల్లును ఆపుతామని చెప్పలేదు.
టీడీపీ, లోక్‌సత్తాలతో పొత్తు ఉండదన్నారు. లేనిపోనివి ప్రసారం చేసి, పత్రికల్లో రాసి తమను ఇబ్బందులు పెట్టవద్దు.
రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతోనే రెండు ఉద్యమకమిటీలు వేశాం.
తెలంగాణలో మా సహకారం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాకూడదన్నదే మా ఆరాటం.
యెన్నంతో పాటు వెంకయ్యను కూడా కిషన్‌రెడ్డి వివరణ కోరతారని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.
హుందాగా వ్యవహరించండి!
ఇదిలాఉండగా, యెన్నం శ్రీనివాసరెడ్డిపై పరుషపదజాలంతో విమర్శలు గుప్పించిన బీజేపీ సీమాంధ్ర నేతల్ని వెంకయ్యనాయుడు మందలించినట్టు తెలిసింది. యువకుడయిన శ్రీనివాసరెడ్డి ఏదో ఆవేశంలో మాట్లాడితే సీనియర్లు అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరమేమొచ్చిందని ఢిల్లీలో తనను కలిసిన సీమాంధ్రనేతలతో అన్నట్టు సమాచారం.
బీజేపీని బలిపశువును చేసే యత్నం: విద్యాసాగర్‌రావు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు విషయంలో బీజేపీని బలిపశువును చేయడానికి కాంగ్రెస్ విఫలయత్నం చేస్తోందని బీజేపీ నేత విద్యాసాగర్‌రావు అన్నారు. పార్లమెంటులో సత్వరమే తెలంగాణ బిల్లు పెట్టాలని, బీజేపీ బేషరతుగా మద్దతు ఇస్తుందని చెప్పారు. ఢిల్లీలో సోమవారం ఆయన వెధిరె శ్రీరాంతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించి బిల్లులో చేయాల్సిన సవరణలను రాజ్యసభలో విపక్ష నేత అరుణ్‌జైట్లీకి అందజేశామని చెప్పారు.
సీఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలపై చర్యలేవీ?
తెలంగాణపై కాంగ్రెస్‌కు బీజేపీ సూటి ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయానికి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం కిరణ్‌పై, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలేదో కాంగ్రెస్ వివరణ ఇవ్వాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. పార్టీ విధానాన్ని వ్యతిరేకించే వారిని పార్టీనుంచి ఎందుకు బహిష్కరించడంలేదని ప్రశ్నించింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ సోమవారం ఢిల్లీలో పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. ‘సీఎం కిరణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీలు సభలకు అంతరాయం కలిగిస్తున్నారు.
అవిశ్వాస తీర్మానానికి వారి ఎంపీలే నోటీసులిస్తున్నారు. అయినా, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు’ అని జవదేకర్ విమర్శించారు. సీఎం కిరణ్ నిర్వహించే కేబినెట్ మీటింగ్‌కు హాజరు కావాలంటూ దిగ్విజయ్ సింగ్ తెలంగాణ మంత్రులకు చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. బీజేపీ నేత వెంకయ్యనాయుడుపై సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన విమర్శల గురించి అడిగిన ప్రశ్నలకు జవదేకర్ సమాధానం దాటవేశారు. తెలంగాణ బిల్లుపై బీజేపీ వైఖరి గురించి అడగ్గా, ‘పతివ్రతకు రోజూ చెప్పాల్సిన అవసరం లేదు. తన భర్తతో కలిసి ఉన్నట్టు...’ అంటూ బదులిచ్చారు. తెలంగాణపై పార్టీ వైఖరిని ఇప్పటికే వెల్లడించామన్నారు.