ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
విజయవాడ: ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలోని 65 శాతం భూభాగంలో బీజేపీ జెండా ఎగురుతోందని వెల్లడించారు. బీజేపీ సిద్ధాంతాలే దేశానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ఏ మత విశ్వాసాలు అనుసరించినా దేశానికి మాత్రం పంగనామం పెట్టొదనేదే బీజేపీ సిద్ధాంతమని చెప్పుకొచ్చారు.
తమ పార్టీలో అన్ని వర్గాలకు సమాన ప్రాతినిథ్యం కల్పిస్తున్నామని చెప్పారు. బీజేపీలోనే దళిత, మహిళా ఎంపీలు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ప్రగతి రథం పేరుతో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో ప్రతి మూలకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు చేరిందన్నారు. అన్ని రంగాల్లో మార్పులు తెచ్చేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అన్నివిధాలా సాయం చేస్తుందన్నారు.