
సాక్షి, తిరుపతి : భారతీయ విద్యాభవన్ 29వ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ... నేటి విద్యార్థులు రేపటి తరానికి భవిష్యత్తని అన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసే భారతీయ విద్యాభవన్ ఎంతో గొప్పదని కీర్తించారు. ఉన్నతమైన సంకల్పంతో కె.ఎన్. మున్షీ భారతీయ విద్యాభవన్‌ను స్థాపించారని తెలిపారు. భారతీయ విద్యాభవన్‌కు టీటీడీ సహకారం అందించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలు నేర్చుకోవాలని సూచించారు. స్వశక్తితో సొంతకాళ్లపై ప్రతి ఒక్కరూ నిలబడాలంటే విద్య ఎంతో అవసరమని అన్నారు. విద్యావిధానంలో మార్పుకోసం విద్యావేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.