ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: ‘తెలుగు రాష్ట్రాల ప్రజలకు నేను ఎప్పుడూ సేవకుడినే, ఏ స్థాయిలో ఉన్నా వారి కోసం సహకరిస్తాను’ అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తిచేసుకున్న వెంకయ్యనాయుడుకు నెల్లూరు రూరల్ ప్రాంతంలోని వీపీఆర్ కన్వెన్షన్‌లో ఆదివారం పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తాను ఈ పదవి చేపట్టినప్పుటి నుంచి జనంతో మమేకం కావడం తగ్గిందన్నారు.
ఉపరాష్ట్రపతి పదవికి కొత్త నిర్వచనం తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు. భారతీయ జీవన విధానమైన వసుధైక కుటుంబంలో అందరూ శాంతియుతంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజాసామ్యంలో సామాజిక, వ్యక్తిగత, సంస్థాగత, మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆలోచనా ధోరణిలో ప్రధానంగా మార్పురావాలన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. విదేశీ పర్యటనల సమయంలో మన దేశాన్ని ఇతరులు ఎంతగానో గౌరవిస్తూ వస్తున్నారని, అందుకు కారణం మన ప్రజాస్వామ్య వ్యవస్థే అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంట్ సభల్లో జరిగిన విషయం తెల్సిందేనన్నా రు. అయితే 370 ఆర్టికల్ రద్దు సమయంలో అలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిందన్నారు.
బిల్లును రెండింతలు మెజార్టీతో రాజ్యసభ ఆమోదించినట్లు గుర్తు చేశారు. జిల్లా అభివృద్ధికి తానెప్పుడూ కృషి చేస్తూనే ఉంటానని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, బల్లి దుర్గాప్రసాద్‌రావు, రాష్ట్ర మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్‌రావు, నెల్లూరు రూరల్ కార్యాలయ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన భాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్, జెడ్పీ మాజీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment