వెలవెలబోతున్న వెంకటాపురం
నిన్నటి వరకు ఆ ప్రాంతాలు పచ్చగా కళకళలాడాయి.. జనం రాకపోకలతో సందడిగా కనిపించాయి. ఒక్కరోజులోనే పరిస్థితి తిరగబడింది. పచ్చదనం హరించుకుపోయింది. సందడి స్థానంలో నిశ్శబ్దం తాండవిస్తోంది.దీనంతటికీ కారణంగా.. గురువారం వేకువజామున మృత్యుగ్యాస్ దాడి చేయడమే.. ఆదమరిచి ఉన్న వేళ జరిగిన ఈ దాడితో భీతిల్లిన జనం తలోదిక్కుకూ తరలిపోవడంతో ఆర్‌ఆర్‌వెంకటాపురం పరిసర గ్రామాలు శుక్రవారం కూడా నిర్మానుష్యంగా కనిపించాయి.
గురువారం అర్ధరాత్రి నుంచి.. గ్యాస్ ట్యాంకు పేలిపోతుందని.. మళ్లీ భారీగా గ్యాస్ లీక్ అవుతోందని.. పోలీసులే ప్రజలను తరలిస్తున్నారని.. ప్రమాద ప్రాంతానికి సుదూరంగా ఉన్న కంచరపాలెం తదితర ప్రాంతాల వారిని కూడా వెళ్లిపొమ్మంటున్నారని..ఇలా రకరకాల పుకార్ల షికార్లు.. కార్లు, బైకుల పరుగులు.. అలుపెరుగని నడక సాగించిన కాళ్లు.. అర్ధరాత్రి వేళ పిల్లాపాపలతో కట్టుబట్టలతో నగరంలోని చాలా ప్రాంతాల ప్రజల వలస.. వారితోనే రోడ్లన్నీ రద్దీగా మారడం.. వెరసి గురువారం రాత్రి నగరం నిద్రపోలేదు.
ఇక గ్యాస్ బాధిత గ్రామాల్లో శుక్రవారం ఉదయం గంభీరమైన పరిస్థితి. నిపుణుల బృందం గ్యాస్ అరికట్టే ప్రయత్నాలు, మంత్రుల పర్యటనలు, పారిశుధ్య చర్యలు చేపట్టిన కార్మికుల కార్యకలాపాలతో పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం అహర్నిశలూ శ్రమిస్తోంది.
సాక్షి, విశాఖపట్నం: విషవాయువు దుర్ఘటనతో ఎల్జీ పాలిమర్స్ సమీపంలోని ఐదు గ్రామాలు పూర్తిగా బోసిపోయాయి. గ్యాస్ లీకేజీ అరకట్టే చర్యలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్తగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. ఇంకా చాలామంది సమీప గ్రామాలవారు భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. స్టైరిన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఆర్‌ఆర్ వెంకటాపురంతో పాటు సమీపంలో ఉన్న వెంకటాపురం, నందమూరునగర్, ఎస్‌సీబీసీ కాలనీ, పద్మనాభనగర్ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ 5 గ్రామాల ప్రజల్లో 600 మంది ఆస్పత్రుల్లో ఉండగా.. వేల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ప్రాణాలతో మిగిలిన పశువుల్ని సైతం తమ వెంట తీసుకువెళ్లిపోవడంతో అంతటా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. గ్రామాల్లో ఉన్న చెట్లు, మొక్కలన్నీ.. విషవాయువు ధాటికి మాడిపోయాయి. ఇళ్లలో అక్వేరియంలో పెంచుకున్న చేపలు మృత్యువాత పడ్డాయి. కోళ్లు, మేకలు, ఆవులు, గేదెలు, దూడలు.. ఇలా.. మూగజీవాలన్నీ మృత్యు వాయువుకు బలయ్యాయి. చాలా ఇళ్లకు తాళాలు వెయ్యకుండానే ప్రజలు పరుగులు తీశారు. ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీసిన ప్రజలు.. తమ ఇళ్లు, సంపద ఏమవుతుందోనన్న ఆలోచన చెయ్యలేదు. కేవలం ప్రాణాలతో బయటపడితే చాలనే లక్ష్యంతో తోచిన దిక్కుకల్లా పరుగులు తీశారు. గురువారం తెల్లవారుజాము నుంచి శుక్రవారం రాత్రితెల్లవార్లూ ఇదే కొనసాగడంతో మొత్తం గ్రామాలన్నీ ఖాళీ అయిపోయాయి.
కుటుంబంలో భాగమైన మూగజీవాలూ...
సాధారణంగా పశువుల్ని గ్రామాల్లో సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. వాటికేం జరిగినా విలవిల్లాడిపోతారు. అలాంటిది.. ప్రాణాలు కోల్పోయి.. విగతజీవులుగా పడిఉన్న తమ పశువుల్ని చూడటానికి కూడా యజమానులు రాని పరిస్థితి. దీంతో.. జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది.. మూగజీవాల్ని ఖననం చేసేందుకు గ్రామం నుంచి తరలించారు.
గ్యాస్ పీడ విరగడ! 24 గంటల్లో పూర్తిగా అదుపులోకి
విశాఖపట్నం: గ్యాస్ లీక్ పీడ క్రమంగా విరగడ అవుతోంది. నాగ్‌పూర్, పూణేల నుంచి వచ్చిన నిపుణుల బృందం ఎల్జీ పాలిమర్స్‌లోని ట్యాంక్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీక్‌ను అరకట్టే ప్రత్యేక ఆపరేషన్‌ను గురువారం అర్ధరాత్రే ప్రారంభించింది. శుక్రవారం రాత్రికే పరిస్థితి చాలా వరకు అదుపులోకి వచ్చింది. గ్యాస్ ట్యాంక్ ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మరోవైపు లీకేజీ కారణంగా ఏర్పడిన వాయు కాలుష్య పరిస్థితిని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ప్రత్యేక వాహనం ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఉష్ణోగ్రత పెరగకుండా చర్యలు
స్టైరిన్ గ్యాస్ నిల్వ చేసిన ట్యాంకు ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీలు మధ్య ఉండాలి. దానికి మించిపోవడం వల్లే ఒత్తిడి పెరిగి గ్యాస్ లీక్ అయినట్లు నిపుణుల బృందం తేల్చింది. ఆ మేరకు ఉష్ణోగ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంది. ఫలితంగా శుక్రవారం రాత్రి వరకు ట్యాంకులోని సుమారు 70 శాతం స్టైరిన్ పల్మరైజ్ అయ్యింది. మరో 24 గంటల్లో పూర్తిగా పల్మరైజ్ అయ్యి గ్యాస్ లీకేజీ పూర్తిగా ఆగిపోతుందని నిపుణుల బృందం సభ్యులు జిల్లా అధికారులకు భరోసా ఇచ్చారు. కంపెనీ ప్రతినిధులతో పాటు నిపుణుల బృందం సభ్యులతో జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితి తెలుసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోడానికి ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. నావికాదళం సేవలను సైతం వినియోగించుకోవాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment